మెట్ట ప్రాంతంలోని మైనర్ గ్రామ పంచాయతీ కార్యాలయం
చింతలపూడి : దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని పంచాయతీ పాలన ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలతో కుంటు పడుతోంది. ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పంచాయతీల్లో పని చేస్తోన్న ఉద్యోగులపై ఉండటం లేదు. ముఖ్యంగా మైనర్ గ్రామ పంచాయతీల్లో 30 ఏళ్లుగా పని చేస్తోన్న కార్మికుల(పార్ట్‌టైం గుమస్తాల) వెతలు అన్నీ, ఇన్నీకావు. కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకోలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్న చందంగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. జిల్లాలో 908 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పోయినోళ్లు పోగా 98 మంది పంచాయతీ గుమస్తాలు మాత్రం ఇంకా ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తుందన్న గుడ్డి ఆశతో కాలం వెళ్ల దీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 480 మంది పని చేస్తున్నట్టు అంచనా. వీరు కాక కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరత్రా పని చేస్తున్న సిబ్బంది వేలల్లో ఉన్నారు.
పేరుకే పార్ట్ టైం
పేరుకు పార్ట్‌టైం గుమస్తాలే కాని వారు చేసేది మాత్రం ఫుల్‌టైమ్ ఉద్యోగాలే అని చెప్పవచ్చు. పంచాయతీల్లో ఇస్తున్న అరకొర జీతాలతో వెట్టి చాకిరీ చేస్తూ వీరు తమ జీవితాలను వెళ్ల దీస్తున్నారు. తమను రెగ్యులర్ చేయమని ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేడుకొంటున్నా ఎవరూ వీరి గోడు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తూ రిటైర్మెంట్ స్టేజీకి చేరినా వీరి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. సర్పంచ్‌ల దయా దాక్షిణ్యాలపైనే వీరి ఉద్యోగాలు ఆధారపడి ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ పనులతో పాటు సర్పంచ్‌ల సొంత పనులు కూడ వీరే చేసి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఎక్కడ ఉద్యోగాలు పోతాయోనని వీరి భయం. సర్పంచ్‌లు మారినప్పుడల్లా వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాక ఏటా జిల్లా పంచాయతీ అధికారి అనుమతి తీసుకుని తమ పోస్టులను కొనసాగించుకోవాల్సిన దుస్థితిలో గుమస్తాలు ఉన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, బందెల దొడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు చేయించడం అన్నీ వీరే చూసుకోవాలి. ఇంతచేసినా వీరికి ఇస్తున్న జీతాలు మాత్రం నెలకు ఆరు నుంచి పది వేల రూపాయలు మాత్రమే.
మైనర్ పంచాయతీల్లో ఈ మాత్రం జీతాలు కూడ ఇవ్వలేక రెండు, మూడు పంచాయతీలకు కలిపి ఒక గుమస్తాను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పని భారం పెరిగి, చాలీచాలని జీతాలతో అరకొర జీవితం సాగిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీస వేతన చట్టం కూడా వీరికి వర్తించడం లేదు. 1993 నవంబర్ 25న అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఆ తేదీ నాటికి ఇన్ సర్వీస్‌లో ఉన్న పార్ట్‌టైమ్ కార్మికులను రెగ్యులర్ చేయాల్సి ఉంది. కాని ఆ జీఓను అమలు చేయరు. 2017 జూలైలో ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ఏళ్ల తరబడి పని చేస్తున్న పంచాయతీ గుమస్తాలను అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించవచ్చునని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ నివేదిక పీఆర్ జాయింట్ సెక్రటరీ వద్ద పెండింగ్‌లో ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు వెట్టి చాకిరీలో మగ్గడానికి ప్రభుత్వాల విధానాలే కారణం. గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం, పంచాయతీల పరిపుష్టికి తోడ్పాటు అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నామని విమర్శలు వస్తున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల అధికారాలను, నిధులను విడుదల చేయక పోవడం ఫలితంగా సిబ్బందికి జీతాలు కూడ ఇవ్వలేని దుస్ధితిలో మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికైనా తమ సర్వీసుల్ని రెగ్యులర్ చేసి పంచాయతీల అబివృద్ధికి చర్యలు తీసుకోవాలని వీరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment