
లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి
సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం
ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా
మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు నిరసనలు, నిలదీతలు తప్పడం లేదు. మంగళగిరి పట్టణంలో రెండు రోజుల కిందట ముస్లిం మైనార్టీ నాయకులను లోకేశ్ కలవగా.. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్న మీకు మైనార్టీలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమిలిన విషయం తెలిసిందే. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట మీద ఆదివారం ప్రచారానికి వెళ్లగా అక్కడా స్థానికులు లోకేశ్‌ను నిలదీశారు.
కరోనా సమయంలో ఏమయ్యారు? పుష్కరాల సందర్భంగా తొలగించిన కుటుంబాలకు మీ తండ్రి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? తాడేపల్లి దేవదాయ, నీటి పారుదల శాఖ స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారికి ఇప్పుడు పట్టాలు ఇస్తామంటున్నారు.. అందుకు చట్టాలు అంగీకరిస్తాయా? అంగీకరిస్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీ తండ్రి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? అంటూ.. నిలదీయడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక లోకేశ్ వెనుదిరిగారు.
స్థానికుల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదురవుతుండటంతో స్థానిక నాయకులు కూడా ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. ఇలా మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. చివరకు లోకేశ్ అపార్ట్‌మెంట్లలో ప్రచారానికే పరిమితమయ్యారు. పోలీసులతో లోకేశ్ వాగ్వాదంమంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఆదివారం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు ఉండవల్లి సెంటర్లో వాహన తనిఖీ చేపట్టారు.
అదే మార్గంలో వెళ్తున్న లోకేశ్ వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు. ఈ రోజు ఇప్పటికే రెండు సార్లు తన వాహనాలను తనిఖీ చేశారని, ముఖ్యమంత్రి వాహనాన్ని తనిఖీ చేశారా? ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వాహనాలను తనిఖీ చేశారా? అంటూ పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నామని పోలీసు అధికారి బదులిచ్చారు.