వనపర్తి టౌన్: గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచార ఖర్చుల లెక్కలు చూపించని అభ్యర్థులపై వేటు పడింది. ఇకముందు పోటీచేసేందుకు కూడా వారిని అనర్హులుగా ప్రకటించింది. మూడు మున్సిపాలిటీల్లో వేటుపడిన వారిలో మొత్తంగా 62 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగిన 40 రోజుల్లోనే ఖర్చు వ్యయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై అప్పట్లో పెద్దగా ఆసక్తి చూపనివారికి చుక్కెదురైంది.
నిబంధనలు కఠినతరం
ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా ఖర్చుల వివరాలు చూపించాలి. గతంతో పోలిస్తే ఈసారి తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లెక్కలు చెప్పని అభ్యర్థులపై మూడేళ్ల పాటు అనర్హత వేటువేసింది. అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలకు 2014లో ఎన్నికలు జరిగాయి. ప్రధానపార్టీలు, స్వతంత్ర ఎన్నికల అభ్యర్థులను కలుపుకుని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వార్డుల్లో 367 మంది పోటీచేయగా ప్రచారం వ్యయం చూపని 13మందిపై వేటుపడింది. అలాగే గద్వాల మున్సిపాలిటీలోని 33వార్డులకు 130మంది పోటీచేశారు. అందులో 18మంది లెక్కలు చూపలేదు. వనపర్తి పట్టణంలో 26వార్డులకు గాను 128మంది అభ్యర్థు«లు పోటీచేయగా వారిలో 31మందిపై వేటు పడింది. వీరిలో అధికార, విపక్షపార్టీల నాయకులతో పాటు కొందరు మాజీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వీరంతా ఎన్నికల అనంతరం నోటీసులు జారీచేసినా పెద్దగా పట్టించుకోలేదు.
వనపర్తి నుంచి అత్యధికంగా..
పురపాలక సంఘం ఎన్నికల్లో నామినేషన్ సమయంలో ఉత్సాహం చూపుతున్న నామినేషన్ల ఉపసంహరణ వరకు సగం మంది బరిలో ఉంటున్నారు. ఎన్నికల ఖర్చులు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఎన్నికల సంఘానికి వివరాలు ఇవ్వడంలో ఆసక్తి చూపలేదు. వీరిలో అత్యధికంగా వనపర్తిలో 31మంది, గద్వాలో 18 మంది, మహబూబ్‌నగర్‌లో 13మంది చొప్పున ఉన్నారు. నారాయణపేట నుంచి ఎలాంటి అనర్హత వేటు పడలేదని అధికారులు వెల్లడించారు. వ్యయ వివరాలు సమర్పించని వారికి గరిష్టంగా మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం 2020 వరకు పోటీచేసే అవకాశాన్ని అభ్యర్థులు కోల్పోతారని అధికారులు చెబుతున్నారు.
అధికార పార్టీ నుంచే అధికంగా..
ఎన్నికల సమయంలో తొలిసారి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులు సింహభాగం ఉండగా, ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. గతంలో కొద్దిఓట్లతో ఓడిపోయి తమ భవిత్యం వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని ఆలోచించే వారికి ఎన్నికల సంఘం నిబంధనల రూపంలో చుక్కెదురైంది. అనర్హతవేటు పడిన వారిలో న్యాయవాదులు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.
నోటీసులు జారీచేశాం..
ఎన్నికల సంఘం గతంలో లెక్కలు చూపాలని జారీచేసిన ఆదేశాలను సంబంధిత అభ్యర్థులకు నోటీసులు రూపంలో అందజేశాం. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మేం జారీచేసిన ప్రతిని ఎన్నికల సంఘానికి పంపించగా, వారికి మూడేళ్ల అనర్హత వేటు వేసింది. – నరేశ్‌రెడ్డి, మేనేజర్, వనపర్తి మునిసిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment