డల్లాస్: విభిన్న కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారికి సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఈ ఆదివారం డల్లాస్ లోని తెలుగువారందరికీ ఒక చిరు కానుకను అందించింది. స్థానిక దేశీప్లాజా సమన్వయంతో కారల్టన్ లోని వెనీషియాన్ థియేటర్ లో 'గురు' తెలుగు చిత్ర ప్రదర్శనను డల్లాస్ వాసులందరికీ ఉచితంగా ఏర్పాటు చేసింది. తెలుగు చిత్ర నిర్మాణంలో తాజాగా వస్తున్న కొత్త తరహా చిత్రాల కోవలోకి చెందిన గురు చిత్రం స్థానికులను విశేషంగా ఆకట్టుకొంది. దీక్ష, పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలైనా దాటి విజయాన్ని అందుకోవచ్చని ఈ చిత్రం చాటింది. ఈ సందేశాత్మక చిత్రాన్ని ఉచిత ప్రదర్శనకు ఎంచుకొన్నందుకు ప్రేక్షకులు నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని నాట్స్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ మార్నేని, అమర్ అన్నే, బాపు నూతి , శ్రీనివాస్ కోనేరు,విజయ్ వెలమూరి, శేఖర్ అన్నే, చౌదరి అచంట, శ్రీనివాస్ కొమ్మినేని, చైత్యన్య కంచర్ల, వీణ యలమంచిలి, కిషోర్ వీరగంధం, రామకృష్ణ నిమ్మగడ్డ, డల్లాస్ ఇతర కార్యవర్గ సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 300 మంది ప్రేక్షకులు హాజరై ఈ మూవీని తిలకించారు. డల్లాస్ చాఫ్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని కార్యక్రమ స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.