సహచరులపై స.హ. దుర్మార్గం?
విశ్లేషణ
జనహిత సమాచారం తీసుకోవడా నికే సమాచార హక్కు. చట్టబద్ధమైన హక్కులు కాపాడుకోవడానికి పనికి వచ్చే సమాచారాన్నీ కోరవచ్చు. కాని సహచరులను వేధించడానికి పుంఖా నుపుంఖాలుగా దరఖాస్తులు పెడితే అది దుర్మార్గమూ, దుర్వినియో గమూ అవుతుంది, ఆ పని చేసిన ఉద్యోగిపై దుష్ర్పవర్తన కింద యజ మానులు క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు.
ఢిల్లీ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగ శాలలో, గ్రంథాలయంలో పనిచేసే ఇద్దరు సహాయ ఉద్యో గులు తమకు ప్రమోషన్ ఇవ్వలేదని కళాశాల యాజమాన్యం మీద పగబ ట్టారు. కొందరు తమ ప్రమోషన్‌ను అడ్డుకుంటున్నారని వీరు భావించారు. తమపైన ఫిర్యాదు చేశారని, క్రమశిక్షణా చర్య తీసుకున్నారని, సాక్ష్యం చెప్పారని కొందరిని అనుమానించి వారి గురించి ఆర్టీఐ ప్రశ్నలు వేశారు. వారి దాడికి ప్రిన్సిపల్ కూడా గురయ్యారు.
వారి రెండో అప్పీలు విచారణకు వచ్చినప్పుడు అయి దుగురు ఉద్యోగులు హాజరై, ఈ ఇద్దరు దుర్మార్గుల సమాచార అభ్యర్థనలకు అంతులేకుండా పోతున్నదని వాపోయారు. ఆఫీసులో పనిచేయకుండా పనివేళలను సమాచార ప్రశ్నలు తయారు చేయడానికి, కుట్రలు చేయడానికి వాడుకుంటు న్నారని, పాఠాలు చెప్పరని, విద్యార్థులకు సాయం చేయడం లేదనీ, వీరు అడిగే సమాచారమంతా స్వార్థం, పగ, ప్రతీకా రంతో కూడినవేనని మొరపెట్టుకున్నారు.
ఒక మహిళ.. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా వీడియో తీసి, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అతడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడని చెబుతూ ఒక ఉపా ధ్యాయిని ఒక ప్రింట్ అవుట్ సమర్పించింది. ఈ దుర్వినియోగ ఉద్యోగి ఫొటో అతని వ్యాఖ్యానాలతో సహా వీడియో చూస్తే అతనే కారకుడని తేలిపోతుంది. పని చేయకుండా సహచరుల పనులు చెడగొడుతూ, ప్రభుత్వ సంస్థను నిస్సహాయ స్థితికి తీసుకువస్తే అంతకన్నా హాని ఏముంటుందని, ఈ చట్టం వచ్చింది ఇందుకు కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలోని తమ సహచరు లందరూ ఈ ఇద్దరు దుర్మార్గుల దుర్వినియోగ సమాచార ప్రశ్నలకు ఫైళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారని ఉద్యోగులు కమిషన్‌కు విన్నవించారు. లిఖిత పూర్వకంగా వీరి దుర్మా ర్గాలను వివరించారు. ప్రిన్సిపల్ తనను ఈ ఇద్దరి వేధింపుల నుంచి విముక్తులను చేయాలని కోరారు. సహచరుల వైద్య ఖర్చుల బిల్లులు, రోగాలు తదితర వ్యక్తిగత వివరాలు కోరే హక్కుపై పరిమితులున్నాయి. అన్నింటినీ వక్రీకరించి వేధిస్తున్నారని చాలా వివరంగా ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. సమస్యా పరిష్కార విభాగాన్ని కూడా వారు దుర్వినియోగం చేసారు. వారు చేసిన 36 ఫిర్యాదులు ఒకే రకమైనవి. అసలవి ఫిర్యాదులే కాదు. వేధింపు ఉత్తరాలని చెప్పి వాటిని తిరస్క రించారు. ఆ వివరాలన్నీ కమిషన్ ముందుంచారు.
అంబేడ్కర్ కాలేజీ వీడియో తీసి వాట్సప్, ఫేస్‌బుక్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇండియన్ పీనల్ కోడ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నేరం అవుతాయి. వ్యక్తులు తమ స్థాయిలోనూ, కళాశాల యాజమాన్యం తమ స్థాయిలోనూ ఈ దుర్మార్గులపై చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టాలను వినియోగించే అధికారం ఉందని తెలియక ఏ చర్యలూ తీసుకోకపోవడం వల్ల దుర్మార్గుల ఆటలు సాగు తున్నాయి.
అంబేడ్కర్ కాలేజీలో పనిచేసే ఒక మహిళ.. తమ కళాశాలలోని సహాయ ఉద్యోగులలో ఒక వ్యక్తి తనపైన దుష్ర్ప చారం చేస్తున్నాడని ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాల స్థాయిలో నోటీసు ఇచ్చి చర్య తీసుకోవలసిన విషయ మని మహిళా కమిషన్ భావించింది. ఆ చర్య తీసుకోక పోవడం వల్ల ఈ దుర్మార్గుడికి బలం చేకూరింది. ఆ సహచర ఉద్యోగి వివరాలను, అనవసర సమాచారాన్ని, వ్యక్తిగత సమా చారాన్ని ఇవ్వాలని అతడు వేధించసాగాడు. సమాచార చట్టంపై పూర్తి అవగాహన లేని వారు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని తెలియని వారు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక దేహశుద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే చిన్న చిన్న సంస్థలలో జరిగే ఇలాంటి వాటిని మీడియా పట్టించుకోదు. కనుక వీరి గురించి అందరికీ తెలియదు. కాని చర్య తీసుకునే అధికారాన్ని విద్యా సంస్థల యాజమాన్యం వినియోగించుకోకపోవడం వల్ల దుర్విని యోగం పెరుగుతున్నది. మౌనంగా భరిస్తూ ఏడ్వడం వల్ల దుర్మార్గం విజృంభిస్తుంది. క్రమశిక్షణా చర్య ఒక్కటి గట్టిగా తీసుకుంటే చాలు వీరి ఆట కట్టయిపోతుంది.
ప్రభుత్వ సంస్థలు కీలకమైన పనులు చేయనీయకుండా అడ్డుకునే దుర్వినియోగదారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా సంస్థల అధికారులు పరిశీలించి, దానికి సమంజసమైన విధానాన్ని, ప్రక్రియను రూపొం దించాలి. క్రమశిక్షణా నియమాల్లో పారదర్శకతకు స్థానం కల్పిస్తూనే దుర్వినియోగ వ్యతిరేక చర్యలపై నియమాలను కూడా చేర్చాలి.
ఇటువంటి దుర్వినియోగం వల్ల సహ చట్టం ఉనికికే ప్రమాదం వస్తుంది. మంచి పాలన కోసం ఆర్టీఐని వినియో గించాలి. సహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పనిచేయని, పనికిరాని ఉద్యోగులు సంస్థకు, ఈ చట్టానికి తీరని కీడు చేస్తారు. వీరిని ఉపేక్షించకూడదు. వీరిపైన క్రమశిక్షణా చర్య తీసుకోవాలి.
ఒక కళాశాలలో బాగా చదువుకున్న ఒక మహిళా ఉపా ధ్యాయురాలు పాఠాలు చెప్పకుండా పక్కవారిని వేధిస్తుంటే సక్రమంగా నోటీసు ఇచ్చి విచారణ జరిపి, వారి దుర్మార్గాన్ని రుజువు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. ఆ పని చేయవచ్చు కాని పగబట్టి స్వార్థంతో ఆర్టీఐని దుర్విని యోగం చేయడానికి వీల్లేదు.
పదవీ విరమణ చేసిన వృద్ధ ఉద్యోగి ఒకరు తనకు ఇరవై ఏళ్ల కిందట ప్రమోషన్ రాలేదనే కసితో వరసబెట్టి ఆర్టీఐ వాడసాగాడు. సమాచార కమిషన్ అతని దరఖాస్తులను కట్టగట్టి సమిష్టిగా విచారించి తిరస్కరించింది. ఇతని దుర్మా ర్గాన్ని దుష్ర్పవర్తనగా భావించి క్రమశిక్షణా చర్య తీసుకో వచ్చని, అందుకు సంబంధించిన నియమాలు రూపొం దించాలని కమిషన్ సూచించింది. (CIC/BS/A/2014/002319-SA, CIC/SA/A/2015/002028 కేసుల్లో సీఐసీ తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com