పర్యాటక ముసుగులో గం‘జాయ్’!
- పంథామార్చిన స్మగ్లర్లు
- ఆధునిక కార్లే రవాణా సాధనాలు
పాడేరు : ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో గత ఏడాది సాగు చేసిన గంజాయి నిల్వలు భారీగా పేరుకుపోవడంతో వ్యాపారులంతా పలు రకాల మార్గాల్లో వీటిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి ప్రాంతాలు పర్యాటకంగా పేరొందడంతో పర్యాటక ముసుగులో తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారులు ఆధునిక కార్లు, మినీ వ్యాన్లనే రవాణా సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పర్యాటకులు మాదిరిగా ఏజెన్సీలో సంచరిస్తూ గంజాయి మూటలను కార్లు, వ్యాన్లలో అమర్చి అరకులోయ, అనంతగిరి ఘాట్ ప్రాంతాల మీదుగా విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇటీవల పాడేరు నుంచి అరకుపోయే మార్గంలో గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు కూడా సమాచారం అందింది. నర్సీపట్నం, పాడేరు రూట్లలో పోలీసు, ఎక్సైజ్ అధికారుల నిఘా అధికంగా ఉండటంతో వ్యాపారులంతా తమకు కలిసొస్తున్న అరకు, అనంతగిరి మార్గాన్నే ఎంచుకుంటున్నారు. పెదబయలు సమీపంలోని మత్స్యగెడ్డ వద్ద నాటు పడవల ద్వారా గంజాయి మూటలను అవతల ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ఒడిశాలోని పాడువా, చటువా మీదుగా అరకు ప్రాంతానికి ఈ కార్లలో గంజాయిని తరలిస్తున్న ముఠాలు కూడా అధికమయ్యాయి. కొత్త, కొత్త కార్లు కావడంతో పోలీసు, ఎక్సైజ్ అధికారులకు కూడా అనుమానం రావడం లేదు. ఈ వాహనాల్లో మహిళలు కూడా ప్రయాణిస్తుండటంతో పర్యాటకులుగానే పలువురు భావిస్తున్నారు.
పగటి వేళల్లోనే గంజాయి రవాణా అధికంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అరకులోయ మండల కేంద్రంలో ఓ పెద్ద గంజాయి ముఠా కూడా మకాం వేసి పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మారుమూల ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి రవాణా చేస్తున్నట్టు సమాచారం. అరకులోయలో పర్యాటకులు అధికంగా సంచరిస్తుండటంతో గంజాయి వ్యాపారులు తిరుగుతున్నా ఎవరికీ అనుమానం రావడం లేదు. అలాగే రాత్రి వేళల్లో కూడా గంజాయి రవాణాతో వాహనాలు అధికంగా సంచరిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు అరకు, అనంతగిరి మార్గంలో పర్యాటకుల వాహనాలను కూడా తనిఖీ చేస్తే మరింత గంజాయి రవాణా వెలుగు చూసే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.