ఆటో- బస్సు ఢీ: 35 మందికి గాయాలు
చోడవరం: విశాఖపట్టణం జిల్లా కోటపాడు మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విశాఖ జిల్లా కోటపాడు మండలంలోని గాలివలస మలుపు వద్ద బ్రాండెక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది.. ఆటో డ్రైవర్ నాయుడుతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటో ప్రయాణికులను కోటపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రాండెక్స్ ఉద్యోగులను గాజువాక ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చారు. బస్సు బత్తివానిపాళెంలోని బ్రాండెక్స్ ఫ్యాక్టరీకి తెల్లవారుజామున 4.30 గంటలకు సిబ్బందిని తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు ఫోన్చేయడంతో వారు సకాలంలో అక్కడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ మద్ది రాము, బ్రాండెడ్ ఉద్యోగులు పార్వతి, రమణమ్మ, దేవి, ఆటో డ్రేవర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.