కటాక్షించే కడప దర్గా
ఈ నెల 27 వరకు ఉరుసు ఉత్సవాలు
ఆ దర్గాలో కూర్చొని కళ్లు మూసుకుని మౌనంగా కొద్ది నిమిషాలు ధ్యానిస్తే అంతులేని శాంతి లభిస్తుంది. ఏది కావాలని అర్థిస్తే ఆ పని జరిగి తీరుతుంది. మనసంతా ఏదో తెలియని కొత్త శక్తి... ఆధ్యాత్మికంగా ఎనలేని సంతృప్తి... మరికొన్నాళ్లకు సరిపడ ఆత్మశక్తి ఇనుమడిస్త్తుంది. అందుకే అది దేశంలోనే ఓ ప్రముఖ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. ప్రఖ్యాతి చెందిన కడప పెద్దదర్గాలో సంవత్సరానికి మొత్తం 11 ఉరుసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రస్తుతం జరుగుతున్న పెద్ద ఉరుసు ప్రధానమైనది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వైఎస్సార్‌జిల్లా కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’ గా పేరుగాంచిన ఈ దర్గాను నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు నిత్యం వందలాది మంది భక్తులు సేవిస్తుంటారు. దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన ఇతర గురువులందరి మజార్లను దర్శించుకుంటారు. సంపూర్ణ భక్తివిశ్వాసాలతో పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తుంటారు.
గురువుల ఆగమనం
16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ తన సతీమణి, ఇరువురు కుమారులు (హజరత్ ఆరీఫుల్లా హుసేనీ, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్), ఫకీర్లు, ఖలీఫాలతో కలిసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో సిద్ధవటం నవాబైన నేక్‌నామ్‌ఖాన్ ఈ గురువుల మహిమల గురించి విని స్వయంగా దర్శించుకుని ప్రియ భక్తునిగా మారారు. గురువుల సన్నిధిలో స్థానం లభించిన తర్వాత ఆయనకు ప్రతి విషయంలోనూ విజయాలే లభించాయి. దీంతో ఆయన కోరికపై గురువులు ఈ ప్రాంతంలోనే ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ స్థిరపడ్డారు.
జీవ సమాధి
ఆధ్యాత్మిక బోధనలతోపాటు హజరత్ పీరుల్లా మాలిక్ ఎన్నో మహిమలు చూపేవారు. దాంతో భక్తుల సంఖ్య నానాటికీ పెరగడంతో గిట్టనివారు ఇంకా గొప్ప మహిమలు చూపాలంటూ కోరారు. సజీవంగా సమాధి కావాలని, మూడవరోజు మజార్ నుంచి బయటికి వచ్చి కనిపించాలని సవాలు విసిరారు. దాన్ని ఆయన చిరునవ్వుతో స్వీకరించి మొహర్రం 10వ రోజు (షహదత్) తన పెద్దకుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది భక్తుల సమక్షంలో నేలను చీలమని ఆదేశించి సజీవ సమాధి అయ్యారు. మూడవరోజు ఆయన మజార్‌కు ఓవైపున నమాజు చేస్తూ కనిపించడంతో అందరూ ఆ అద్భుతాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు. గిట్టనివారు సైతం ఆయన శిష్యులుగా మారారు. అనంతరం దర్గా ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నిర్వహణలో సాగింది. చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ నందలూరు కేంద్రంగా బోధనలు సాగించారు.
మహా తపస్వి
దర్గా వ్యవస్థాపకులు హజరత్ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడ జరిగే పెద్ద ఉరుసు మాత్రం ఆరీఫుల్లా హుసేనీ పేరిటే జరుగుతుంది. ఈయన 40 సంవత్సరాలపాటు తాడిపత్రి అడవుల్లో, తర్వాత కడప ప్రాంతంలోని శేషాచల అడవుల్లో (వాటర్ గండి ప్రాంతంలో) 23 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. ఆయన తపశ్శక్తికి ప్రతీకగానే దర్గాలోని ఆయన మజార్ మిగతా అన్నిటికంటే ఎత్తుగా ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చే భక్తులు ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్‌ను దర్శించుకున్న అనంతరం హజరత్ ఆరీఫుల్లాహుసేనీ సాహెబ్ దర్గాను కూడా దర్శించుకుంటారు.
సేవా-ప్రజ్ఞల ప్రతిరూపం
ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ బాల్యంలో సకల మతగ్రంథాలను అధ్యయనం చేశారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా దర్గా కేంద్రంగా అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. తమ ఖర్చులతోనే పేద వర్గాలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. దర్గా శిష్యులందరికీ అక్కడే లంగర్ ద్వారా మూడు పూటల భోజనం, వసతి కల్పిస్తున్నారు. ప్రతివారం వందలాది మంది రోగులకు ఉచితంగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. జోధా అక్బర్ సినిమాలో ‘ఖ్వాజా-రే-ఖ్వాజా’ పాటను వినే ఉంటారు కదూ! దీన్ని రాసింది ఏ సినిమా రచయితో అనుకుంటున్నారా? అదేం కాదు.. ఖాసిఫ్ కలం పేరుతో కడప పెద్దదర్గా ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆ పాటను రచించారు. ఆ పాట సూపర్‌హిట్ అయి భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. ‘అల్ రిసాలా’ హిందీ సినిమాలో కూడా ఆయన ‘మర్హబా...యా ముస్తఫా...’ గీతాన్ని రాశారు. అదికూడా పెద్ద విజయం సాధించింది. ఎవరి నుంచి ఎలాంటి చందాలు స్వీకరించని వీరు... గీత రచన వంటి వాటిపై వచ్చే ఆదాయంతోనే సువిశాలమైన దర్గా సంస్థానాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు.
మత సామరస్యం
ఈ దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొంటారు. ఇక్కడ జరిగే ఉరుసు ఉత్సవాలకు దాదాపు సగం మంది ముస్లిమేతరులు హాజరవుతారు. ప్రతిరోజు దర్గాను దర్శించుకునే భక్తుల్లో 30 శాతం మంది ముస్లిమేతరులు ఉంటారు. జిల్లాలో ఇలాంటి గొప్ప దర్గా ఉన్నందుకు వైఎస్సార్ జిల్లా వాసులు ఎంతో గొప్పగా భావిస్తుంటారు. ఈ దర్గాలోని పెద్ద ఉరుసు నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతుగా సేవలందిస్తున్నాయి. - పంతుల పవన్‌కుమార్, కడప, వైఎస్సార్ జిల్లా
ఇది నా భాగ్యం
దాదాపు మూడు తరాలుగా ఈ దర్గా నిర్వహణ భాగ్యం నాకు లభించింది. దర్గా గురువులపై అచంచల భక్తి విశ్వాసాలతో నా బాధ్యతలను నెరవేరుస్తున్నాను. ఈ సన్నిధిలో సేవలందించడంతో నా జన్మ ధన్యమైందని ఆనందంగా ఉంది.
- లియాఖత్ అలీఖాన్ (బైజు),
పెద్దదర్గా మేనేజర్
పూర్వజన్మ సుకృతం
ప్రస్తుత గురువుల సేవలు చేసే అవకాశం నాకు లభించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిత్యం ఆయనకు సన్నిహితంగా మెలుగుతూ సేవలందించడంలో ఎంతో తృప్తి పొందుతున్నాను. నా జన్మంతా గురువుల సేవకే అంకితం చేస్తున్నా!
- నయీమ్, కార్యదర్శి,
పెద్దదర్గా
దర్గా సన్నిధి నా పెన్నిధి
దర్గాలోని అందరూ గురువుల మజార్ల వద్ద నిత్యం ఎన్నోసార్లు ప్రార్థనలు చేసే అవకాశం నాకే లభించడాన్ని ఈ జన్మలో నేను ఊహించలేదు. వచ్చే ప్రముఖులందరికీ గురువుల మహిమలు, చరిత్ర వివరిస్తూ వారిచే ప్రార్థనలు చేయిం చడంతో నా జన్మధన్యమైంది.
- అమీర్, ముజావర్,
పెద్దదర్గా
ప్రముఖులెందరో...
ఈ దర్గాను హిందీ, తెలుగు, తమిళ సినీ ప్రముఖులందరూ తరచు దర్శించుకుంటుంటారు. అమితాబ్ కుటుంబ సభ్యులతోపాటు అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్ తమిళ సినీ నటులు సూర్య, విజయ్, దర్శకుడు మురగదాస్, లారెన్స్ తదితరులు, తెలుగు సినీ రంగానికి చెందిన దాదాపు అందరూ దర్గా గురువుల దర్శనం చేసుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దర్గాను దర్శించుకుని ఆశీస్సులు పొందు తుంటారు. ‘ఆస్కార్’ గ్రహీత, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలో జరిగే 11 గంధం ఉత్సవాలకు తప్పక హాజరవుతూ ఉంటారు. ఈ దర్గా గురువుల దయతోనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయనకు ప్రగాఢ విశ్వాసం.