'హిమాచలీ రంజా' ఖరీదు రూ.5 కోట్లు!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ రైతు .. దున్నపోతును వేలానికి పెట్టాడు. సాధారణంగా గేదలు, దున్నలను మామూలుగా బేరానికి పెడుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఏదైనా చేయాలని భావించిన రైతు నరేష్ సోని(44) వినూత్న పద్ధతిని ఎన్నుకున్నాడు. సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వేలం పెట్టాడు. దున్నపోతు వివరాలను అందుబాటులో ఉంచుతూ.. వేలం తేదీ తదితరాలను ఫేస్ బుక్ ద్వారా నలుగురికి పంచుతున్నాడు.
రైతు ఉంచిన వివరాల ప్రకారం దున్నపోతు పేరు 'హిమాచలీ రంజా' దీని ప్రస్తుత వయసు 30 నెలలు. దాదాపు 1000 కేజీల బరువు, 13 అడుగుల పొడవు, 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు కలిగిన దున్నపోతు ధర రూ.5 కోట్లుగా తెలిపాడు. కాగా, ఈ శుక్రవారం హమీర్ పూర్ జిల్లాలోని ఘోరి ధవిరి పంచాయతీ పరిధిలో స్థానిక రాజకీయనాయకుల ఆధ్వర్యంలో దున్నపోతును వేలం వేయనున్నట్లు పేర్కొన్నాడు. హర్యానాలోని కురుక్షేత్రాకు చెందిన 'యువరాజ్' రూ.9 కోట్లు ధర పలికినపుడు, హిమాచలీ రంజా కచ్చితంగా రూ.5 కోట్లు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, దున్నపోతుల నుంచి సేకరించిన మేలిమి వీర్యకణాల అమ్మకం ద్వారా ఉత్తర భారతదేశంలో చాలా మంది రైతులు లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించేందుకే సోషల్ మీడియాలో అమ్మకం వివరాలను ఉంచినట్లు సోని తెలిపాడు. రోజుకు రూ.1,500ల రూపాయల రంజాకు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నాడు. వేలానికి బిలాస్ పూర్ ఎమ్మెల్యే బామ్ బెర్ ఠాకూర్, తదితరులను ఆహ్వానించినట్లు తెలిపాడు. కాగా అంత ధర పలుకుతున్న దున్నపోతును చూడటానికి తాను కచ్చితంగా వస్తానని ఠాకూర్ చెప్పినట్లు పేర్కొన్నారు.
'హిమాచలీ రంజా' రోజూవారీ డైట్ వివరాలు
సోయా బీన్- 2.5 కేజీలు
చనా- 2.5 కేజీలు
పశుగ్రాసం- 10 కేజీలు
దేశీయ నెయ్యి- 1 కేజీ
ఆపిల్ పళ్లు
మసాజ్ కోసం 2 కేజీల నూనె