మహిళా రైతు ఆత్మహత్యా యత్నం
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో విలువైన తన భూమి ఆక్రమణకు గురైందని, పోలీసులు కూడా ఆక్రమణ దారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎర్రోజు వరలక్ష్మి అనే మహిళ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పన్నపేటలో రాజీవ్ రహదారిని ఆనుకుని వారసత్వంగా తనకు వచ్చిన ఎకరం భూమి (సర్వేనెంబర్ 134)లో షెడ్డును కూల్చివేసి గ్రామానికి చెందిన పిడుగు నర్సయ్య, దేవయ్య స్థలాన్ని ఆక్రమించుకున్నారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లోనూ వారసత్వంగా వచ్చిన వారి పేర్లు తొలగించి కబ్జాలో వారి పేర్లను అక్రమంగా రాయించుకున్నారని ఆరోపించారు. జీవనాధారమైన భూమిని అక్రమంగా లాక్కునేందుకు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఆమె భర్త ఎర్రోజు మల్లయ్య, కుమారుడు సత్యంతో కలసి బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్‌ను ఆశ్రయించారని గ్రామస్తులు చెప్పారు. అయితే పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతూ ఆ భూమిలో అడుగు పెట్టొద్దంటూ హెచ్చరించారని, దీంతో ఆందోళనకు గురైన వరలక్ష్మి అప్పన్నపేటలోని తమ భూమి వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై విజయేందర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.