అక్కడ జీవితమే ఒక సర్దుబాటు
విశ్లేషణ
జనంతో నిండి ఉండే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా.
ప్రజలు తమ నగరాలకు ఒక గుణశీలతను కల్పిస్తూ వాటిని తీర్చిదిద్దుతారా లేక నగరాలు తమ నివాస ప్రజల ‘ప్రవర్తన’ను తీర్చిదిద్దుతాయా? ఒకటి మరొకదాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ముంబైలో మాత్రం అవినీ తిపరులైన శక్తులు బలవంతంగా తమపై రుద్దుతున్న పథకాలకు సంబంధించి ప్రజలకు ఎంచుకునే అవకాశాలు చాలా తక్కువ. నగర ప్రజలు ఎలా సర్దుకుపోవాలో నేర్చుకుంటారు. ప్రత్యేకించి ముంబై బతకడానికే తప్ప నివసించడానికి తగిన అవకాశం కాదు.
రాజకీయనేతలు, అవినీతిపరులైన అధికార వర్గం ద్వారా ఏర్పడుతున్న మానవ నిర్మిత సంక్షోభాన్ని చాలావరకు నగర ప్రజలు సహించాల్సి ఉంటుందనే దీనర్థం. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నత్తనడక నడుస్తూ కాల వ్యవధిని పాటిం చని బస్సుల కోసం ముంబై ప్రజలు బస్టాండులలో క్యూ కట్టరు. అదేసమయంలో నిత్యం తోసుకుంటూ పెనుగులాడుతూ ప్రయాణించవలసిన రైలు ప్రయాణాన్నే వీరు ఎంచుకోవలసి ఉంటుంది.
ముంబైలో ఏ స్థానిక రైలులో అయినా ప్రవేశిం చేటప్పుడు తోసుకోవడం, పెనుగులాడటం చాలా సాధారణమైన అనుభవం. రైలులో ఉన్నవారు దిగటం కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. ఎందుకంటే కొత్త వారు బోగీలో ప్రవేశించడానికి అది కొంత స్థలాన్ని కల్పిస్తుంది మరి. ఈ మొత్తం క్రమం 20 సెకన్లలోపే ముగుస్తుంది. పెద్ద స్టేషన్లలో మాత్రం రైళ్లు కాస్త ఎక్కువసేపు అంటే 30 నుంచి 45 సెకన్లవరకు నిలుస్తాయి. అంటే ప్లాట్‌ఫామ్‌ల మీద ఉన్న ప్రయాణికులకు సెకను సమయం కూడా చాలా విలువైనదే.
రెప్పపాటు కాలంలో గుంపు కోచ్ నుంచి దిగుతూ, లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ప్రతి పనిదినాన కనీసం 80 లక్షలమంది ప్రయాణించే బృహత్ వ్యవస్థలో ప్రతి నిమిషం కనిపించే నియంత్రిత ఉపద్రవం అన్నమాట. ఆదివారాలు, సెలవుల్లో మాత్రమే ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంటుంది. జనం రద్దీతో నిండిపోయే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా. ఒక చోట నివాసముంటూ మరొకచోటికి వెళ్లి పనిచేసి తిరిగి రావడం తప్పదు. పనే ముఖ్యం కాబట్టి దానికి సంబంధించినంతవరకు అన్ని రాజీలూ, సర్దుబాట్లూ క్రమంలోనే ఉంటాయి.
ఇక రెండో తరగతి కోచ్‌లలో ముగ్గురు ప్రయాణించే సీటులో నాలుగో ప్రయాణికుడు కాస్త బతి మిలాడుకుని సీటులో కూర్చోవచ్చు. అయితే అతడు సగం సీటులోనే కూర్చోవాల్సి ఉంటుంది. కానీ నిలబడి చిత్రహింసలు అనుభవించే స్థితితో పోలిస్తే ఇది పెద్ద ఉపశమనమే. మొదటి తరగతి కోచ్‌లో ఇలాంటి సర్దుబాటుకు అవకాశమే ఉండదు. వీటిలో ప్రయాణించేవారు మురికివాడల మధ్య గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారే.
నగరంలో తిరిగే రైళ్లను దక్షిణాన కొలాబా, ములంద్, దషిర్, ఉత్తరాన మంకుర్డ్ మధ్య మునిసిపల్ పరిధులకు పరిమితం కాని బృహన్ ముంబైకి సంబంధించిన అతి సూక్ష్మప్రపంచంగా చెప్పవచ్చు. మూడింట రెండు వంతుల మంది ముంబైలో నివసిస్తుండగా, మిగిలిన ఒకవంతు మంది మెట్రో ప్రాంతంలో నివసిస్తుంటారు. ఎనిమిది నగర కార్పొరేషన్లలో, 23 కౌన్సిల్స్‌లో మెట్రో ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాలన్నింటి వైఖరి ఒకటే.
జనాభా పరిమాణం ప్రజలకు సంబంధించిన అనేక లక్షణాలను నిర్దేశిస్తూ ఉంటుందనడానికి బోలెడు సాక్ష్యాలు. వీటిలో కొన్ని వారిని నిత్యం బలీయంగా ప్రభావితం చేస్తుంటాయి. పెరుగుతున్న ధరలతో కుంగిపోతున్న చిన్నచిన్న అపార్ట్‌మెంట్లకే ఇది పరిమితం కాదు. జీవితం ఇక్కడ నిత్యం సర్దుబాట్లతోనే సాగుతుంది. మనుషులు నడిచే పై వంతెనలను ఉపయోగించేటప్పుడు కూడా ఈ తరహా సర్దుబాటు కనిపిస్తూనే ఉంటుంది.
రైల్వే స్టేషన్లలో నడవాల్సిన మార్గం పట్ల అవగాహన లేని లేదా నగరానికి కొత్త అయిన ప్రయాణీకులు కుడివైపునే నడుస్తుంటారు. ప్రయాణీకులను సులువుగా దాటుకుంటూ పోవడానికి జనం ఎప్పుడూ ఎడమవైపే నడుస్తుంటారు. కానీ ఆ దారుల మధ్యే హాకర్లను అనుమతిస్తూ ప్రయాణ మార్గాన్ని అడ్డుకునే అధికారులను కూడా మీరు లెక్కించవచ్చు. కొంతమంది ప్రయాణికులు కాలుమీద కాలు వేసుకుని రైలులో ప్రయాణిస్తుంటారు.
ఇలా కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం ప్రయాణికులకు కాస్త సౌకర్యాన్ని కల్పించవచ్చు కానీ, వేలాడుతున్న మోకాలు రైలు ఒకవైపునకు ఒరిగినప్పుడల్లా ఎదుటి సీటులో కూర్చున్న ప్రయాణికుడికి తగులుతూ ఉంటుంది. ఇవి ముంబైవాసుల రైలు మర్యాదల్లో భాగమే. రైళ్లలో సౌకర్యాలకు దూరమైన గుంపులు పెట్టే బాధలతో పాటు వ్యక్తులు కూడా ప్రయాణికులకు మరింత భారాన్ని జోడిస్తుంటారు. కానీ ఎవరూ ఇలాంటి స్థితిపట్ల ఫిర్యాదు చేయరు. ఇదే ముంబై స్ఫూర్తి పట్ల ఎప్పుడూ దురభిప్రాయం కలిగించే లక్షణం.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com