
శింగవరం జన్మభూమి కార్యక్రమంలో బాలనరసింహుడిపై చిందులేస్తున్న టీడీపీ నాయకుడు
అధికార పార్టీ నాయకుల బెదిరింపులు.. దాడులు. అడుగడుగునా నిరసనలు.. నిలదీతలు. పోలీసులతో గెంటివేతలు.. భగ్గుమన్న సామాన్యులు.. ఏ ఊరికెళ్లినా అదే తీరు. ఇదీ జిల్లాలో రెండో రోజు చేపట్టిన జన్మభూమి–మాఊరు సభల కొనసాగింపు.
అనంతపురం అర్బన్ : జన్మభూమి మా ఊరు అంటేనే జనం అసహ్యించుకుంటున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన వారిని అధికార పార్టీ నాయకులు ఎక్కడ పోలీసులతో గెంటివేయిస్తారోనని జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా ఇన్‌పుట్ సబ్సిడీ, పింఛన్లు, పక్కా గృహాలు తదితర సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు.
ఎన్టీఆర్ ఇళ్ల కోసం ఎస్సీల నిలదీత..
రాయదుర్గం రూరల్ మండలం 74 ఉడేగోళం గ్రామంలో జరిగిన సభలో ఎన్టీఆర్ ఇళ్లు, ఇంటిపట్టాల కోసం అధికారులను దళిత కాలనీ వాసులు నిలదీశారు. ఎన్టీఆర్ ఇళ్లు ఇవ్వాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో మీ సమస్యల పరిష్కారం కోసం జన్మభూమి కార్యక్రమం అంటూ వచ్చారని అధికారులను, టీడీపీ సర్పంచ్ గురు సిద్దప్పను నిలదీశారు.
అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వరా ?
గుమ్మఘట్ట మండలం బేలోడు, భూపసముద్రం గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభలలో అర్హతలున్నా పింఛన్లు ఎందుకు ఇవ్వడంలేదని అధికారులను ప్రజలు నిలదీశారు. పలుమార్లు అర్జీలిచ్చినా అర్హత కలిగిన మాకు పింఛను ఎందుకివ్వడం లేదని సిద్దరాంపురం గ్రామంలో అధికారులను జరిగిన సభలో వికలాంగులు, వృద్ధులు వితంతువులు నిలదీశారు. బొమ్మనహాళ్ గ్రామసభలో రోడ్డు కోసం ప్రజలు నిలదీశారు. రోడ్డు సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించాలని , జన్మభూమి కార్యక్రమం నుంచి అధికారులను తీసుకెళ్లి అధ్వానంగా ఉన్న రోడ్డును చూపించారు.
సోమందేపల్లి మండలంలో జరిగిన జన్మభూమి సభలో అర్హులైన రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని బయటకు పంపి గేట్లు మూశారు. కణేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో జన్మభూమి మూడో విడత రుణమాఫీ కాకపోవడంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటి సమస్యపై అధికారులను ప్రజలు నిలదీశారు.
ఉరవకొండ రూరల్ మండలం నెరిమెట్ల గ్రామంలో జరిగిన సభలో రేషన్ కార్డులు, పింఛన్లు కోసం అధికారులను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేనప్పుడు ఎవరి కోసం జన్మభూమి నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహించారు. కూడేరు మండలం ఇప్పేరు గ్రామసభలో సమస్యల పై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కొనకండ్ల గ్రామ సభలో పింఛన్ల కోసం అధికారులన ప్రజలు నిలదీశారు.
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు
కళ్యాణదుర్గం మండలం మానిరేవులో నిర్వహించిన జన్మభూమిలో ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలో సుమారు 600 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని రైతులు, గ్రామ నాయకులు ఎర్రిస్వామి, తిమ్మప్ప జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాసులును చుట్టుముట్టారు. గంట పాటు ఆందోళన చేపట్టారు.
పింఛన్లు ఇవ్వలేదు..
అర్హులైన వారికి పింఛన్లు, రైతులుకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదంటూ కుందుర్పి మండలం తూముకుంట, తెనగల్లు గ్రామాల్లో జరిగిన సభల్లో అధికారులను వైఎస్సార్‌సీపీ నాయకులు నింగప్ప, రామిరెడ్డి, తిమ్మరాజు తదితరులు అడ్డుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని రాప్తాడు మండలం కొత్తపల్లిలో జరిగిన సభలో సర్పంచ్, వైస్ సర్పంచ్ నిరసన తెలిపారు.
ఇదేం రుణమాఫీ !
కణేకల్లు : రుణమాఫీపై రైతులు మండిపడ్డారు.. ఒకటి, రెండో విడతలో రుణమాఫీ అయి మూడో విడతలో రుణమాఫీ కాక పోవడం.. అర్హులైన 50 మందికి అసలే రుణమాఫీ చేయకపోవడంతో ఇదేం రుణమాఫీనని రైతులు అధికారులపై నిప్పులు చెరిగారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో జరిగిన జన్మభూమిలో ఇదే విషయమై రైతు సంఘం అధ్యక్షులు జయచంద్రారెడ్డి, రైతులు అధికారులు, నాయకుల్ని నిలదీశారు. ఉరవకొండ మండలం నింబగల్లు సిండికేట్‌బ్యాంకులో రుణాలు తీసుకొన్న సొల్లాపురం, ఎన్.హనుమాపురం గ్రామానికి చెందిన రెండువేల మందికి మొదటి రెండు విడతల్లో రుణమాఫీ అయ్యిందని మూడో విడతలో మాత్రం రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.
రేయ్.. జాగ్రత్త
యల్లనూరు: నువ్వు ఎందుకు అన్నీ..పూసుకుంటున్నావ్.. రేయ్ జాగ్రత్త ..చూసుకో.. అంటూ టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్, శింగనమల ఎమ్మెల్యే యామినిబాల ముందే ఓ దళిత నాయకుడ్ని అవమానించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని దంతలపల్లి, శింగవరం గ్రామాల్లో అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. శింగవరంలో జరిగిన కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన బాలనరసింహుడు ఎమ్మెల్యే ముందుకు వచ్చి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తాగునీటి సౌకర్యం లేదని, అంతే కాక గతంలో గ్రామంలో చౌకదుకాణ డీలర్ షిప్‌ను ఎస్సీలకు ఇవ్వాలని, జన్మభూమికి గ్రామ సర్పంచ్ హాజరు కాకుండా ఆమె భర్త హాజరు కావడం ఏంటని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె వెనుక వచ్చిన టీడీపీ నాయకులు ఆయనపై చిందులేశారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు.
ఎమ్మెల్సీ విప్ పయ్యావుల నిలదీత
విడపనకల్లు: మండల పరిధిలోని వేల్పుమడుగులో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఎస్సీ కాలనీవాసులు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను నిలదీశారు. స్థానిక మాలవీధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీ మహిళలు నిలదీశారు. మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ కేశవ్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తల దాడి..
కంబదూరు మండలం కర్తనపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సమస్యలను అడిగేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు నాగరాజు, శివలపై టీడీపీ కార్యకర్తలు కుర్చీలతో దాడికి యత్నించారు. జెడ్పీటీసీ, అధికారుల సమక్షంలోనే ఈ దాడికి యత్నించారు. అలాగే శెట్టూరు మండలం చిన్నంపల్లి, బొచ్చుపల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకేనా ఇతరులకు వర్తించవా అని నిలదీశారు. పాత గుంతకల్లు జన్మభూమిలో సమస్యలపై అధికారులను వైఎస్సార్ సీపీ నాయకులు నిలదీశారు. సమాధానం చెప్పలేక అధికారులు వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment