
చలం లేఖకుడు, అంతకుమించి...
స్మరణ
గుడిపాటి వెంకటాచలం అనుయాయిగా ఆయనతో సుదీర్ఘకాలం పయనించిన చిక్కాల కృష్ణారావు ప్రథమ వర్ధంతి డిసెంబర్ 30న. అరుణాచలంలో ఉన్న చలానికి ఉత్తరాలు రాసి ఆయన ఇచ్చిన జవాబులతో స్ఫూర్తి పొందిన కృష్ణారావు చలం చనిపోయేంత వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆంధ్రదేశం నుంచి చలానికి చాలామంది రాసే ఉత్తరాలకు చలం చెబుతుండగా కృష్ణారావే జవాబులు రాసేవారు. ఎంతోమంది రచయితలు, కళాకారులు చలాన్ని చూడటానికి వచ్చినప్పుడు వారందరితోనూ కృష్ణారావుకు పరిచయాలు కలిగాయి.
శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటివారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. 1979లో చలం దివంగతులైతే అక్కడి నుంచి భీమిలి వచ్చిన సౌరిస్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో కృష్ణారావు ఒకరు. చలం చనిపోయిన తర్వాత చిక్కాల తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. తనపై చలం వ్యక్తిత్వం, రమణ మహర్షి బోధనల ప్రభావం ఎంతో ఉందని కృష్ణారావు చెప్పేవారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నందున అందుకు సంబంధించిన రచనలే ఎక్కువ చేసారు. ఖలీల్ జిబ్రాన్– ప్రవక్త, కృష్ణాజీ జీవితం, భగవాన్ రమణ మహర్షి, జీసస్ స్మృతులు, మహాభిక్షు, బుద్ధం శరణం గచ్ఛామి, అసామాన్యుని ఆత్మకథ, జీవించు క్షణక్షణం, మోహరాత్రి వంటివి చిక్కాల కృష్ణారావు రచనలు. ఆయన తాత్విక చింతన ప్రతి రచనలోనూ కనిపిస్తుంది.
(వ్యాసకర్త : పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ 9490300587 )