‘బెస్ట్’ సిబ్బందికి మర్యాద పాఠాలు
సాక్షి, ముంబై: నష్టాల బాటలో నడుస్తున్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికులను సంస్థకు మరింత సన్నిహిత చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రయాణికులతో మర్యాదగా ఎలా నడుచుకోవాలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయం కొంత మెరుగుపడవచ్చని బెస్ట్ యాజమాన్యం భావిస్తోంది. 20 సంవత్సరాల కిందట రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు ఇదే పరిస్థితి ఎదురయింది.
డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, చిల్లర విషయంలో గొడవకు దిగడం, చేయి చూపినా బస్సులు ఆపకపోవడం, దూషించడం వంటివి చేసేవారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు పోటీగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, జీపులు వచ్చాయి. దీంతో కాలక్రమేణా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి ఆదాయానికి గండిపడింది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో తన తప్పు తెలుసుకున్న సంస్థ డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనలో మార్పులు తెచ్చింది. చెయ్యి చూపిన చోట బస్సు ఆపాలని, ప్రయాణికులను ఇష్టమున్న చోట దింపాలని ఆదేశించింది. కాలక్రమేణా ఆదాయం పెరగడంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి కొంత మెరుగుపడింది.
ఇదే పద్ధతిలో బెస్ట్ ఉద్యోగులకు కూడా పాఠాలు నేర్పాలని, అప్పుడే సంస్థ ఆర్థిక పరిస్ధితి గాడిన పడుతుందని కొందరు నిపుణులు బెస్ట్‌కు సూచించారు. ముంబైలో అనేక రవాణా సాధనాలు ఉన్నప్పటికీ నగరవాసుల్లో చాలా మంది బెస్ట్ బస్సులకే ప్రాధాన్యం ఇస్తారు. కొందరు కండక్టర్లు, డ్రైవర్లు తమ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పగ లే కాదు కనీసం రాత్రి వేళల్లోనూ చెయ్యి ఊపినా బెస్ట్ డ్రైవర్లు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. బస్టాప్‌కు పరుగెత్తుకుంటూ వస్తున్నా వారిని చూసీచూడనట్లుగా వెళ్లిపోతారు. నగరవ్యాప్తంగా పలు లోకల్ రైల్వే స్టేషన్ల బయట బెస్ట్ బస్టాపులు ఉన్నాయి.
రైలు దిగిన ప్రయాణికులకు ఈ బస్సులే ఆధారం. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోతారు. చేసేదిలేక బాధితులు ఆటోలను ఆశ్రయిస్తారు. ఇలాంటి సిబ్బంది నిర్వాకం వల్ల బెస్ట్‌కు రావాల్సిన ఆదాయం ఆటో యజమానులు తన్నుకుపోతున్నారు. ఉద్యోగుల ప్రవర్తనలో మార్పు వస్తే మినహా ప్రయాణికుల సంఖ్య పెరగబోదని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి.. ఆక్యుపెన్సీ పెంచేందుకు ఏం చేయాలి.. తదితర అంశాలపై బెస్ట్ సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు.