స్పైస్‌జెట్ నుంచీ చవక విమాన టికెట్లు!!
చవక విమాన ప్రయాణాల కాలం మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకు ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ తన ప్రారంభ ఆఫర్‌గా 339 రూపాయల నుంచి టికెట్లు మొదలుపెడితే, ఇప్పటికే రంగంలో ఉన్న స్పైస్ జెట్ ఇప్పుడు స్వదేశీ ప్రయాణాల్లో రూ.2,999కే టికెట్ ఇస్తామంటూ ఆఫర్ మొదలుపెట్టింది. దీనికి కూడా కేవలం మూడు రోజుల పాటే టికెట్ బుకింగ్ అవకాశం ఉంది. అయితే, ప్రయాణ కాలాన్ని మాత్రం స్పైస్ జెట్ కాస్తంత ఎక్కువగానే ఇచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో బుక్ చేసుకునే ఈ టికెట్లతో జూలై 6వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. నేరుగా గమ్యానికి వెళ్లే విమానాలతో పాటు ఎక్కడైనా ఒక ఎయిర్‌పోర్టులో ఆగి మళ్లీ వెళ్లే ప్రయాణాలకు కూడా ఇది వర్తిస్తుందని, ప్రధానంగా ద్వితీయశ్రేణి నగరాల్లో ట్రాఫిక్‌ను పెంచేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చామని స్పైస్ జెట్ పేర్కొంది.
మరోవైపు.. ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ తాను బుకింగ్ మొదలుపెట్టిన మొదటి రెండు రోజుల్లోనే 25వేల ప్రమోషనల్ టికెట్లు అమ్మింది. బెంగళూరు నుంచి గోవాకు వెళ్లే మొదటి విమాన టికెట్లయితే కేవలం 10 నిమిషాల్లోనే అయిపోయాయి. మార్కెట్లో తమకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, తాము ముందునుంచి ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉంటామని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిట్టు శాండిల్య చెప్పారు.