Administrator
-
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
India-Maldives Row:మాల్దీవుల వివాదం: లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ కీలక వ్యాఖ్యలు
లక్ష్యదీప్ వ్యవహారంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ మండిపడ్డారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మొదటిసారి అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ స్పందించారు. ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలను భారత్ అస్సలు సహించదని అన్నారు. అదీ కాక, భారత దేశంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమయంలో భారతప్రధాన మంత్రికి తమదైన శైలిలో అండగా నిలిచిన భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనుచిత వ్యఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలని లేదని, తమ విలువలు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అన్నారు. సదరు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశాన్ని, తమ దేశ ప్రధానమంత్రిని కించపరిచితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. లక్ష్య దీప్‌కు మాల్దీవుల టూరిస్టులను అనుతిస్తారా? అని మీడియా ప్రశ్నకు.. అందరిని స్వాగతించడమే తమ దేశ సంస్కృతి అని అన్నారు. మాల్దీవుల సందర్శకులు లక్ష్యదీప్కు వచ్చి, ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. అభినందిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వారు అలా ఉంటే తమకు కూడా సంతోషమేనని అన్నారు. వారి రాకపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తప్పకుండా మాల్దీవుల టూరిస్టులు కూడా లక్ష్యదీప్కు రావాలని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ లక్ష్యదీప్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విసయం తెలసిందే. అయితే కొంత మంది నెటిజన్లు మాల్దీవుల కంటే కూడా లక్ష్యదీప్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీ వీడియో, ఫొటోలపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమై.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక.. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం -
లక్షద్వీప్‌ను ముంచేస్తారా?
సేవ్ లక్షద్వీప్, గో బ్యాక్ ప్రఫుల్ నినాదాలతో ఇల్లిల్లూ మారుమోగిపోతోంది. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న దాకా పరిస్థితి వెళ్లిపోయింది . అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అడ్మినిస్ట్రేటర్ వివాదాస్పద నిర్ణయాలేంటి? ద్వీప సముదాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అరేబియా సముద్రంలో ప్రశాంతంగా ఉండే పగడపు దీవుల్లో చిచ్చు రేగింది. అభివృద్ధి పేరుతో తీసుకున్న నిర్ణయాలు అలల్లో అలజడి రేపాయి. కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడా దీవుల్ని నిండా ముంచేసేలా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ 2020 డిసెంబర్ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. పెద్దగా వార్తల్లోకి వచ్చింది లేదు. అదే రోజు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో కేంద్ర ప్రభుత్వం దాద్రా నాగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు... గుజరాత్ మాజీ మంత్రి అయిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్డీఏఆర్) సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షద్వీప్‌లో స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హై ప్రొఫైల్æ బీచ్ ఫ్రంట్లు నిర్మిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఉన్న దీవి కాస్తా పోతుందనే ఆందోళనలైతే ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రఫుల్ పటేల్‌ను తొలగించాలన్న డిమాండ్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రతిపాదనల్ని నిలిపివేయాలని కోరింది. 36 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ అభివృద్ధి ప్రణాళికపై స్థానికులతో చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లక్షద్వీప్ ప్రజలకి అండగా నిలబడి ప్రజా వ్యతిరేక విధా నాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. నేడు లక్షద్వీప్‌కు ప్రఫుల్ ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు ప్రఫుల్ పటేల్. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు. వివాదాస్పద నిర్ణయాలివే ► గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదు. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ► తమ సంస్కృతి, ఆహారపు అలవాట్లపై దాడి అని స్థానికులు భగ్గుమంటున్నారు ► ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నప్పటికీ ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే పోటీ చేయొచ్చు. ► ఈ దీవుల్లో ఉండే అత్యధికులు ముస్లింలు కావడంతో వారికి పిల్లలు ఎక్కువ. అందుకే ఇక్కడ ముస్లిం జనాభాని టార్గెట్ చేశారన్న అసహనం వారిలో కనిపిస్తోంది. ► మద్యంపై నిషేధం ఉన్నప్పటికీ జనాభా నివసిస్తున్న దీవుల్లో కూడా పర్యాటకులకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతినిచ్చారు ► సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా గూండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ► దేశంలోనే నేరాల రేటు అతి తక్కువగా ఉన్న దీవుల్లో ఇలాంటి కఠిన చట్టం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్‌ని విమర్శించే వారిపైనే దీనిని ప్రయోగిస్తారన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► గత ఏడాది కాలంగా లక్షద్వీప్‌లో కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటించడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షల్ని తొలగించడంతో 8 వేల వరకు కేసులు నమోదయ్యాయి. 30 మంది వరకు మరణించారు. ► గ్రీన్ జోన్ ట్యాగ్ తొలగిపోవడంతో కోవిడ్ ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది. ► ఈ దీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కడైనా భూముల్ని తీసుకునే అధికారాలు, అక్కడున్న వారిని ఖాళీ చేయించే అధికారం ఎల్డీఏఆర్కు కట్టబెట్టారు. మైనింగ్, క్వారీయింగ్ కూడా చేయొచ్చు. స్థానిక యంత్రాంగంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ కట్టడాలు వచ్చి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. ► వేటకు వెళ్లే మత్స్యకారుల పడవల్లో భద్రత కల్పించడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ూ నేరుగా జనం కదలికలపై నిఘా పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లక్షద్వీప్ ప్రత్యేకతలు కేరళకు పశ్చిమాన 200 కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప్ 32 ద్వీపాల సముదాయం. వాటిలో 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాలో అంతర్భాగంగా ఉండే లక్షద్వీప్‌కు 1956లో కేరళ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. ఇక్కడ జనాభా కేవలం 65 వేలు. వారిలో 96 శాతం మంది ముస్లింలు. వీరు జాలర్ల వృత్తిలో ఉన్నారు. పశుమాంసమే వీరికి ఆహారం. వీరికి ఏదైనా కావాలంటే కేరళ రాష్ట్రం మీదే ఆధారపడతారు. కొబ్బరి చెట్ల పెంపకం, పర్యాటకం, పశుపోషణ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 2014 నుంచి ఎన్సీపీ నుంచి మహమ్మద్ ఫైజల్ ఎంపీగా ఉంటే పంచాయతీ మండళ్లలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది. పర్యావరణం దెబ్బతింటుంది లక్షద్వీప్ ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతోంది. వాతావరణ మార్పులతో ఏడాది పొడవునా సముద్రం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంగా ఉంటోంది. తుఫాన్లు పెరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు తరిగిపోతున్నాయి. 1998లో 51శాతం ఉన్న పగడపు దిబ్బలు 2017 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు, తవ్వకాలు చేపడితే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉంది – ప్రొఫెసర్ ఎస్.అభిలాష్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్షద్వీప్ దుమారం: ప్రఫుల్ రీకాల్‌కు తీర్మానం
లక్షద్వీప్ అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్.. ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించడం, దానికి వ్యతిరేకంగా ‘సేవ్ లక్షద్వీప్’ పేరుతో క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఫుల్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తిరువనంతపురం : లక్షద్వీప్ లో కాషాయ ఎజెండానుఅమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఆ కేంద్రపాలిత ప్రాంతపు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాగా, లక్షద్వీప్ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ తీర్మానం కోరింది. వివాదాస్పద సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కేరళ సర్కార్ కోరింది. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ గత వారం రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ఈ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. చెట్లతో మొదలుపెట్టారు ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులతోనే లక్షద్వీప్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు.దీవి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: సేవ్ లక్షదీవ్.. ఆ హీరోకి మద్దతు ఇక ప్రఫుల్ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం.. లక్షద్వీప్‌లో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్‌పై బ్యాన్ విధించారు. ఈ డ్రాఫ్ట్ తీవ్ర దుమారం రేపింది. కాగా, అక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఆ డ్రాఫ్ట్‌ను నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు లభిస్తోంది. -
హద్దు మీరిన వాట్సప్ పోస్టింగులతో ప్రమాదం
♦ అపరిచితులను గ్రూపులో చేర్చుకోవద్దు ♦ అడ్మినిస్ట్రేటర్‌కు చిక్కులు తప్పవంటున్న నిపుణులు టేక్మాల్: వాట్సాప్‌లో ఎడాపెడా గ్రూపులు క్రియేట్ చేసేస్తున్నారా? అడ్మినిస్ట్రేటర్‌గా గ్రేట్ అనుకుంటున్నారా? జాగ్రత్త. మీ గ్రూపులో ఎవరెవరు ఉంటున్నారో? వాళ్లు ఏమేమి పోస్టు చేస్తున్నారో? తెలుసుకోండి. ఎందుకంటే వాళ్లు చేస్తే ప్రతి పోస్టింగుకు మీరే బాధ్యులవుతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండకపోతే చిక్కుల్లో పడొచ్చు. కేసు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే మీ చేతికి బేడీలు పడొచ్చు. సో.. బీ కేర్ ఫుల్. డిజిటల్ యుగంలో సామాజిక మాద్యమాలు సమచార విప్లవానికి ఊపరిలూడుతున్నాయి. గతంలో తెగిపోయిన స్నేహ బంధాలను తిరిగి ముడి వేసుకోవడానికి, కొత్త మిత్రులను పరిచయం చేసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్.. తదితరాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వసాధారణం కావడంతో ఈ సోషల్ మాద్యమాల వినిమయం కూడా ఎక్కువైంది. ఏదైనా సమాచారాన్ని పంపిచుకోవాలన్నా.. లేక ఫొటోలను అందిపుచ్చుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఈక్రమంలో వాట్సప్‌పై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. జిల్లాలో 90 శాతం జిల్లాలో 90 శాతానికిపైగా ప్రజలు స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. అందునా వాట్సప్‌లో ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువతీ.. యువకులు, రైతులు ఇలా ప్రతిఒక్కరూ వాట్సప్‌లో గ్రూపులో ఏర్పాటుచేసుకుంటున్నారు. అవసరం మేరకు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. బాధ్యత తప్పదు ఎడాపెడా గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, గంటల తరబడి చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. కొందరికి వ్యసనంగా ఆవహించింది. స్నేహితులను పెంచుకోవడం, మధురమైన పోస్టింగులు చేస్తే ఓకే కానీ.. అప్రమత్తంగా లేకపోతే చిక్కులు తప్పవు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ గ్రూప్‌పై ఓ కన్ను వేసి ఉంచాల్సిందే! లేకపోతే ఎవరూ చేసిన అసభ్యకర, దేశ సమగ్రతను దెబ్బతీసే పోస్టింగులకు అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహించక తప్పదు. భాతర ఐటీ చట్టం ప్రకారం ఆన్లైన్ గ్రూపునకు బాధ్యులుగా ఎవరు ఉంటే వారినే బాధ్యుడిని చేస్తారు. కాబట్టి తెలిసిన స్నేహితులనే సభ్యులుగా చేర్చుకోవడం ఉత్తమం. చట్టం ఏం చెబుతుంది? భారత ఐటీ చట్టం 2000 ప్రకారం కఠినమైన శిక్షలుంటాయి. అభ్యంతకర విషయాలను పోస్టు చేస్తే ఐపీసీ సెక్షన్ 505, 1(బీ) కింద కేసులు నమోదు చేస్తారు. ఐటీ చట్టం 153, 34,67, సెక్షన్లూ వర్తిస్తాయి. ఈక్రమంలో వాట్సప్ గ్రూపు నుంచి సభ్యులను తొలగించారన్నా కారణంగా ద్వేషాలు పెంచుకోవడం, అడ్మిన్లపై దాడి జరిగిన సంఘటనలు సైతం ఇటీవల పెరిగాయి. వాట్సప్‌ను ఎవరు దుర్వినియోగం చేసినా ఐటీ చట్టం అడ్మిన్‌పైనే గురి పెడుతోంది. ఎందుకంటే వాట్సప్‌లో మెసేజ్ ఎవరు సృష్టించారో తెలుసుకునే అవకాశం లేదు. అయితే, దాన్ని వ్యాప్తి చేసేవారిని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు. ఇదే దర్యాప్తులో లూప్‌హోల్. మరో వైపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదూ.. ఎవరు పోస్టు చేశారన్నదే కీలకం. ఎవరో పంపితే పొస్టు చేశానంతే.. అంటే చట్టం ఒప్పుకొదు. కాబట్టి అడ్మిన్‌కే చిక్కులు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ♦ దేశ భద్రతకు ప్రమాదమైన, ఐటీ చట్టాలను ఉల్లంఘించే అభ్యతరకర పోస్టులు ఎట్టొద్దని మీ గ్రూపు సభ్యులకు చెప్పుకోవాలి. ♦ ఎవరైనా సభ్యులు పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ విషయాన్ని ముందుగానే పోలీసులకు చెప్పాలి. లేదంటే అడ్మిన్ చేతికి బేడీలు తప్పవు. ♦ గ్రూపు లో మీ ప్రమేయం, ఇష్టం లేకుండా ఒక అడ్మిన్ మిమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేటర్‌గా మారిస్తే ఆ గ్రూపు నుంచి బయట పడటం ఉత్తమం. లేదంటే చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ♦ మెసేజ్ తీవ్రతను బట్టి సభ్యులు కానివారు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ♦ పేరున్న రాజకీయ నాయకులు, ప్రముఖులను దూషించే విధంగా పోస్టు చేయరాదు. ♦ కాాపీరైట్ చట్టం కింద ఇంటర్నెట్, ఇతర ప్రసార మాద్యమాల్లో అంశాలను ♦ కాపీ చేసి వాటిని వాట్సప్‌లో పోస్టు చేయడం కూడా నేరమే. -
సీపీ కార్యాలయం ఎదుట కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
- చిట్టీల సొమ్ము రాబట్టుకునేందుకే విజయవాడ సిటీ : చిట్టీల సొమ్మును నిర్వాహకుడు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన కారు డ్రైవర్ పెయ్యల సుబ్బారావు(38) శనివారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసు వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదీ జరిగింది పాత రాజరాజేశ్వరిపేటకే చెందిన అర్జునరావు వద్ద సుబ్బారావు ప్రైవేటుగా చిట్టీలు కట్టాడు. ఇతనికి రూ.2.47లక్షల సొమ్ము రావాల్సి ఉంది. అర్జునరావు ఆర్థికంగా దివాళా తీసి, చిట్టీల సొమ్ము చెల్లించలేక ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు. పెద్ద మనుషుల సమక్షంలో రూ.1.50 లక్షలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇంటిని కొనుగోలు చేయనున్న రాము వద్ద రూ.1.50 లక్షలకు అర్జునరావు సలహా మేరకు సుబ్బారావు రెండు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. గత మార్చిలో ఆ మొత్తాన్ని ఇతర బాకీదారుల సమక్షంలో సుబ్బారావు తీసుకున్నాడు. వాపసు చేయాల్సిన రెండు ప్రామిసరీనోట్లకు గాను ఒకటే ఇచ్చి మిగిలిన దానిని తన వద్దనే అట్టిపెట్టుకున్నాడు. వారు ప్రామిసరీ నోట్లు అడిగితే మిగిలిన సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. పైగా తరుచూ వెళ్లి డబ్బుల కోసం వారిని వేధింపులకు గురి చేయడంతో అర్జునరావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు సుబ్బారావుతో పాటు నగదు తీసుకున్న సమయంలో ఉన్న ఇతర బాకీదారులను పోలీసులు పిలిపించి విచారించారు. నగదు తీసుకున్నందున ప్రామిసరీ నోటు తిరిగి ఇచ్చేయమని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ భావించిన సుబ్బారావు.. ఈ నెల 15న సీపీని కలిసేందుకు వెళ్లగా వీలు చిక్కలేదు. శనివారం మధ్యాహ్నం మరోసారి సీపీని కలిసేందుకు వెళ్లాడు. సెంట్రల్ కంప్లయింట్ సెల్ అధికారులు అతడిని వివరాలు అడిగి, కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్టేషన్‌కి వస్తే సమస్య పరిష్కరిస్తామని వారు చెప్పారు. దీంతో సుబ్బారావు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బా గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా.. సుబ్బారావు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసిందని కొత్తపేట ఇన్స్పెక్టర్ నిమ్మకాయల దుర్గారావు తెలిపారు. అర్జునరావు ఫిర్యాదు మేరకు ఇతరులతో పాటు సుబ్బారావును కూడా పిలిపించి విచారించామని చెప్పారు. డబ్బులేమైనా రావాల్సి ఉంటే చట్టపరంగా చూసుకోవాలని, ఇంటికి వెళ్లి గొడవ చేయవద్దని చెప్పినట్టు తెలిపారు. వేరే కేసులో మచిలీపట్నం ఆర్‌పేట ఎస్ఐ తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ గతంలో ఇతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.