అమెరికాకు పిల్లల అక్రమ రవాణా
- ముఠానాయకుడి సహా 16 మంది అరెస్టు
సాక్షి, బెంగళూరు: అమెరికాకు అక్రమ మార్గంలో పిల్లలను తీసుకువెళ్తున్న ఓ ముఠాను కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ) అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు మహిళలతో సహా 16మంది ఉన్నారు. నకిలీ తల్లిదండ్రులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి, టూరిస్టు వీసాలపై పిల్లలను అమెరికాకు ఈ ముఠా తరలిస్తోందని పోలీసులు తెలిపారు.
నిరుపేదల నుంచి పిల్లలను కొనుగోలు చేసి బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారని.. నిందితులపై దాదాపు ఏడాది పాటు సిట్ నిఘా ఉంచింది. పిల్లలను తీసుకుని టూరిస్టు వీసాలపై వెళ్తున్న దంపతులు.. తొందరగానే తిరిగి వస్తుండటం, వచ్చేప్పుడు పిల్లలు లేకుండానే రావటం గమనించిన దర్యాప్తు అధికారులు సోమవారం 14 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ముఠా నాయకుడితో సహా 16మందిని అరెస్టు చేశారు.