
బోల్తాపడిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని ‘ఎలాగైనా...’ గెల్చుకోవాలన్న తపనతో రిపబ్లికన్ పార్టీ అమెరికా ప్రజలపై రుద్దిన అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ రోజు రోజుకీ తాను దిగజారుతూ ఎన్నికల స్థాయిని కూడా దిగజారుస్తున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యానాలు, ఆ దేశం ఎదుర్కొంటున్నదంటున్న సంక్షోభానికి ఆయన సూచించిన పరిష్కార మార్గాలూ ఎందరినో దిగ్భ్రాంతిపర్చగా ఇప్పుడు బయటికొచ్చిన పాత ఆడియో, వీడియో టేపులు ఆయనలోని మగ దురహంకారాన్ని, నీతిమాలినతనాన్ని వెల్లడించాయి. ఆయన మానసిక స్థితిగతులపై కొత్త సందేహం రేకెత్తించాయి. ట్రంప్ తీరుతెన్నులు చూసి రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకులు కొందరు నెమ్మదిగా జారుకుంటున్నా... ఆయన ఎంపికలో తమ పాపాన్ని వారు కప్పిపుచ్చుకోలేరు. ఇప్పుడింతగా చెలరేగి మాట్లాడుతున్న వ్యక్తి గురించి వారికి ఏ దశలోనూ అనుమానం తలెత్తలేదంటే తాము తెలివితక్కువవాళ్లమని ఒప్పుకోవాలి లేదా తమ దురాశే ఇలాంటి ఎంపికకు పురికొల్పిందని అంగీకరించాలి. ఈ రెండింటి మాటా ఎత్తకుండా ట్రంప్ వ్యక్తిత్వం ఇప్పుడే తెలిసొచ్చినట్టు మాట్లాడటం వంచన. నిజానికి రిపబ్లికన్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన విధానాల వికృత పర్యవసానమే ట్రంప్‌ను తెరపైకి తెచ్చింది.
ఇరాక్ అనే చిన్న దేశం నుంచి పెను ఉత్పాతం ముంచుకు రాబోతున్నదని ఊదరగొట్టి, లేనిపోని అబద్ధాలను ప్రచారంలో పెట్టి ప్రపంచాన్ని వంచించిన చరిత్ర రిపబ్లికన్లది. తమ పౌరుల్లో భయాందోళనలు రేపి ఇరాక్ దురాక్రమణకు రంగం సిద్ధం చేసుకుని ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చడాన్ని ఎవరూ మర్చిపోలేరు. సరిగ్గా అవే ఎత్తుగడలను ట్రంప్ అమెరికా ఎన్నికలకు కుదించాడు. ఒబామా వారసుల్ని ఓడించడం పార్టీలో తనతో పోటీ పడుతున్న టెడ్ క్రుజ్, జాన్ కాసిష్‌లాంటివారి వల్ల కాదని... దేన్నీ లెక్కచేయకుండా ఏమైనా మాట్లాడగలిగే తానే అందుకు అర్హుడినని నచ్చజెప్పగలిగాడు. లేని సమస్యలను ఉన్నట్టుగా భ్రమిం పజేసి, వాటికి పరిష్కార మార్గాలంటూ ట్రంప్ చిత్తం వచ్చినట్టు మాట్లాడుతుంటే పార్టీలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు సైతం నోరెత్తలేదు. చైనా వల్ల, భారత్ వల్ల, మెక్సికో వల్ల దేశానికి అన్యాయం జరిగిపోతున్నదన్న ప్రచారం లంకించు కుని... ఆ దేశాల పౌరులను గెంటేస్తే అంతా సర్దుకుంటుందని మభ్యపెడుతుంటే చిద్విలాసంగా ఉండిపోయారు. శ్వేత జాతి పౌరులను ఈ మాటలు ప్రభావితం చేస్తున్నాయన్న విశ్వాసం పెరిగినకొద్దీ రిపబ్లిన్‌లు ‘మానింది మందు...’అన్నట్టు అతన్ని సమర్ధించడం మొదలుపెట్టారు.
ఒక్క ట్రంప్‌ను మాత్రమే అనుకోవడానికి లేదు. ఇటు డెమొక్రటిక్ పార్టీ సైతం విశ్వసనీయత కలిగిన అభ్యర్థిని నిలపలేకపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికకు తొలిసారి మహిళా అభ్యర్థిని ఎంపిక చేయడం నిస్సందేహంగా మెచ్చదగ్గదే అయినా సజావుగా సాగుతున్న లిబియాలో నిష్కారణంగా నెత్తురుటేర్లు పారించడంలో హిల్లరీ పాత్ర తక్కువేమీ కాదు. ఆమె విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు క్లింటన్ ఫౌండేషన్‌కు నిధులు వరదలా పారడం, ఆ సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలపై దాని ప్రభావం ఉండటం ఎవరికీ తెలియంది కాదు. ఇక ప్రొటోకాల్ ప్రకారం మంత్రి హోదాలో అధికారిక సర్వర్ల ద్వారా మాత్రమే పంపాల్సిన ఈమె యిల్స్‌ను వ్యక్తిగత సర్వర్ ద్వారా పంపడం, అలా పంపిన మెయిల్స్‌లో అత్యంత రహస్యమని వర్గీకరించినవి సైతం ఉండటం ఆమె విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసింది.
ఇక అధ్యక్ష అభ్యర్థిత్వానికి పార్టీలో ఆమెతో పోటీపడ్డ బెర్నీ శాండర్స్‌ను ఓడించేందుకు తెర వెనక ఎన్ని ఎత్తులు వేశారో వికీలీక్స్ వెల్లడించింది. నిజానికి ఆయన లేవనెత్తిన అంశాలు అత్యంత ప్రధానమైనవి. వీటిపై తన వైఖరేమిటన్నది హిల్లరీ ఏనాడూ వెల్లడించలేదు. సరిగదా ఆయనకు ఖచ్చితంగా మద్దతు పలకగల రన్నవారు డెమొక్రటిక్ సదస్సుకు రాకుండా చూడటంలో ఆమె వర్గీయులు విజయం సాధించారు.
అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి ప్రత్యర్థి ఉండటమే ఆమెకిప్పుడు అనుకూ లాంశంగా మారిందనడంలో వింతేమీ లేదు. వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలు దీన్నే సూచిస్తాయి. చాలాసార్లు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఉండటం, ఒక్కోసారి ట్రంప్ ముందంజ వేయడం, హిల్లరీ ఆధిక్యత స్వల్పంగా ఉండటం వంటివి అమెరికా ప్రజల నిరాశానిస్పృహలనూ... ఎటూ తేల్చుకోలేని మనస్తత్వాన్ని తెలియపరుస్తాయి. ప్రత్యర్థిపై వ్యతిరేక ప్రచారం చేయడాన్నే ఇద్దరూ ఆశ్రయిం చారు తప్ప తమ విధానాలేమిటో, వాటి విశిష్టతలేమిటో చెప్పిన పాపాన పోలేదు. ఈ ప్రచారంలో వివిధ సందర్భాల్లో ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అత్యంత భయంకరమైనవి. నాగరిక సమాజాల్లో ఎవరూ అంగీకరించలేనివి. నల్లజాతీ యులపై, ముస్లింలపై ద్వేషాన్ని రగల్చడం... మహిళలను అత్యంత దారుణంగా కించపరుస్తూ మాట్లాడటంవంటివి ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంతో అభివృద్ధి సాధించినట్టు చెప్పుకునే అమెరికా సమాజంలో మహిళలను ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం తగ్గలేదు.
దాన్ని ఎంతో మెరుగుపరచవలసిన అవసరం ఉన్న తరుణంలో ట్రంప్‌లాంటి కనీస విలువల్లేని వ్యక్తి అధ్యక్ష పీఠంపై కూర్చుంటే ఆ దేశం గతి ఏమవుతుందో సులభంగానే అంచనా వేయొచ్చు. చేసిన తప్పులు వెల్లడైనప్పుడు ఎవరైనా క్షమాపణ కోరడం సహజం. అలా కోరే వ్యక్తికి కొన్ని లక్షణాలుండాలి. గండం గట్టెక్కుదామని కాకుండా చిత్తశుద్ధితో, పశ్చాత్తాప హృదయంతో ఆ పని చేసినట్టు అందరికీ కనబడాలి. తన కుమార్తెను గురించి చేసిన వ్యాఖ్యలు, ఒక మోడల్ గురించి వేరొకరితో మాట్లాడిన మాటలు బయటపడ్డాక ట్రంప్ కూడా సారీ చెప్పాడు. అయితే అందులో ఏమాత్రం నిజాయితీ లేదని దానికి కొనసాగింపుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయి. అమెరికా ఎన్నికల వ్యవస్థలోని అనుకూలాంశం గురించి చెప్పుకోవాలి. అధ్యక్ష పీఠానికి పోటీపడేవారి గుణగణాలేమిటో, వారి సత్తా ఎంతో అభ్యర్థుల మధ్య జరిగే చర్చలు తేల్చేస్తాయి. వారి గతమేమిటో బహిరంగమవుతుంది. ఎంపిక చేసుకోవడం ఓటర్లకు తేలికవుతుంది. ఇప్పుడు ట్రంప్ పల్టీలు కొట్టడం దాని పర్యవసానమే.