మోదీ కేర్ ప్రతీకాత్మక చిత్రం
2016లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. కానీ అది అమలులోకి రాలేదు. 2017 బడ్జెట్ ప్రసంగంలో దీన్ని ప్రస్తావించలేదు. మళ్లీ కొత్త పథకం తేవడంలో అర్థం ఏమిటి?
జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం’ అనే అస్పష్టమైన పదాలున్నాయి. ఇది ఇటీవల పార్లమెంటుకు సమర్పిం చిన కేంద్ర బడ్జెట్ స్వయంగా చాటుకున్న పదబంధం. ఈ కార్యక్రమం పరిధిలోకి 10 కోట్ల కుటుంబాలు రానున్నాయి. కుటుంబానికి సగటున 5గురు సభ్యులని భావిస్తే మొత్తం 50 కోట్లమంది భారతీయులు అంటే జనాభాలో మూడోవంతు మంది ఈ పథకం కిందికి వస్తారు.
ఏడాదికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాగా పొందటం అంటే భారతీయ కుటుంబాలకు నిజంగానే అదొక వరం. దేశంలో చాలామంది అతి స్వల్పమాత్రపు వైద్య ఖర్చులను కూడా భరించలేని స్థితిలో ఉంటున్నారు. మంచి ఆరోగ్య సేవలందించే ఆసుపత్రి వద్దకు ప్రయాణ ఖర్చులు భరించడం కూడా చాలామందికి కష్టమవుతోంది. తమ వేతనాలు కోల్పోవలసిరావడం, కుటుంబాలు ఎదుర్కొనే విషాద పరిస్థితుల గురించి చెప్ప పనిలేదు. కుటుంబంలో సంపాదనపరుడికి వైద్యఖర్చుల భారం మరణంతో సమానమే. దురాశాపరులైన వడ్డీ వ్యాపారుల నుంచి, ఇతరత్రా వైద్య ఖర్చులకోసం తీసుకునే రుణాలను కుటుంబాలు తట్టుకోలేవు.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా ఎప్పుడు, ఎలా అమలు చేస్తారన్నది మనకు తెలీదు. ఈ భారీ పథకానికి అయ్యే వ్యయం గురించి.. ప్రభుత్వం మనకు తెలియపర్చడం లేదు. ఎంత వ్యయం అవుతుందనే అంశాన్ని స్పష్టం చేయకుంటే ఏ ప్రకటనైనా సరే పురుడు పోసుకోవడం కష్టం. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో తెలీదు. ఎందుకంటే 40 శాతం ఖర్చును అవే భరించాలి.
అయితే ఏ రాష్ట్రం కూడా దీన్ని దాటవేయాలని భావించదు. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు తమ ఆర్థిక వనరులను పునర్నిర్మించుకోవలసి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. ఒక బ్లాగులో ప్రచురించిన పరిశోధనా పత్రం ఈ పథకం అమలు గురించి తీవ్ర సందేహాలను వ్యక్తపరిచింది.
ఈ పరిశోధనా పత్ర రచయిత్రి మీటా చౌదరి ఒక ఫ్యాకల్టీ మెంబర్. ఆమె అభిప్రాయం ప్రకారం, ‘2016 లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. ప్రతి బీపీఎల్ కుటుంబానికి ఏటా రూ. 1 లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులను ఈ పథకం కింద అందించడమవుతుంది. కానీ ఆ పథకం అమలులోకి రాలేదు. పైగా 2017 బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన కూడా చేయలేదు. ఆనాటి పాత భావనను నేడు కొత్త భావనలో కలిపేశారని మనం భావించినప్పటికీ, అది ఇప్పటికీ కాగితంమీది భావనగానే ఎందుకు మిగిలి ఉందనే ప్రశ్నకు సమాధానాలు లేవు. పైగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధుల పరిమాణం, ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు, దాన్ని అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఆరునెలల్లోపు ఈ పథకాన్ని అమలు చేస్తారన్న అంచనా ఉంటోంది.
ఈ అంశంలో అర్థం చేసుకోవలసిన మరొక విషయం కూడా ఉంది. ప్రైవేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ ఖర్చుల విషయంలో, అనవసరమైన ప్రక్రియల నిర్వహణలో పేరుమోసి ఉన్నాయి. బీమా సంస్థలు వాటిలో కొన్నింటిని అనుమతించనప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా పెంచే ఇతర ఖర్చులు కూడా రోగులపై పడే అవకాశముంది. దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు ఏటా రూ. 5 లక్షలను ఆరోగ్య సంరక్షణ కింద అందించడం నిజంగా వరంలాంటిది. అయితే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ రంగమే దీనిద్వారా లబ్ధి పొందుతుంది. ఇప్పటికే వీటి సామర్థ్యం అవసరానికి మించి పెరిగిపోయి ఉన్నప్పటికీ ఈ కొత్త మార్కెట్‌ను వేగంగా వినియోగించుకునే అవకాశం వీటికే ఉంది.
విరాళాల ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దేశీయంగా ఎంతో బలహీనంగా ఉంది. కొనసాగుతున్న కొద్ది సంస్థలను పాలనాపరంగా, వైద్యపరంగా కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. వైద్యుల కొరత, మందుల కొరత, డిమాండ్‌తో పోలిస్తే ఎప్పటికీ సరిపోలని అతి తక్కువ నిష్పత్తితో ఉండటం వంటివి ప్రభుత్వ వైద్య వ్యవస్థలకు వినాశ హేతువులుగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఆరోగ్య పథకాలను, వ్యవస్థలను ఎలా నడుపుతున్నాయనేది తెలిసిన విషయమే. కాబట్టి ప్రభుత్వ వైద్య వ్యవస్థలో మార్పులకు సంబంధించిన ప్రకటనలు అమలులో మాత్రం నత్తనడక సాగిస్తాయి. దీంతో అధిక బిల్లులతో ప్రజల ఊపిరి తీసే ప్రైవేట్ రంగం మరింత పెరుగుతూనే ఉంటుంది.
జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాలకు ప్రభుత్వం కేటాయించేది పెద్దగా ఉండకపోవడం, ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెరుగుదలకు రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం వంటి వాటి నేపథ్యంలో కనీసం రూ. 1.5 లక్షల ఆరోగ్య పథకానికి రూ. 1,200 కోట్ల కేటాయించడం కూడా చాలా పెద్ద లక్ష్యమే అవుతుంది. ప్రైవేట్ రంగం, వితరణశీలురు ఆరోగ్య సంరక్షణకు ఇస్తున్న తోడ్పాటు నిధుల కేటాయింపులో ప్రభుత్వ నిబద్ధతను సందిగ్ధావస్థలోకి నెడుతున్నాయి.
- మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment