12 ఏళ్లైనా గుర్తించలేని 400 మృతదేహాలు!
2004 డిసెంబర్ 26 గుర్తుండే ఉంటుంది. 9.15 తీవ్రతతో హిందూ మహా సముద్రంలో సంభవించిన భూకంపం, రాకాసి సునామిగా మారి లక్షలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో పుట్టిన ఈ జలప్రళయానికి థాయ్‌లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, భారత్ దేశాలు అల్లకల్లోమయ్యాయి. కర్కశ అలల తాకిడికి కుటుంబాలకు కుటుంబాలే సముద్రం గర్భంలో కలసిపోయాయి. ఈ సునామి వచ్చి 12 ఏళ్లు గడిచినా ఇంకా 400 మేర మృతదేహాలను గుర్తించలేకపోతున్నామని పోలీసులకు పేర్కొన్నారు.
2,26,000 మంది ఆ సునామికి మరణిస్తే, వారిలో 400 మంది మృతదేహాలు ఎవరివో థాయ్‌లాండ్‌లో గుర్తించలేదని పోలీసులు సోమవారం ప్రకటించారు. 2004లో సునామి సంభవించినప్పటి నుంచి 4000 నుంచి 5000 మంది కుటుంబసభ్యులను సంప్రదించామని, వచ్చి మృతదేహాలను తీసుకోమని తెలిపినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఇంకా 400 మంది మృతదేహాల ఎవరివో గుర్తించలేకపోయామన్నారు. వారికి సంబంధించిన వారెవరూ మృతదేహాలను తీసుకోవడానికి రాలేదన్నారు.
థాయ్‌లాండ్‌లో ఆ రోజు మరణించిన 5,395 మంది ప్రజల్లో 2000 మంది విదేశీ పర్యాటకులే ఉన్నారు. సునామికి తీవ్రంగా ప్రభావితమైన థాయ్‌లాండ్ ప్రస్తుతం పర్యాటకులతో మంచి ఊపుమీద ఉందని పోలీసులు పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా జరిపోతున్నాయన్నారు. జలప్రళయానికి నిండిపోయిన ప్రాంతాలన్నీ ప్రస్తుతం కొత్త కొత్త హోటల్స్‌తో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు రికార్డు స్థాయిలో 32.4 మిలియన్ల విదేశీ పర్యాటకలు వెళ్లారు.
మరో జలప్రళయం..
ఆ జలప్రళయ ఆనవాళ్లు ఇంకా పూర్తిగా తుడిచిపోక ముందే, అప్పుడే మరో జలప్రళయానికి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సదరన్ చిలీ ప్రాంతంలో ఆదివారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామిగా మారబోతుందని అధికారులు హెచ్చరించారు. పోర్టోమాంట్‌కు 1000 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.