అవలోకనం
మన ఆర్థిక చరిత్రలో ఒక వింత దశ గుండా ప్రయాణిస్తున్నాం. ఈ సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి -జీడీపీ-లో 9 శాతం పెరుగుదల సాధించే అవకాశ ముందని ఆర్థిక మంత్రి ఇటీవలే మాట్లాడారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కీలక ఆర్థిక వ్యవస్థగా ఉంటోందన్న వాస్తవాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విజయ సంకేతంగా తరచుగా ఉదహరిస్తున్నారు. అధికారిక ప్రకటనలను బట్టి చూస్తే, కల్లోల ప్రపంచంలో భారత్ ఒక ప్రశాంత ఆర్థిక ద్వీపంగా కనిపిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని అనర్థ ఆర్థిక నిర్వహణలో చాలా భాగం ఇప్పుడు మన వెన్నంటే ఉంది.
ఈలోగా 2014లో నరేంద్రమోదీ కేంద్రంలో అధికారాన్ని స్వీకరించిన నాడు ఉన్న స్థాయికి మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. రూపాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. దానికి తోడుగా ప్రభుత్వ ఆశావాదానికి, మార్కెట్ల నిరాశా వాదానికి మధ్య పొంతన కుదరటం లేదు. మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో వర్ధమాన మార్కెట్ల విభాగాధిపతి రుచిర్ శర్మ, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్‌కి కొన్ని రోజుల క్రితం ఇచ్చిన అద్భుతమైన ఇంటర్వ్యూలో భారత ఆర్థిక పరిస్థితిపై కొన్ని కీలకమైన సూచనలు చేశారు.
రుచిర్ శర్మ సూచనల్లో మొదటిది.. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2015లో జీరో స్థాయికి పతనమైపోయింది.
రెండు.. ప్రపంచ వాణిజ్యంలో జీరో శాతం వృద్ధి నమోదు చారిత్రకంగా ఆర్థిక మాంద్య కాలంలోనే సంభవిం చింది. అంటే మనం ఇప్పటికే మాంద్యంలోకి ప్రవేశించా మని అర్థం. దీనికి మరొక సంకేతం ఏదంటే సగటున ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి మాంద్యం ఏర్పడేది. ఈ తర్కం బట్టి చూస్తే, అలాంటి మాంద్యం ఇప్పుడు పొంచి ఉంది.
మూడు.. భారత ఎగుమతులు 5 శాతం ప్రతికూల స్థాయికి పతనమయ్యాయి. అంటే ఎగుమతులు 5 శాతం ప్రతికూల వృద్ధిలో ఉన్నప్పుడు దేశం 8 శాతం వృద్ధి చెంద డం అసంభవం (భారత్ 8 శాతం వృద్ధి సాధించిన సమ యంలో మన ఎగుమతులు ఏటా 20 శాతం పెరుగుదల సాధించేవి).
నాలుగు. ప్రపంచంలోనే అత్యంత రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. ఇక నరేంద్రమోదీ పాలనలో జరిగిన సంస్కరణలు చాలా చాలా తక్కువే. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే, 2015 సంవత్సరంలో అత్యధిక రక్షణాత్మక చర్యలు చేపట్టిన రెండో దేశంగా భారత్‌కు చోటు దక్కింది. ఇది వ్యక్తిగతంగా నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎందుకంటే పలు సంస్కరణలను ప్రతిపక్షం అడ్డుకుంటోందన్న వార్తలే మనకు వినపడు తుంటాయి తప్ప, కేంద్ర ప్రభుత్వమే వాస్తవానికి సంస్క రణలను క్రియాశీలకంగా వెనక్కు మరలిస్తున్న విషయాన్ని మనం ఎన్నటికీ వినడం లేదు.
అయిదు. 500 భారతీయ అగ్రశ్రేణి సంస్థలు 2015లో జీరో శాతం అమ్మకాల వృద్ధిని చవిచూశాయి. తదను గుణంగా, 2016 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వీటి లాభ వృద్ధి ప్రతికూలంగానే ముగియనుంది. మన జీడీపీ వృద్ధి ఒత్తిడిలో ఉందనడానికి ఇది రెండో సంకేతం (క్షీణ ఎగుమతి వృద్ధితోపాటు).
ఆరు. ప్రభుత్వ జీడీపీ డేటాకు, కార్పొరేట్ వ్యవహా రశైలికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్లే భారత ప్రభుత్వ డేటా విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది.
దీనికి సంబంధించి మరికొన్ని కలవరపర్చే సూచికలూ ఉన్నాయి. రుణాల వృద్ధి (నూతన ఆర్థిక కార్యకలాపాలకు రుణాలు అని అర్థం) పతనమైంది. భారతీయ కార్పొరేట్ సంస్థలు పూర్తిగా రుణవలయంలో ఉన్నాయి. మన ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు అత్యధిక శాతంలో ఉంటున్నాయి.
మన ప్రభుత్వం మాత్రం తను ప్రకటించిన డేటాకు కట్టుబడి ఉంది. అంచనా ప్రాతిపదికన వ్యాప్తి చెందే సిద్ధాం తాల కంటే పన్ను వసూళ్లలో పెరుగుదల వంటి నిర్దిష్ట అంశాలకు విశ్వసనీయత అధికంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు విదేశీ పరపతి సంస్థలు 2016లో భారత్ అధిక వృద్ధి రేటును (దాదాపు 7 శాతం) సాధించ గలదన్న అంచనాలను కొనసాగిస్తున్నాయి. ఈ కథనం ప్రారంభంలో నేను ప్రస్తావించినట్లుగా ఇలాంటి పరిస్థితే వింతలను సృష్టిస్తోంది.
మన ఆర్థిక వ్యవస్థ నిజంగానే అద్భుతరూపంలో ఉండి 9 శాతం వృద్ధి రేటును చేరనుందా లేక పేలవంగా తయారై మందగిస్తోందా? ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడిందా లేక 2015ను అది సంస్కరణల వెనకడుగు సంవత్సరంగా మలిచిందా? ఈ రెండు విషయాలూ నిజం కాకపోవచ్చు. వీటిలో ఏదో ఒకటి నిజం కావలసి ఉంది. ప్రభుత్వం చెబుతున్న అంకెలకు, రుచిర్ శర్మ చెబుతున్న అంశాలకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకుంటోంది? ఆర్థిక మంత్రి ప్రకటిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మార్కెట్ ఎందుకు ప్రతిబిం బించడం లేదు? దేశీయ కారణాల వల్ల కాకుండా గ్లోబల్ సంకేతాల వల్లే ఇలా జరుగుతోందా?
ప్రభుత్వ డేటాను అంగీకరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు కానీ, ఇది ప్రధానమంత్రి మరింత ప్రత్య క్షంగా జోక్యం చేసుకోవలసిన సమస్య అని నేను భావిస్తున్నాను. నెల తర్వాత నెల గడిచేకొద్దీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నమోదవుతున్న గణాంకాలు ప్రభుత్వ ఆశావా దానికి అనుగుణంగా ఉండ కపోగా అవి మరింత అయో మయాన్ని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, మన ఎగుమ తులు క్షీణిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్ అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. పైగా పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధికి సంబంధించి ఎలాంటి అంచనాలూ కనిపించడం లేదు.
చివరకు, చమురు ధరలు కూడా వాస్తవంగా మనం భావిస్తున్న మంచివార్తలను అందివ్వడం లేదు. చమురు ధరలు మరింతగా తగ్గితే (లేదా బ్యారెల్‌కు ప్రస్తుతమున్న 30 డాలర్ల ధర వద్దే నిలిచిపోయినప్పటికీ ) అది వాస్తవానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెడువార్తే అవుతుంది. సర్వత్రా మాంద్యం అలముకుంటున్నదనటానికి ఇది సంకేతం కూడా.
మన్మోహన్‌సింగ్ హయాంతో పోలిస్తే మోదీ ప్రభు త్వంలో అత్యున్నత స్థానాల్లో అవినీతి చాలా తక్కువగా ఉండటం సంతోషకరమైన విషయమేనని నేను అంగీకరి స్తాను. కానీ ఇది చాలా చిన్న విషయం. భారతీయులకు అతి ముఖ్యమైన సమస్య.. దారిద్య్రం నుంచి వారిని త్వరగా బయటపడవేసే ఏకైక మార్గం ఏదంటే నిలకడైన అధిక వృద్ధి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం, దార్శనికత, లక్ష్యంపై స్పష్టత కలిగిన నేత ఉండి కూడా మనం అధిక వృద్ధిని సాధించనట్లయితే మనం నిజంగానే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లే.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com
క్షీణతను ఆపలేని గణాంకాలు..!
Published Sun, Jan 17 2016 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement
Advertisement