chinthakommadinne
-
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చింతకొమ్మదిన్నె/ పెండ్లిమర్రి/గాలివీడు: కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని మద్దిమడుగు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని నూలివీడుకు చెందిన దేరంగుల శ్రీనివాసులు (45) తన ఆటోలో సొంత పనుల నిమిత్తం కడపకు బయలుదేరారు. రామాపురం సమీపానికి రాగానే షేక్ మస్తాన్‌బీ (26)తోపాటు ఆమె భర్త షేక్ ఖాదర్‌బాషా, దర్బార్, నసీమ్ ఆటో ఎక్కారు. మద్దిమడుగు వద్దకు రాగానే పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దేరంగుల శ్రీనివాసులు (45)తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మస్తాన్‌బీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఖాదర్‌బాషా, దర్బార్, నషీమ్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్ఐ భుమా అరుణ్‌రెడ్డి తెలిపారు. నాటు వైద్యం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. పెండ్లిమర్రి మండలం చీమలపెంట గ్రామ పంచాయతీలోని బారెడ్డిపల్లె గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌బీ (35)కి అనారోగ్య సమస్య ఉండటంతో భర్త షేక్ ఖాదర్ బాషాతో కలిసి రామాపురం వెళ్లారు. అక్కడ నాటు వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామానికి రావడానికి ఆటో ఎక్కారు. మార్గంమధ్యలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందగా, భర్తకు గాయాలు అయ్యాయి. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. మృతురాలు కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేంది. ఎమ్మెల్యే సంతాపం గాలివీడు మండలం నూలివీడుకు చెందిన ఆటో డ్రైవర్ దేరంగుల శ్రీనివాసులు మృతి పట్ల ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ ఉమాపతిరెడ్డి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వారు తెలిపారు. మృతుడికి భార్య వెంకటమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఇంటింటికీ మొక్కల పంపిణీ
చింతకొమ్మదిన్నె: స్థానికంగా ఏపీఎస్‌బీబీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జెడ్పీటీసీ సభ్యుడు పి.నరేన్ రామాంజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 పంచాయతీల పరిధిలో గల వివిధ గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్‌రెడ్డి, గంగాదేవి, రమేష్, మండల కన్వీనర్ గూడ ప్రభాకర్‌రెడ్డి, కో–కన్వీనర్ కళాయాదవ్, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీపై విమర్శలకే మహానాడు పరిమితం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కేవలం వైఎస్సార్సీపీపై విమర్శలకే పరిమితమైందని జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. సీకేదిన్నె ఎంపీడీవో కార్యాలయంలోని చాంబర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గతంలో వాగ్దానాలు ఏవీ నెరవేర్చకపోగా.. ప్రస్తుతం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని తెలిపారు. -
రిమ్స్‌లో మృతి చెందిన మహిళ
– మరణించిందని తెలిసినా కన్నెత్తి చూడని బంధువులు – ఆమె వద్ద ఉన్న బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే రాబందుల్లా వాలిపోయిన వైనం ఆమె బతికి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆమెను ఆదరించలేదు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె మరణించిందని తెలిసినా చివరి చూపు కోసం కూడా రాలేదు. ఆమె దగ్గరున్న సంచిలో బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియగానే ఆమె బంధువులం మేమంటే మేమంటూ రాబందుల్లా వాలిపోయారు. కడప అర్బన్: చింతకొమ్మదిన్నెకు చెందిన చింతల మల్లీశ్వరి భర్త, కుమారుడు మృతి చెందడంతో గత కొంత కాలంగా రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయపురం వికలాంగుల కాలనీలో నివసిస్తోంది. ఆమె ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఓ మహిళను పనిమనిషిగా పెట్టుకుని జీవించేది. ఈనెల 17న ఉదయం 11 గంటల ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతూ ఉంటే అదే ప్రాంతానికి చెందిన పని మనిషి సోదరుడు సుధీర్ అనే ఆటో డ్రైవర్ ఆమెను తీసుకుని వచ్చి రిమ్స్‌లోని మెడికల్ ఐసీయూలో చేర్పించాడు. ఈనెల 18 వ తేదీన మంగళవారం తెల్లవారు జామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది. ఆమె కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ మృత దేహంగా భావించారు. ఈ నేపథ్యంలో ఆమె తన దగ్గర ఉంచుకున్న హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించారు. అందులో సుమారు 17 తులాల బరువు గల 12 బంగారు గాజులు, ఒక చైన్, ఉంగరాలు, వెండి పట్టీలు ఉన్నాయి. అలాగే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారు కొందరు ఆమె బంధువులం తామేనంటూ ముందుకు వచ్చారు. ఆమె కోసం వచ్చిన వారి దగ్గర నుంచి రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. వారిలో ఆమెను రిమ్స్‌లో చేర్పించిన సుధీర్ అనే ఆటో డ్రైవర్, చింతకొమ్మదిన్నెకు చెందిన మల్లయ్య, పెద్దపోతులూరయ్య, రామాంజులు, గంగులయ్య, యల్లమ్మలు తాము బంధువులమంటే తామ బంధువులమంటూ ఎగబడ్డారు. దీంతో రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సంబంధించిన వస్తువులను రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట శివకు అప్పగించారు. ఆయన రిమ్స్ సీఐకి ఫిర్యాదు చేసి వాటిని అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రిమ్స్ సీఐ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ తమ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలు
రామాపురం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం బండపల్లె పంచాయతీ పరిధిలో ఓ పెట్రోలు బంకు సమీపాన ఆదివారం కారు – బైక్ ఢీకొని నలుగురు గాయాల పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లెకు చెందిన ఆంజనేయులు, ఆయన భార్య సుజాత, పిల్లలు గౌతమ్, తేజ రాయచోటి కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లి తిరిగి జమాల్‌పల్లెకు బైక్‌పై వస్తుండగా.. రాయచోటి నుంచి కడప వైపునకు వెళ్తున్న టాటా ఏస్ కారు వెనుక వైపు నుంచి ఢీకొంది. సంఘటన స్థలానికి రామాపురం పోలీసులు చేరుకొని బాధితులను 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు తెలిపారు. సంఘటన స్థలానికి మండల టీడీపీ అధ్యక్షుడు యర్రబోలు శేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకుడు సూరం వెంకటసుబ్బారెడ్డి, ప్రశాంతరెడ్డి, టీడీపీ నాయకుడు రాజశేఖర్ తదితరులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు.