B.tech students
-
పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
చిన్నకోడూరు(సిద్దిపేట): వారంతా బీటెక్ విద్యార్థులు.. ఎంతో సంతోషంగా పరీక్షలు రాశారు. తోటి మిత్రులతో కలిసి క్వాలిస్ వాహనంలో వెళ్తుండగా మృత్యువు మాటువేసింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద మంగళవారం చోటుచేసుకున్న విషాదకర ఘటన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 11 మంది బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. వారంతా కలసి తోటి మిత్రుడు క్వాలిస్ వాహనం తీసుకొని ఐదు రోజులుగా కరీంనగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పరీక్ష రాసి తిరిగి వస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన తౌటి దేవచంద్(20) వాహనం నడుపుతున్నాడు. అనంతసాగర్ శివారులో రోడ్డు పక్కన పార్కు చేసిన ఇసుక లారీని అతివేగంగా వచ్చిన వీరి వాహనం ఢీకొంది. దీంతో క్వాలిస్‌లో ఉన్న సిద్దిపేట పట్టణానికి చెందిన కళావిపిన్ చంద్ర (19), నేతి నాగరాజు(20), పయ్యావుల గ్రీష్మ(18) అక్కడికక్కడే మృతి చెందారు. నమ్రత (సిద్దిపేట), ప్రవళిక (దర్గపల్లి, నంగునూరు మండలం), చైతన్య (సిద్దిపేట), దేవచంద్ (పెద్దలింగారెడ్డి పల్లి)లకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. బుద్ద సాయిచంద్ (చేగుంట), రోహిత్ రెడ్డి (రామాయంపేట), కర్రె రాజు(గజ్వేల్), సాయి నితిన్ (తిమ్మాపూర్, దుబ్బాక మండలం) సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తల్లడిల్లిన తల్లిదండ్రులు సిద్దిపేటకు చెందిన పయ్యావుల వరలక్ష్మి– నర్సింహులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారు ఇంజనీరింగ్ చదువుతున్నారు. సెలూన్ షాపులో పనిచేస్తూ వచి్చన ఆదాయంతో పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. పెద్ద కూతురు బీటెక్ రెండో సంవతర్సం, చిన్న కూతురు గ్రీష్మ మొదటి సంవత్సరం చదువుతోంది. గ్రీష్మను రోడ్డు ప్రమాదం బలితీసుకోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి. చేతికొచి్చన కుమారుడు శవమై కనిపించడంతో.. సిద్దిపేట పట్టణానికి చెందిన నేతి నర్సింహులు–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు. నర్సింహులు ప్రైవేటు ఏజెన్సీలో గుమాస్తాగా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు నాగరాజు బీటెక్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు నవీన్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చేతికందిన కుమారుడు కళ్ల ముందే శవమై కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. మల్లారెడ్డిలో సీటు వచ్చినా.. సిద్దిపేటకు చెందిన కళా సదాశివ్– అర్చన దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విపిన్ చంద్ర బీటెక్ మొదటి సంవత్సరం, చిన్న కుమారుడు కీర్తన్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం. తల్లిదండ్రులు ఇద్దరు పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. విపిన్ మొదటగా మల్లారెడ్డి కళాశాలలో సీటు రావడంతో అందులో చేరాడు. కానీ వాతావరణం పడకపోవడంతో ఇందూరు కళాశాలలో చేరాడని, అదే శాపంగా మారిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. -
సెల్ఫోన్లో వాయిస్‌తో బైక్ ఆపరేటింగ్
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంకు చెందిన యువకుడు కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బాల్యం నుంచి సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న రాసంశెట్టి ప్రణయ్ విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో సీఈసీ బ్రాంచ్‌లో నెల రోజుల కిందటే బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్‌తో వాయిస్ ద్వారా బైక్ ఆపరేటింగ్ విధానాన్ని కనుగొన్నాడు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 9వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ, చంటి దంపతుల కుమారుడే ఈ ప్రణయ్. సెల్ఫోన్లో వాయిస్ వినిపించటంతో బైక్ సెల్ప్, కిక్, తాళం లేకుండానే ఆన్ అయ్యేలా రెండు రోజుల క్రితం తన బైక్‌కు అమర్చాడు. బ్లూటూత్ వాయిస్ ద్వారా బైక్ సీటు కింద అమర్చిన ఆర్డినోబోర్డ్ పని చేయటం ద్వారా ఇది పనిచేసేలా రూపొందించాడు. అతని బండి పేరు లక్కీ కావటంతో అన్‌లాక్ లక్కీ అంటే మీటరు ఆనయ్యేలా, స్టార్ట్ లక్కీ అంటే స్టార్ట్ అయ్యేలా, స్టాప్ అంటే ఆగేలా దీనిని రూపొందించాడు. 15 నుంచి 20 మీటర్ల దూరం నుంచి బండిని ఆపరేటింగ్ చేసినా ఇది పనిచేస్తోంది. వెయ్యి రూపాయల ఖర్చుతో దీనిని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే పలు ఆవిష్కరణలకు ప్రణయ్ ప్రయత్నిస్తూ ఫలితాలను సాధిస్తున్నాడు. నూతన ఆవిష్కరణలు చేస్తున్న ప్రణయ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభినందించారు. ఆవిష్కరణలు ఇవే.... ► ప్రణయ్ తాతయ్య కమ్మిలి మాధవరావు వృద్ధాప్యంతో ఉండటంతో టీవీ, ప్యాన్, లైట్ల స్విచ్‌లు వేసేందుకు వెళ్లటం ఇబ్బందిగా ఉండటంతో ఆయన కోర్కె మేరకు వీటిని రిమోట్, ఫోన్ వాయిస్ ద్వారా కంట్రోల్ చేసేలా తయారుచేశాడు. దీనిని మాధవరావు గత ఏడాదిగా వినియోగిస్తున్నారు. ► 2022 ఆగస్టులో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రణయ్ నేతృత్వం వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించి లక్ష రూపాయల బహుమతి అందుకోవటం జరిగింది. బ్లూ వాయిస్ సీఎన్సీ మిషన్ రైటింగ్ అనే ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. ఈ మిషన్ వల్ల రాయడానికి వీలు లేని దివ్యాంగులు రాతపరీక్షకు హాజరైతే వేరే వ్యక్తులు అవసరం లేకుండా ఈ మిషన్ వాయిస్ ద్వారా పరీక్ష రాస్తుంది. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 150 ప్రదర్శనలు రాగా ప్రణయ్ బృందం ప్రదర్శన జాతీయస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది. ► ప్రణయ్ ఇంట్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరాకు మోటారు నిర్వహణ చేసేందుకు మూడేళ్ల క్రితమే సెన్సార్ల ద్వారా పని చేసే విధానాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా వాటర్ ట్యాంకులో నీరు ఖాళీ అయినప్పుడు మోటార్ ఆనవ్వటం, ట్యాంకు నీటితో నిండగానే మోటారు ఆగిపోవటం జరుగుతోంది. ► ఆటోమేటిక్ బాత్రూమ్ లైట్ విధానంతో బాత్రూమ్లో అడుగుపెట్టగానే లైట్ వెలగటం, బయటకు రాగానే లైట్ ఆగేలా ప్రణయ్ ఏర్పాటు చేశాడు. అలాగే స్ట్రీట్ లైట్లు చీకటి పడగానే వెలగటం, వెలుతురు రాగానే ఆగిపోవటం వంటి విధానాన్ని రూపొందించాడు. దీంతో పాటు వైఫై కార్, వాయిస్ కంట్రోల్ కార్, అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్, లైట్ డిపెన్డెంట్ రిజిష్టర్ తదితర ఆవిష్కరణలను చేశాడు. రైటింగ్ మిషన్ అందించాలనే లక్ష్యం రాయలేని వికలాంగులకు బ్లూ వాయిస్ సీఎన్సీ రైటింగ్ మిషన్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. రానున్న రోజుల్లో పాఠశాలల్లో, కళాశాలలో చదివి రాయలేని వికలాంగులకు ప్రభుత్వ సాయంతో మిషన్‌ను అందించాలని కృషి చేస్తున్నాను. మరిన్ని నూతన ఆవిష్కరణలతో ప్రజలకు ఉపయోగపడేలా పని చేయాలన్నదే నా కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేశాను. – రాసంశెట్టి ప్రణయ్, మచిలీపట్నం -
రోడ్డుప్రమాదంలో 'గీతమ్' విద్యార్ధుల మృతి
సంగారెడ్డి (మెదక్ జిల్లా) : సంగారెడ్డి మండలం కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీతం యూనివర్సిటీ విద్యార్థులు మృతిచెందారు. సంఘటనాస్థలంలోనే అఖిలేశ్(19) మృతిచెందగా..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిత్య(19) అనే మరో విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. గీతం యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) సెకండియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వ్యక్తిగత పని నిమిత్తం సంగారెడ్డి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి నుంచి గీతం యూనివర్సిటీ(హైదరాబాద్)కి వస్తుండగా కంది దగ్గర బైక్‌పై కూర్చున్న ముగ్గురు యువకుల్లో ఒకరి బ్యాగు ట్రాక్టరుకు తగులుకుంది. దీంతో ముగ్గురూ కింద పడ్డారు. వెనకాలే వస్తున్న జిప్సీ వాహనం వీరిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుతాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థులు గల్లంతు
తిరుపతి : చిత్తూరు జిల్లా రామాపురం రిజర్వాయర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. తిరుపతి భవానీనగర్‌కు చెందిన జగదీష్, బాబి మరికొంతమంది స్నేహితులతో కలసి ఈతకు వెళ్లారు. రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో జగదీష్, బాబి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు వారి కోసం గాలించిన ప్రయోజనం కనిపించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో పోలీసులు రిజర్వాయర్‌లో గాలింపుచర్యలు చేపట్టారు. -
విద్యార్థులపై దాడి: యువకులు అరెస్ట్
బోడుప్పల్ : బీటెక్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన ఐదుగురు యువకులను గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్ అరోరా కాలేజీలో మహమ్మద్ అతారుద్ధీన్, మహమ్మద్ అజారుద్దీన్, షేక్ మహమ్మద్ జబీబుల్లా బీటెక్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం కాలేజీ వదిలిపెట్టిన తరువాత బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉన్నారు. అయితే పర్వతాపూర్‌కు చెందిన వరికుప్పల సురేష్(21), కొమరె మధు(21), నిమ్మగూడ శ్రీకాంత్‌గౌడ్(21), సుర్వి సంపత్‌గౌడ్ (26), బి. వినోద్ కుమార్ (25)లు వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడి దాడి చేశారు. దీంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళన
కేపీహెచ్‌బీ కాలనీ (హైదరాబాద్) : జేఎన్టీయూ హైదరాబాద్ పేరుకే గొప్ప అని, తమ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న వారితో పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బీటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి, పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహించాల్సి ఉండగా కేవలం తాత్కాలిక పద్ధతిన అధ్యాపకులను నియమించి తరగతులను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన అధ్యాపకులను సైతం తొలగించారని తెలిపారు. దీంతో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. రెండు రోజుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. -
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థులు
కుషాయిగూడ (హైదరాబాద్): చదువుకోవాల్సిన విద్యార్థులు పక్కదారి పట్టారు. సోమవారం ఉదయం కాప్రా చెరువు వద్ద గంజాయి సేవిస్తూ ఇద్దరు బీటెక్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 300ల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
ఖమ్మం క్రైం: ప్రేమ జంటల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం ఉదయం ఖమ్మం సమీపంలో రైలు కింద పడి ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను వరంగల్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన గుడిమెల్ల సాయి కృష్ణ(19), మాటేటి హిరణ్మయి(19)గా గుర్తించారు. బీటెక్ సెకండియర్ చదువుతున్న వీరిద్దరూ మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుని, తమ బ్యాగ్‌లను ప్లాట్ఫారం పైనే పడవేసి, రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే వీరి మరణానికి కారణమని సమాచారం. వారి బ్యాగుల్లో ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో మృతులను గుర్తించగలిగారు. కాగా, మృతులిద్దరూ హన్మకొండలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు. చెట్లవారిగడ్డ ప్రాంతానికి చెందిన హిరణ్మయి తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్ అని తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లా మానవ పాడు మండలం పెద్దపోతల పాడు గ్రామానికి చెందిన మాధవి (20), సుమన్ (20) లు మార్చి మొదటి వారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని మనస్తాపానికి గురైన ఈ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సాయి కృష్ణ, మాటేటి హిరణ్మయి లు కూడా రైలు కింద పడి మృతి చెందడం గమనార్హం. -
ఎఫ్‌వైయూపీ రద్దు
నాలుగు రోజుల ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సులోనే ప్రవేశ ప్రక్రియ చేపడతామని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రకటించింది. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక ప్రవేశాలు మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై నెలకొన్న వివాదం సమసిపోయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేర కు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దుచేసింది. గతంలో బోధించిన మూడేళ్ల డిగ్రీ కోర్సు ప్రకారమే ప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటి ంచింది. యూనివర్సిటీ కిందనున్న కళాశాలలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని డీయూ వైస్‌చాన్స్‌లర్ దినేశ్‌సింగ్... ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దు చేయాలని నిర్ణయించామని దినేశ్‌సింగ్ ప్రకటించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు 2012-13 విద్యాసంవత్సరంలో పాటించిన ప్రక్రి య ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని ఆయన సూచించారు. యూజీసీ, డీయూల మధ్య నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంపై వివాదం కారణంగా అడ్మిషన్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి వీసీ తాజా ప్రకటనతో తొలగిపోయింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 54 వేల సీట్ల కోసం 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అడ్మిషన్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని భావిస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రి య ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేస్తూ డీయూ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయడంతో పాత పదధతి ప్రకారం అడ్మిషన్ ప్రకియను నిర్వహించే మార్గాలను చర్చించడం కోసం డీయూ కాలేజీల ప్రిన్సిపాల్స్ దినేశ్‌సింగ్‌ను కలిశారు. అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిం చేందుకు తగు సూచనలకోసం 12 కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో కమిటీని నియమించారు. -
ఈ చదువులు మాకొద్దు
రాజధానిలో వేర్వేరు ఘటనల్లో బీటెక్, బీఎస్సీ విద్యార్థుల ఆత్మహత్య ఒత్తిడికి గురవుతున్న స్టూడెంట్స్ సాక్షి, హైదరాబాద్: ఇష్టంలేని కోర్సులు.. కొండలా సిలబస్.. పుస్తకాలతో కుస్తీ పట్టలేక.. కన్నవారి కలలను నిజం చేయలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అర్థంకాని పాఠాలు.. అంతుచిక్కని సిలబస్.. వరుస పరీక్షలు.. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడులు.. వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం నగరంలో బీటెక్, బీఎస్సీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వేర్వేరు సంఘటనల్లో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ఇద్దరూ తల్లిదండ్రులు తమను క్షమించాలని, చదువులో రాణించలేక పోతున్నానని, తరచూ ఫెయిల్ అవుతున్నామని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం గమనార్హం. ఉన్నత చదువులు చదువుతున్న పలువురు విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల సామాజిక వేత్తలు, విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల చదువుల కోసం పుట్టెడు అప్పులు చేసిన తల్లిదండ్రులు..చేతికంది వస్తారనుకున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. సారీ మమ్మీ.. డాడీ..! ‘సారీ మమ్మీ.. డాడీ.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్ రాసి అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా, శ్రీశైలంకు చెందిన ఖాసింపీరా, ముంతాజ్‌ల కుమారుడు షేక్ రహీవుుద్దీన్(23) రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. వర్సిటీ హాస్టల్లోని సి-బ్లాక్ 173 రూమ్‌లో ఉంటున్న రహీం సోమవారం రాత్రి రూమ్‌కు వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో స్నేహితులు రూమ్‌లో చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. రహీం రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. రహీవుుద్దీన్కు అగ్రి బీఎస్సీ సెకెండియర్ కీటకశాస్త్రం సబ్జెక్టు బ్యాక్లాగ్ ఉంది. ఆ ఆందోళనతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా రహీం మృతదేహంపై పడి అతని తల్లిదండ్రులు రోదించిన తీరు విద్యార్థులను కంటతడి పెట్టించింది. ఓర్పు లేకపోవడమే కారణం ముఖ్యంగా 18 నుంచి 23 ఏళ్లలోపు పిల్లల్లో ఓర్పు, ఓపిక మచ్చుకైనా కనిపించడం లేదు. తాము అనుకున్నవి అప్పటికప్పుడు క్షణాల్లో జరిగిపోవాలని భావిస్తున్నారు. తమ ఆలోచనలకు, అంచనాలకు భిన్నంగా జరిగితే జీర్ణించుకోలేకపోతున్నారు. టీనేజ్ పిల్లల ఆత్మహత్యలకు మరో ప్రధాన కారణం సూడోఫ్రెండ్షిప్. తప్పుడు అభిప్రాయాలతో స్నేహితులను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. జీవితంలోని లక్ష్యాన్ని, ఆశయాన్ని తక్కువ టైమ్‌లో చేరుకోవాలనే దృక్పథం నుంచి పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల బారి నుంచి యువతను కాపాడుకోగలుగుతాం. -డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్ చదవలేక చనిపోతున్నా... ‘చదవలేకపోతున్నా.. చనిపోతున్నా’ అని తల్లిదండ్రులనుద్దేశించి సూసైడ్‌నోట్ రాసి వురో బీటెక్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన సింగరేణి ఉద్యోగి యూకూబ్ కుమారుడు అరాఫత్ (21). మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ స్థానిక భారత్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. చదువులో వెనకబడటంతో మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్‌లు తప్పాడు. ఇతనితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న ముగ్గురు స్నేహితులు సొంతూళ్లకు వెళ్లగా.. అరాఫత్ ఒక్కడే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. సోమవారం భోజనం చేసి గదికి వెళ్లి పడుకున్నాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేయడానికి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకుడు వెళ్లి చూడగా తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఆరాఫత్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ‘చదవడం కష్టంగా ఉండడం వల్లే చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని అందులో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి వుృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.