రెబల్ ఎమ్మెల్యేలపై వీడని ఉత్కంఠ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో పాల్గొనడంపై రేపు హైకోర్టు తీర్పు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అనర్హత వేటుపడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్ష ఓటింగ్లో పాల్గొనడంపై ఉత్కంఠ వీడలేదు. దీనిపై తీర్పును సోమవారం (ఈనెల 9) వరకు హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఈనెల 10న పదవీచ్యుత సీఎం రావత్ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనాలో, లేదో అనేది హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది.
దీంతో శనివారం హైకోర్టులో జస్టిస్ యూసీ ధ్యానీ 3గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఈనెల 9న ఉదయం 10.15 గంటలకు తీర్పు ప్రకటిస్తాననని అని జస్టిస్ ధ్యానీ చెప్పారు. రెబల్స్ లాయర్ సి.అరియమ వాదనలు వినిస్తూ.. అసెంబ్లీ స్పీకర్ చర్య సహజ న్యాయానికి విరుద్ధమన్నారు. ఒకవేళ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొంది ఉంటే రెబల్స్, బీజేపీతో కలసి ఓటేశారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్లు కపిల్ సిబల్, అమిత్ సిబల్ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ ఎదుట బలప్రదర్శన చేశారని, ఇది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 10 నాటి బలపరీక్ష నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్లు జారీచేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ నిమగ్నమయ్యాయి.