పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
– మహిళపై దాడి
– ఒంటిపైనున్న నగల దోపిడీ
తిరుపతి క్రైం: నగరంలోని మధురానగర్‌లో శుక్రవారం దొంగలు పట్టపగలే ఓ మహిళపై దాడికి పాల్పడి బంగారు దోచుకున్నారు. బాధితురాలు సురేఖ అలియాస్ జ్యోతి కథనం మేరకు... మధురానగర్‌కు చెందిన సురేఖ (48) తన ఇద్దరు కూతుళ్లు, తల్లితో పాటు ఉంటుంటున్నారు. శుక్రవారం చిన్నకూతురు సొంతపని నిమిత్తం బయటికి వెళ్లింది. పెద్ద కూతురు, తల్లి మిద్దెమీద ఉన్న గదిని శుభ్రం చేసేందుకు వెళ్లారు. సురేఖ దేవుడి పటాలను శుభ్రం చేయాలని బయటికి వెళ్లింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సురేఖ మొఖంపై కారం చల్లారు. నోటికి, మెడకు టేప్ చుట్టేశారు. అంతేగాక తలపై, మొఖంపై బలంగా కొట్టారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలో ఉన్న చైన్, చేతికున్న బంగారు గాజులు, కమ్మలు లాక్కున్నారు. అనంతరం ఆమెను ఇంట్లోకి నెట్టి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ దూకి పరారయ్యారు. ఆమె కూడా వారి వెనుకనే పరిగెత్తేందుకు ప్రయత్నించింది. కేకలు వేయడంతో పక్కింటి వారు కూతురు, తల్లి కిందకు వచ్చారు. బాధితురాలని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జున, క్రైం సీఐ భాస్కర్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఈ దోపిడీలో 8 సవర్ల గాజులు, 3 సవర్ల చైన్, 6 గ్రాముల కమ్మలు పోయినట్లు బాధితురాలు తెలిపింది.