Ajay misra
-
విద్యార్థులకు రవాణా సదుపాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాసాలకు చెందిన 20,754 మంది విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థికి రూ. 1,862 చొప్పున ఆయా విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలు అందుబాటులో లేనందున ఈ మొత్తాన్ని చెల్లించనుంది. -
‘పూనం’కు అదనంగా మహిళా, శిశు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా మహిళా, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మను బదిలీ చేసి, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం రవాణా, రోడ్లు భవనాల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న అజయ్‌మిశ్రాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఓఎస్డీగా బదిలీపై పంపారు. -
టీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అజయ్‌మిశ్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే మూడు కీలక శాఖలను నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాకు ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. ఢిల్లీలోని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)ను ఇస్తూ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ మిశ్రా ఇప్పటికే జీఏడీ(పొలిటికల్), హోం, రోడ్లు, భవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పౌర సరఫరాల సంస్థ ఎండీగా ఉన్న వి.అనిల్‌కుమార్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ఇంకా కాకపోవడంతో.. అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
'గోల్కొండ కోటపైనే పంద్రాగష్టు వేడుకలు'
హైదరాబాద్: పంద్రాగష్టు వేడుకలు గోల్కొండ కోటపైనే జరుగుతాయని తెలంగాణ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా స్పష్టం చేశారు. రాణీమహల్ను ఆగష్ట్ 15 వేడుకల ప్రదేశంగా గుర్తించామని ఆయన మీడియాకు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ, ఆర్మీకి లేఖలు రాసిందని అజయ్ మిశ్రా తెలిపారు. వేడుకల కోసం వారి నుంచి అనుమతి పొందడం లాంఛనప్రాయమేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఆ త్రివర్ణ పతాకమే ఉపయోగించాలి
సాక్షి, హైదరాబాద్: కాగితాలు, వస్త్రాలపై తయారుచేసిన మూడు రంగుల జెండాను మాత్రమే జాతీయ దినోత్సవాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకు ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్ జెండాలు వాడరాదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) అజయ్‌మిశ్రా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు గురువారం ఆదేశాలు ఇచ్చారు. త్రివర్ణ పతాకాలను అలంకరణలకు ఉపయోగించరాదని, ముఖ్యమైన జాతీయ దినాలు, క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో దాన్ని ఊపవచ్చన్నారు. జెండా ఆవిష్కరణలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయో.. లేదో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. జెండాను అగౌరవపరిస్తే నేరంగా పరిగణిస్తామన్నారు. -
ఉన్నత విద్యాభివృద్ధికి ‘రూసా’ సాయం
వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం అమలుపై వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో పథకం అమలుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వివరించారు. యూనివర్సిటీలు తమ ప్రతిపాదనలకు సంబంధించి అనుమానాలు ఉంటే డిసెంబర్ 13న జరిగే సమావేశంలో నివృత్తి చేసుకుని డిసెంబర్ 20లోపు సమర్పించాలని ఉపకులపతులను కోరారు. వాటిని క్రోడీకరించి రాష్ట్ర సమగ్ర నివేదికను జనవరి 10లోగా కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఫిబ్రవరి 28 లోగా రాష్ట్ర ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఏప్రిల్ 15 నాటికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. అనంతరం రాష్ట్ర వాటా ఏప్రిల్ 30లోగా విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. రూసా పథకంలో చేపట్టే పనుల్లో.. 18 అంశాల్లో పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, 500లకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంపునకు నిధుల ఖర్చు, 12బీ, 2ఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న, లేకున్నా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల అభివృద్ధి, ఎయిడెడ్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేగాక అటానమస్ కళాశాలలను వర్శిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, క్లస్టర్ కళాశాలలను కలుపుతూ వర్శిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం ఒక్కో వర్శిటీకి రూ. 20 కోట్లు కేటాయించడం, మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడం, ప్రస్తుతమున్న డిగ్రీ కళాశాలలను మోడల్ డిగ్రీ కళాశాలలుగా అభివృద్ధిపరచడం, పదేళ్ల కాలంలో 40 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో రాష్ట్రానికి రూ. వెయ్యికోట్లకు పైగా నిధులు దక్కనున్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మాధ్యమిక విద్య కమిషనర్ అదర్‌సిన్హా, ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్, మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్, కార్యదర్శి సతీష్‌రెడ్డి, అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా డాక్టర్ రాజ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చాన్స్‌లర్‌గా డాక్టర్ రాజ్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఐదేళ్లుగా చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ రాజ్‌రెడ్డి మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. డాక్టర్ రాజ్‌రెడ్డి అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.