గోవాలో భవనం కూలి 14మంది సజీవసమాధి
పనాజీ: నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 14మంది కార్మికులు సజీవసమాధికాగా, 13మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పనాజీకి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కానకోనా టౌన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కానకోనాలో చ్వాదీ వార్డ్‌లో రూబీ రెసిడెన్సీ వద్ద మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. దాంతో సమాచరం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మురం చేశారు. శిధిలాల నుంచి ఇప్పటివరకూ 11మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ పర్యవేక్షణలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణంలో వున్న భవనం కింద 50మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
శిధిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన 13మందిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రజా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ భవన నిర్మాణం నవాయి ముంబై ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్ధ నిర్మిస్తున్నట్టు తెలిసింది. భవనం కూలడానికి ఉపయోగించిన అణువులు నాశికరమైనవి కాబట్టే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి పారిక్కర్ అధికారులను అదేశించారు. దీంతో భవనం కాంట్రాక్టర్, మునిషిపల్ ఇంజినీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.