పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Published Wed, Sep 13 2023 5:34 AM | Last Updated on Thu, Sep 14 2023 8:34 PM

- - Sakshi

వారంతా బీటెక్‌ విద్యార్థులు.. ఎంతో సంతోషంగా పరీక్షలు రాశారు. తోటి మిత్రులతో కలిసి క్వాలిస్‌ వాహనంలో వెళ్తుండగా మృత్యువు మాటువేసింది.

చిన్నకోడూరు(సిద్దిపేట): వారంతా బీటెక్‌ విద్యార్థులు.. ఎంతో సంతోషంగా పరీక్షలు రాశారు. తోటి మిత్రులతో కలిసి క్వాలిస్‌ వాహనంలో వెళ్తుండగా మృత్యువు మాటువేసింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ వద్ద మంగళవారం చోటుచేసుకున్న విషాదకర ఘటన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 11 మంది బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్నారు.

వారంతా కలసి తోటి మిత్రుడు క్వాలిస్‌ వాహనం తీసుకొని ఐదు రోజులుగా కరీంనగర్‌ వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పరీక్ష రాసి తిరిగి వస్తున్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన తౌటి దేవచంద్‌(20) వాహనం నడుపుతున్నాడు. అనంతసాగర్‌ శివారులో రోడ్డు పక్కన పార్కు చేసిన ఇసుక లారీని అతివేగంగా వచ్చిన వీరి వాహనం ఢీకొంది. దీంతో క్వాలిస్‌లో ఉన్న సిద్దిపేట పట్టణానికి చెందిన కళావిపిన్‌ చంద్ర (19), నేతి నాగరాజు(20), పయ్యావుల గ్రీష్మ(18) అక్కడికక్కడే మృతి చెందారు.

నమ్రత (సిద్దిపేట), ప్రవళిక (దర్గపల్లి, నంగునూరు మండలం), చైతన్య (సిద్దిపేట), దేవచంద్‌ (పెద్దలింగారెడ్డి పల్లి)లకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. బుద్ద సాయిచంద్‌ (చేగుంట), రోహిత్‌ రెడ్డి (రామాయంపేట), కర్రె రాజు(గజ్వేల్‌), సాయి నితిన్‌ (తిమ్మాపూర్‌, దుబ్బాక మండలం) సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

 తల్లడిల్లిన తల్లిదండ్రులు 
సిద్దిపేటకు చెందిన పయ్యావుల వరలక్ష్మి–     నర్సింహులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు.  వారు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. సెలూన్‌ షాపులో పనిచేస్తూ  వచి్చన ఆదాయంతో  పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. పెద్ద కూతురు బీటెక్‌ రెండో    సంవతర్సం,  చిన్న కూతురు గ్రీష్మ  మొదటి సంవత్సరం చదువుతోంది. గ్రీష్మను రోడ్డు ప్రమాదం బలితీసుకోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.  ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి. 

చేతికొచి్చన కుమారుడు శవమై కనిపించడంతో.. 
సిద్దిపేట పట్టణానికి చెందిన నేతి నర్సింహులు–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు. నర్సింహులు  ప్రైవేటు ఏజెన్సీలో గుమాస్తాగా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు నాగరాజు బీటెక్‌ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు నవీన్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చేతికందిన కుమారుడు కళ్ల ముందే  శవమై కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి.  

మల్లారెడ్డిలో సీటు వచ్చినా..  
సిద్దిపేటకు చెందిన కళా సదాశివ్‌– అర్చన దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విపిన్‌ చంద్ర బీటెక్‌ మొదటి సంవత్సరం, చిన్న కుమారుడు కీర్తన్‌ ఇంటర్‌    ద్వితీయ సంవత్సరం. తల్లిదండ్రులు ఇద్దరు పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. విపిన్‌ మొదటగా  మల్లారెడ్డి కళాశాలలో సీటు రావడంతో అందులో చేరాడు. కానీ వాతావరణం పడకపోవడంతో ఇందూరు కళాశాలలో చేరాడని, అదే  శాపంగా మారిందని తల్లిదండ్రులు బోరున విలపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement