మారణహోమానికి మరో పేరు ‘గఢ్‌’ | sunitha reddy Special Interview with Nandini Sundar | Sakshi
Sakshi News home page

మారణహోమానికి మరో పేరు ‘గఢ్‌’

Published Wed, Jan 18 2017 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

మారణహోమానికి మరో పేరు ‘గఢ్‌’ - Sakshi

మారణహోమానికి మరో పేరు ‘గఢ్‌’

సునీతారెడ్డితో మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ బలగాలు చేస్తున్న చట్టవ్యతిరేక పనులు ప్రజలకు, రాజ్య యంత్రాంగానికి మధ్య జరుగుతున్నదానికే పరిమితం కాదని.. ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్‌ చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న విధ్వంసం, ప్రభుత్వబలగాలకు, మావోయిస్టులకు మధ్య సాగుతున్న సంకుల సమరంలో అక్కడి గిరిజనులు పదేళ్లుగా కంటినిండా నిద్రకు కూడా కరువయ్యారని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు ఆదే శాలు అమలుకాని రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ అపఖ్యాతి పొందిందని ఆరోపించారు. కోట్లాది రూపా యలు వెచ్చించి గిరిజన యువతను ప్రత్యేక పోలీసులుగా మార్చి వారి గ్రామాలపై వారినే దాడు లకు పంపించడం కంటే వారిని అక్కడే టీచర్లుగా నియమిస్తే ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందంటున్న నందినీ సుందర్‌ ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..

సోషియాలజీ విద్యార్థి నుంచి బస్తర్‌లో కార్యకర్త వరకు మీ ప్రయాణం ఎలా సాగింది?
ఇప్పటికీ నేను సోషియాలజీ విద్యార్థినే. బస్తర్‌ నాకెంతో నచ్చింది. అక్కడి వారి హక్కుల కోసం పోరాడాలనిపించింది. 1990లో విద్యార్థిగా తొలిసారి బస్తర్‌ సందర్శిం చాను. అక్కడి హక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, వేధింపులు నిజంగా వర్ణించలేనివి. గత 26 ఏళ్లుగా నా పరిశోధనలో భాగంగా బస్తర్‌లో ఎన్నో విషయాలు పరిశీలించాను.

రెండు దశాబ్దాల కింద బస్తర్‌ ఎలా ఉండేది?
బస్తర్‌ ఒక అద్భుతం. వర్ణించలేం. దేశంలోనే అదొక అందమైన అరణ్యం. ఇప్పడది పోలీసు క్యాంపుగా మారింది. చెట్లను నరికేసి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జగ్‌ దల్‌పూర్‌ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే విధ్వంస మేనని పర్యావరణ నివేదికలు కూడా చెబుతున్నాయి. అక్కడ జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశారు. స్థానికులను ఏమాత్రం పట్టించుకోలేదు.

గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో అక్కడ జరిగిన మార్పు ఏమిటి?
ఛత్తీస్‌గఢ్‌ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మైనింగ్‌ పాలసీని సరళీకరించారు. ప్రాజెక్టులకు పర్మిషన్‌ ఇచ్చారు. గూడేలను ఖాళీ చేయించారు. ఆ సమ యంలోనే మావోయిస్టులు వచ్చారు. వారికి పోటీగా సల్వాజుడుం మొదలైంది.

సల్వాజుడుం కంటే ముందు నక్సల్స్‌ బస్తర్‌కి ఎలా వచ్చారు?
1980లో నక్సల్స్‌ బస్తర్‌కు వచ్చారు. స్థానికులపై వాళ్లు బలమైన ముద్ర వేశారు. స్థానిక యంత్రాంగం చేయలేని పనులు చేశారు. భూపంపిణీ చేశారు. పట్వారీలకు, ఫారెస్టు గార్డులకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా నిల్చారు. స్థానికంగా భూపంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 30 ఏళ్ల వ్యవధిలో వాళ్లు ఆ ప్రాంతంపై పట్టు సాధిం చారు. వాస్తవానికి 1975–78 నుంచే బస్తర్‌లో గనుల తవ్వకం మొదలైంది. బైలదిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు అప్పటినుంచే కాలుష్యానికి గురయ్యాయి. ప్రజలకు సంబం« దించి చాలా తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

హక్కుల పరిరక్షణ సరే. కానీ మీలాంటి వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ఆరోపణ?
చాలామంది ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అసమానాభివృద్ధికి మాత్రమే వారు వ్యతిరేకం. అసలు అభి వృద్ధి అంటే ఏమిటి? పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు మేలు చేసేదా, ప్రజలకు మేలు కలిగించేదా? ప్రాజెక్టుల వల్ల నిర్వాసి తులవుతున్న వారికి అభివృద్ధి పేరుతో పోగుపడుతున్న సంపదలో వాటా కలిగిస్తే అది వారికి మేలు కలిగించే అభివృద్ధి. ప్రత్యేకించి వాతావరణ మార్పు జరుగుతున్న నేటి దశలో అభివృద్ధి గురించి పాతపద్ధతిలో మనం ఆలోచించలేం. ఆదివాసీలకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి, ప్రపంచానికి కూడా మేలు చేకూర్చగల ప్రత్యేక అభి వృద్ధి నమూనా కావాలి. ప్రతి ఒక్కరూ తమకు స్కూలు, ఆసుపత్రి, ఉపాధి ఇతర కనీస సౌకర్యాలను కోరుకుంటున్నారు. వాటిని పొందగలిగితే అది నిజమైన అభివృద్ధి.

మావోయిస్టు సానుభూతిపరురాలంటూ ఓ వైపు, మరోవైపు హత్యారోపణ.. ఎలా?
ఇది అర్థం పర్థంలేని వ్యవహారం. ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. ఇప్పుడయితే వారు తెలంగాణకు చెందిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిజనిర్ధారణ కమి టీలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ వెళుతున్నవారిని నిర్బంధించారు. గత ఏడాది డిసెంబర్‌ 25న నిజనిర్ధారణకు వెళ్లిన వారిలో హైకోర్టు లాయర్లు, జర్నలిస్టులు, ఆదివాసీ నేత, దళిత నేత కూడా ఉన్నారు. మావోయిస్టులతో లక్ష రూపాయల పెద్ద నోట్లు మార్చుకుంటున్నా రని వారిపై ఆరోపించారు. తెలంగాణ పోలీసులు వీరిని పట్టుకుని ఛత్తీస్‌గఢ్‌ పోలీసు లకు అప్పగించారు. చట్టపరమైన ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉన్నవారిని, వాటిని విమర్శించే వారిని ఏదో ఒక ఆరోపణతో అరెస్టు చేయడంలో భాగమే ఇది.
మా విషయానికి వస్తే 2011లో ఛత్తీస్‌గఢ్‌లో మూడు గిరిజన గూడేలను తగుల బెట్టారు. మహిళలపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయా  లంటూ న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అయిదేళ్ల విచారణ తర్వాత గిరిజన గూడేలను పోలీసులే తగులబెట్టారని సీబీఐ ఇటీవలే నివేదిక ఇస్తే ఛత్తీస్‌గఢ్‌ ఐజీ దాన్ని ఖండించారు. సీబీఐ అబద్దాలు చెబుతోందని డీఐజీ కల్లూరి ప్రెస్‌ వాళ్లను పిలిచి మరీ చెప్పారు. తర్వాత పోలీసులు మా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాతోటి పిటిష నర్లలో ఒకరైన మనీష్‌ కుంజాంపై దాడి చేశారు. ఈయన ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ నేత. ఆ తర్వాత వెంటనే మాపై కల్పిత హత్యానేరం మోపారు. హత్యకు గురైన వ్యక్తి భార్యే నాకు తెలీదన్నారు. ఆమె ఎవరి పేరూ చెప్పలేదు. ఆమెకు ఏమీ తెలీదు. హతుడి గ్రామ ప్రజలు కూడా మా పేర్లు చెప్పలేదు. ఆ కేసు వివరాలను చూస్తే ఇది పోలీసులు అల్లిన కట్టుకథే అని స్పష్టంగా తెలుస్తుంది.

జాతీయ మానవ హక్కుల సంస్థ నుంచి మీకు ఏమైనా మద్దతు దొరికిందా?
మా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారించడానికైనా, అరెస్టు చేయడానికైనా నాలుగు వారాల ముందే నోటీసు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ కార్య దర్శికి, ఐజీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో మేము కోర్టుకు వెళ్లవచ్చన్న మాట. అంటే గతంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కోర్టు మాకు రక్షణ కల్పించింది. మా విషయంలో వారు ఏం చేయాలనుకున్నా నాలుగు  వారాలకు ముందుగా నోటీసు ఇవ్వాలి. దాన్ని బట్టి మేం కోర్టును సంప్రదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే మీ ప్రత్యర్థిని జైలులో పెట్టడం ద్వారా మీరు కేసును ఎన్నటికీ గెలవలేరు.

న్యాయమూర్తులు చాలా శక్తివంతమైన ఆదేశాలిచ్చినా, అది అమలు జరుగుతోందా?
ఏమాత్రం అమలు జరగడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. సల్వాజుడుం సంస్థ ఏ పేరుతో కూడా ఎలాంటి చర్యలూ చేపట్టరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్పీవోల వ్యవస్థను నిషేధించాలని చెప్పింది. అక్కడి ఎస్పీని తొలగించాలని చెప్పింది. కేవలం ట్రాఫిక్‌ విభాగంలో మాత్రమే పోస్ట్‌ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు చెప్పినదానికి విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం చేసింది. కోర్టు అలా ఆర్డర్‌ ఇచ్చిన నాటినుంచి సల్వాజుడుం పేరు మాత్రమే మార్చింది. ఎస్పీఓలకు గతంలో కంటే ఇప్పుడే మంచి జీతాలు ఇస్తున్నారు. వాళ్లవద్ద ఇప్పటికీ ఏకే–47 తుపాకులున్నాయి. వాటితో వారు ప్రజలను కాల్చి చంపుతున్నారు. నిజానికి ఎస్పీవోలు తమ పేరు మార్చుకున్నాక ఛత్తీస్‌గఢ్‌లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో మార్పు వస్తుందంటారా?
అలాంటి మార్పు జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కొలంబి యాలో ప్రభుత్వానికి, గెరిల్లాలకు మధ్య నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత సయోధ్య కుదిరినప్పుడు అలాంటిది ఇక్క డెందుకు జరగదు? సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం శాంతిస్థాపన కోసం ఎవరో ఒకరు ఎందుకు చొరవ తీసుకోరని ప్రశ్నిం చింది. రాజకీయంగా తలుచుకుంటే శాంతిని నెలకొల్పలేరా? నక్సలైట్ల కాల్పుల్లో లేదా పోలీసుల కాల్పుల్లో చనిపోయినా నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలి.

నక్సల్స్‌ వ్యతిరేకం కార్యకలాపాలకు వెచ్చించే భారీ మొత్తంతో అభివృద్ధి చేయలేరా?
ఎందుకు చేయలేం. సల్వాజుడుం పేరుతో పోలీసులుగా తయారు చేసేకంటే వారికి టీచర్‌ ఉద్యోగమే మంచిది కదా. అలా చేసినప్పుడు ప్రజలు తమ ప్రభుత్వం గురించి ఆలోచించే తీరులో చాలా మార్పు వస్తుంది. ప్రజలు పెద్ద స్థాయిలో తమ స్వరాలు వినిపించినప్పుడు శాంతి తప్పక ఏర్పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌ గఢ్‌లో పరిస్థితి సరిగా లేదు. 5వ షెడ్యూల్‌ ప్రకారం, చట్టం ప్రకారం సంక్షేమ కార్య క్రమాలు జరిగేలా చూడాలి.

ఛత్తీస్‌గఢ్‌లో శాంతి సాధ్యమేనా?
పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు భయంతో బతుకుతున్నారు. సాధారణ జీవి తమే అక్కడ లేదు. తమ గూడెం ఉంటుందా లేదా అనే భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు గూడేన్ని భద్రతా బలగాలు చుట్టుముడతాయో తెలీదు. తమ గూడేల చుట్టూ పర్వతాలు ఉన్నా వారు శాంతియుతంగా రాత్రిపూట నిద్రించే పరిస్థితి ఉండటం లేదు. పదేళ్లుగా ఇదే పరిస్థితి. ఛత్తీస్‌గఢ్‌లో శాంతి సాధ్యమే కానీ చాలా సమయం పడు తుంది. ఆ విశ్వాసం నాకుంది.
(నందినీ సుందర్‌ ఇటీవల హైదరాబాద్‌ సందర్శించిన సందర్భంగా సాక్షికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది కొంత భాగం)
(నందినీ సుందర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/Ckn8np
https://www.youtube.com/watch?v=KG9pYret&Gc

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement