ముదిరిన ‘సివిల్’ వార్!
సాక్షి, హైదరాబాద్ : అఖిల భారత సివిల్ సర్వీసు అధికారుల మధ్య అంతర్యుద్ధం ఊపందుకుంది.ఇంక్రిమెంట్ల విషయంలో ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్‌కు ఉన్న ‘ఎడ్జ్’ ఇందుకు కారణమవుతోంది. ఈ నెల మూడో వారంలో ఏడో వేతన సంఘం (సెంట్రల్ పే కమిషన్) కేంద్రం ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించనునున్న నేపథ్యంలో ఐఏఎస్‌తో పాటు ఇతర సర్వీసు అధికారులు తమ డిమాండ్లు, ప్రాదమ్యాలను వివరిస్తూ లేఖలు రాస్తున్నారు.
ఇందులో భాగంగా నగరంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులూ డీఓపీటీకి ఇప్పటికే లేఖలు పంపారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ద్వారానే వీరందరూ ఎంపికవుతారు. అయితే కొన్నేళ్లుగా ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్‌లకు జీతం విషయంలో రెండు ఇంక్రిమెంట్ల ‘ఎడ్జ్’ కొనసాగుతోంది. వీరు ఉద్యోగంలో చేరే సమయంలోనే ఇతర సర్వీసుల కంటే గ్రేడ్ పే రెండు ఇంక్రిమెంట్లు ఎక్కువగా ఉంటోంది.
జీతం కాదు జీవితం ముఖ్యం
రెండు ఇంక్రిమెంట్లతో ప్రారంభమయ్యే వేతన వ్యత్యాసం నాలుగేళ్లకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు, 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునేప్పటికి రూ.15 వేల నుంచి రూ.16 వేలు, 17 ఏళ్లకు రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరుతోంది. అయితే ఈ జీతం విషయంలో అభ్యంతరం లేదంటున్న ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు... గ్రేడ్‌పే వ్యత్యాసం కారణంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో నియామకాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అత్యున్నత పోస్టులైన సెక్రటరీ, అదనపు సెక్రటరీ, సంయుక్త సెక్రటరీలుగా నియామకాలకు అఖిల భారత సర్వీసు అధికారులందరూ అర్హులే. అయితే ఆయా పోస్టుల నియామక సమయంలో సీరియారిటీతో పాటు నిర్ణీత గ్రేడ్‌పే ఉండాలని స్పష్టం చేస్తోంది. ఫలితంగా ‘ఎడ్జ్’ ద్వారా అధిక గ్రేడ్ పే పొందుతున్న ఐఏఎస్‌లకు మాత్రమే ఆయా పోస్టులు వస్తున్నాయని, దీనిపైనే తాము అభ్యంతరం చెబుతున్నట్లు ఇతర సర్వీసు అధికారులు పేర్కొంటున్నారు.