పెళ్లంటే పిల్లలాట కాదు
అవును. పెళ్లంటే ఆట కాదు. అల్లరి కాదు. చదువు కాదు. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు. మోయవలసిన బాధ్యత. ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో పెద్దల్ని మోయడానికి భుజ బలం కావాలి. మనోబలం ఉండాలి. చిన్నప్పుడే పెళ్లి చేయడం అంటే.. కాళ్లకు తాళ్లేసి కట్టేయడమే! పెళ్లంటే పిల్లలాట కాదని.. యశోద చెబుతోంది ఇందుకే. ఆమె ఓ గ్రామీణ యువతి. ఇప్పుడామె.. ఐక్యరాజ్య సమితి వాలంటీర్!
ఇల్లిల్లూ కాదు, ఊరూరూ తిరిగి చెబుతోంది యశోద.. చిన్నప్పుడే పిల్లకు పెళ్లిళ్లు చేసేయొద్దని. చెప్పడం ఎవరైనా చెబుతారు. ప్రధాని చెప్పడం లేదా? రాష్ట్రపతి చెప్పడం లేదా. కానీ యశోద.. చెప్పడంతో పాటు ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుంటే వెళ్లి ఆ పెళ్లిని ఆపేస్తోంది! పీలగా, ఎముకల్లో బలం లేనట్లుగా ఉంటుంది ఈ 21 ఏళ్ల అమ్మాయి. ఈమె వెళ్లి ‘ఆపండి’ అని గర్జిస్తే ఎవరు వింటారు? ‘పో పోవమ్మా..’ అంటారు. ‘భజంత్రీలూ మీరు కానివ్వండయ్యా’ అంటారు. అసలు సొంత ఇంట్లోని వాళ్లే యశోదకు సపోర్టుగా రాలేదు.
‘నిన్న మొన్న పుట్టినదానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’ అని చెప్పేశారు. ఇది జరిగింది ఆమెకు 18 ఏళ్ల వయసప్పుడు. యశోద వాళ్ల ఊరు దుమెర్పానీ. ఊరూ అదే, గ్రామ పంచాయితీ అదే. ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఉంటుంది. దుమెర్పానీకి దగ్గరలో హల్దీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎవరో చిన్న పిల్లకు, చిన్న పిల్లాడికీ పెళ్లి చేస్తున్నారని తెలిసి రయ్యిన అక్కడికి వెళ్లింది. ఒక్కటే వెళ్లలేదు. అప్పటికే తను రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనేదొకటి. ‘ఆశా’అనే సంస్థ మరొకటి. వాళ్లు వెనకుంటే, యశోద ముందుకు వెళ్లి.. ‘పిల్లలకు పెళ్లి చేయకండి’ అంది! కోపంగా చూశారు పెళ్లి చేస్తున్నవారు.
బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యపరుస్తున్న యశోద
వింతగా చూశారు పెళ్లికొచ్చినవాళ్లు. ‘ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అని పెద్దవాళ్లు అన్నారు. ‘తెలిసినమ్మాయే. పక్క గ్రామం’ అన్నారు.. యశోద ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుండటం తెలిసినవాళ్లు. అప్పటికి పెళ్లి ఆగిపోయింది. అంతా వెళ్లిపోయాక చుట్టుపక్కల ఊళ్లలో నిరసన మొదలైంది. ‘‘ఊరి పిల్ల అయుండీ, ఊరి ఆచారాలు తెలియవా! ఎవర్నో వెంటేసుకుని వచ్చి మరీ పెళ్లిని ఆపేయిస్తుందా?’’ అని ఊళ్లో అరుగుల మీద ‘చుట్ట ముక్క’ చర్చలు మొదలయ్యాయి. ఊళ్లో చెరువుల దగ్గర నీళ్ల బిందెలు బుగ్గలు నొక్కుకున్నాయి. విషయం యశోద ఇంట్లో తెలిసింది. ‘నిన్న మొన్న పుట్టిన దానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’’ అని అప్పుడే వాళ్లు అన్నది.
∙∙
కూర్చోలేదు యశోద. సామాజిక కార్యకర్తలతో కలిసి తిరిగింది. ఈ మూడేళ్లలో చుట్టుపక్కల ఊళ్లల్లో జరగబోయిన బాల్యవివాహాలను ఓ ఎనభై వరకు ఆపగలిగింది! ఊరికే లీడర్ అయింది. యువలీడర్. ఆడపిల్లలకు యశోదక్కను చూస్తే యమా క్రేజ్. ఇంట్లో వాళ్లు తమను బడి మాన్పించబోతున్నా, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా, తమను బయటికి వెళ్లి ఆడుకోనివ్వకపోయినా.. ‘యశోదక్కకు చెబుతాం’ అని పైపైకి లేస్తున్నారు. వాళ్లను చెయ్యిపట్టి ఆపడం తల్లిదండ్రుల పనౌతోంది. యశోదక్కకు చెబితే యశోదక్క టీమ్ ఏమీ కర్రలు పట్టుకుని వచ్చేయదు.
కూడలి లో గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టి, చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితం ఎలా అయిపోతోందో కళ్లకు కట్టేలా చెప్పి వెళ్తుంది. యశోద మీటింగ్‌లలో ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ కూర్చొని ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారిప్పుడు. ఆ మాటలు వారిలో ఆలోచన కలిగించేలా ఉంటాయి. ఆ ఊళ్లన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. అందుకే ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి, మెట్టినూళ్లలో వారికి మంచి పరిస్థితుల్ని కల్పించాలని తల్లిదండ్రులు త్వరపడుతుంటారు. పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లే వారిలో ఎక్కువమంది. దక్షణాది రాష్ట్రాలకొచ్చి ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి పిల్ల పెళ్లి కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకుని తిరిగి ఊరు చేరుతుంటారు. ఏడాదికి మూడు సీజన్ల వలసలు వాళ్లవి.
యశోదకు ఇదంతా తెలియంది కాదు. పిల్ల పెళ్లి కోసం కష్టపడుతున్నవాళ్లు, పిల్లకు తగిన వయసు రాకుండానే పెళ్లి అనే కష్టాన్ని తెచ్చి పెట్టడం ఎందుకు అని ఊళ్లోవాళ్లకు నచ్చ చెబుతుంది. ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘ఆశా’ సంస్థలు కలిసి ‘మ్యారేజ్: నో చైల్డ్స్ ప్లే’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. అందులో వాలంటీర్ యశోద. బాల్య వివాహాలను నివారించడంతో పాటు యశోద ఇప్పుడు బాలబాలికల సమానత్వం, రుతుక్రమ పరిశుభ్రత, గృహ హింస, బాలికల విద్య, నచ్చిన రంగాన్ని ఎంచుకునే విధంగా బాలికల్ని, యువతుల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాలంటీర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో ఇప్పుడు యశోద ఎంత చెబితే అంత అయింది. ఏమైనా మంచే కదా తను చెబుతోంది అనే దగ్గరికి ఊరూ వాడా వచ్చేశారు. ఐక్యరాజ్య సమితి ఏటా ‘వి–అవార్డు’ ఇస్తుంటుంది. ఈ అవార్డును ఈ ఏడాది యశోదకు ఇస్తున్నట్లుగా శనివారం ప్రకటించింది. వి అంటే వాలంటీర్. ది బెస్ట్ వాలంటీర్‌గా యశోద ఐరాస గుర్తింపు పొందింది.
∙∙
2017లో మొదటి బాల్యవివాహాన్ని ఆపేశాక, యశోద ఆ చుట్టుపక్కల గ్రామాలలో నెలకు రెండుసార్లు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించింది. ఆ పని మొదట తన ఊరితో ప్రారంభించింది. రెండో ఏడాదికల్లా మిగతా ఊళ్లలోనూ అవేర్నెస్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం 10–19 ఏళ్ల వయసులోని పిల్లలు. వాళ్లను సమీకరించి మంచి చెడులు వివరించేది. సొంత ఊరు దుమెర్పానీలోనే 15 బాల్య వివాహాలను నివారించగలిగింది యశోద. అప్పటికే ఆ అమ్మాయి పేరు జిల్లా మొత్తం వ్యాపించింది. నౌపడలోని నేషనల్ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది యశోద. నౌపడలో ఇప్పుడున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సదుపాయం ఆమె తీసుకున్న చొరవ ఫలితమే. ‘ఆడపిల్లల్తో నేనొక సామాజిక చైతన్య సైన్యాన్ని తయారు చేస్తాను’ అంటోంది యశోద ఇప్పుడు. చేస్తోంది కూడా తను. అంత పట్టుదల గల అమ్మాయి.
ఐక్యరాజ్యసమితి ‘వి–అవార్డు’ విజేత యశోదా పాండే