సినిమా ఫక్కీలో కారు దొంగిలించబోయి..
పోలీసులకు చిక్కిన ముఠా
ఇంజిన్ కోసం మరో కారు చోరీ యత్నం
బాడుగకు కారు మాట్లాడుకుని డ్రైవర్‌పైనే దాడి, కారుతో పరార్
గంట వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
పలమనేరు: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. కా రును దొంగిలించేందుకు పక్కా ప్లాన్‌చేసి డ్రైవర్‌పై దాడిచేసి ఇంకాసేపట్లో తప్పించుకొనేలోపే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఓ తమిళనాడు ముఠా. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం రాత్రి పలమనేరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఇ న్నోవా కారు ఉంది. అయితే ఆ వాహనానికి రికార్డులు లేవు. దీంతో ఇలాంటి వాహనాన్నే చోరీ చేసి దాని ఇం జిన్, ఛాసిస్‌లను తన కారుకు అమర్చుకోవాలనుకున్నాడు. తనతో పాటు మరో నలుగురితో కలసి తిరుపతికెళ్లాడు. అక్కడ ఏపీ03 డబ్ల్యూ 8509 అనే నెంబరు గల ఇన్నోవా వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. తాము తమిళనాడులోని కృష్ణగిరి వెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ఆదివారం సాయంత్రం మూడు గంట లకు ఈ నలుగురు బయలుదేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పలమనేరు సమీపంలోని ఓ డాబా వద్ద ఆపి మద్యం సేవించారు. అక్కడి నుంచి కుప్పం రోడ్డు మీదుగా వెళుతూ మండలంలోని కొలమాసనపల్లె సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద 8.30కు మూత్రవిసర్జన కోసం అని డ్రైవర్ చెప్పి కారును ఆపించారు.
ఉన్నట్టుండి డ్రైవర్‌పై కత్తితో దాడిచేసి అతని మొబైల్‌ను లాక్కొని అక్కడినుంచి కారులో పరారయ్యారు. దీంతో డ్రైవర్ గోవిందరాజులు రోడ్డుపక్కనే ఉన్న సబ్‌స్టేషన్ వద్దకెళ్లి జరిగిన విషయాన్ని వారికి చెప్పి అక్కడినుంచి పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లతో పాటు తమిళనాడు, కర్ణాటక పీఎస్‌లకు సమాచారం అందించారు. సరిహద్దు చెక్‌పోస్టులనుసైతం అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా 9.30 గంటలపుడు కుప్పం పట్టణం వద్ద సిద్ధంగా ఉన్న పోలీసులను చూసి ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. దీంతో కుప్పం పోలీసులు ఛేజ్ చేసి ఆ కారుతో పాటు అందులోని నలుగురు నిందింతులను పట్టుకున్నారు. వారిని పలమనేరు పోలీసులకు అప్పగించారు. వీరిలో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కాట్పాడికి చెందిన శివకుమార్‌గా తెలిసింది. ఈ సంఘటనలో కేసును పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే ఛేదించడం గమనార్హం.