ఏపీలో మామిడి, అరటి బోర్డులు
విజయవాడ (లబ్బీపేట): ఆంధ్రప్రదేశ్లో మామిడి, అరటి బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో వై.ఎస్.ప్రసాద్ చెప్పారు. ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఉపయోగాలు' అనే అంశంపై బుధవారం విజయవాడలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్పార్క్ల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అరటి బోర్డును సైతం ఏర్పాటు చేస్తామని.. ఈ విషయంలో కేంద్రం సహకరించకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు మండవ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.