
గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి మావూరు కార్యక్రమంలో రెండోరోజు నిరసనలు కొనసాగాయి. జన్మభూమి పేరుతో ముఖ్యమంత్రి అధికారులను ఇబ్బంది పెడుతున్నారన్నారని, అయినా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. విశాఖ ఒకటో వార్డులో జరిగిన జన్మభూమిసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆరిలోవలో జూనియర్ కళాశాల, రైతు బజారు ఏర్పాటు చేయాలని, ఇవి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలంటూ సీపీఐ నాయకులు మంత్రిని నిలదీశారు.
♦ గాజువాకలో జరిగిన సభలో సమస్యలు చెప్పడానికి వేదిక వద్దకు వచ్చిన వార్ని టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. తమకు సంక్షేమ పథకాలు, స్కీములు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకునే అవకాశం ఇవ్వని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ప్రభుత్వానికి ఇదే చివరి జన్మభూమి అంటూ 64వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు పల్లా చినతల్లి పేర్కొనడంతో మైకు లాక్కొని ఆమెను బలవంతంగా అక్కడ నుంచి పంపించివేశారు. ఆమెతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
♦ కె.నగరపాలెం పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ‘మంగమారిపేట కొండప్రాంతంలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకుంటే పోలీసు బలగాలతో నేలమట్టం చేశారు.. సంపన్నులు బీచ్ ఒడ్డున మేడలు కట్టుకున్నా అధికారులెందుకు చర్యలు తీసుకోరు? పేదలకేనా సీఆర్‌జెడ్ నిబంధనలు’ అంటూ వైఎస్సార్‌సీపీ నాయకుడు వాసుపల్లి నల్లబాబు తహసీల్దారు గంగాధరరావును నిలదీశారు.
♦ హుకుంపేట మండలం వాల్డా గ్రామంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును స్థానిక సమస్యలపై గిరిజనులను నిలదీశారు. నాలుగేళ్లగా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదంటూ కిడారిపై మండిపడ్డారు. సర్దిచెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు చాలా సేపటి వరకు శాంతించలేదు. సీపీఎంకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు ధర్మయ్యదొర తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో సభను బాయ్‌కాట్ చేసి తమ అనుచరులతో బయటకు వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే గిడ్డికి చుక్కెదురు
పార్టీ ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి బృందాన్ని పంచాయతీ గిరిజనులు అడ్డగించారు. పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని కందమామిడి కూడలి నుంచి బంగారుమెట్ట వరకు పదిహేనేళ్ల క్రితం వేసిన తారురోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఈ విషయంపై గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఐదవ విడత జన్మభూమిని తాము బహిష్కరిస్తున్నామని పంచాయతీ సర్పంచ్ పాంగి నాగరాజు ముందుగానే ప్రకటించారు.
బుదవారం ఉదయం 9గంటలకు కందమామిడి జంక్షన్ వద్ద సర్పంచ్ నాగరాజు, గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం.శ్రీను, ఎల్. సుందర్‌రావు, పాలికి లక్కు, 21 గ్రామాల గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడను రావడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, నెలరోజుల్లో రోడ్డు నిర్మిస్తానని, నిర్మించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాని అందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని గిరిజనులు పట్టుబడటంతో ఆమె ఆవేశంతో ఊగిపోయారు. ఇకచేసేది లేక కూర్చొన్న గిరిజనుల మద్య నుంచి ఆమెను నడుకుచుకుంటూ రోడ్డు నిర్మాణానికి మీరే అడ్డంకి అని నినాదిస్తూ వనుగుపల్లికి వెళ్లారు.
ఇంత అన్యాయమా?
ఇది చాలా అన్యాయం. ప్రజల సమస్యలను చెబుతుంటే మైక్‌ను ఆపేస్తారా. ఇది ఎంతటి దుర్మార్గం. ఇక్కడకొచ్చి ప్రజల సమస్యలను చెప్పకుండా ప్రభుత్వానికి భజన చేయమంటారా? ప్రజల సమస్యలను చెబితే ఇక్కడి ప్రజాప్రతినిధులకు, టీడీపీ కార్యకర్తలకు నచ్చడంలేదు. అందుకే వారు నేను మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను కూడా కట్ చేశారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు ఎంతో దూరంలో లేదు.
– పల్లా చినతల్లి, మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు
సొంతింటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా..
నేను డ్రైవర్‌గా పని చేస్తున్నాను. గాజువాకలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. ఇల్లు కేటాయించాలని కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రతిసారి జన్మభూమిలో దరఖాస్తు చేస్తున్నాను. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – తుంపాల శ్రీరాములు, పాతగాజువాక
పింఛను కోసం ప్రదక్షిణలు
నా వయస్సు 68 సంవత్సరాలు. నా ఆధార్ కార్డులోను, రేషన్ కార్డులోను కూడా వయస్సు కరెక్టుగానే ఉంది. వృద్ధాప్య పింఛను ఇవ్వాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నాను. ఎమ్మెల్యేను కూడా అడిగాను. అయినప్పటికీ నా మొర ఎవరూ వినడంలేదు. వీళ్లు(టీడీపీ కార్యకర్తలు, పోలీసులు) మాత్రం మమ్మల్ని స్టేజి దగ్గరకు వెళ్లనివ్వడంలేదు. – తవిటయ్య, జోగవానిపాలెం
Comments
Please login to add a commentAdd a comment