బడ్జెట్ ప్రసంగంలో మాల్యా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం వెలికి తీతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న జైట్లీ బిగ్ టైం అఫెండర్స్ ఆస్తులను జప్తు చేయాలనే ప్రతిపాదను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు పరోక్షంగా గట్టి హెచ్చరికనే చేశారు. ఆర్థిక నేరస్తులకు శిక్ష తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు వారి ఆస్థులను స్వాధీనంకోసం కొత్త చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
భారతదేశం విదేశాల్లో వున్న అక్రమ ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అనేక క్షమాభిక్ష పథకాలు అమలు చేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆర్థిక నేరస్థులపై మరింత ఒత్తిడి పెంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్విట్జర్లాండ్, సింగపూర్ బ్యాంకుల్లో దాగి వున్న అప్రకటిత ఆదాయం, ఆభరణాల, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులపై పెట్టుబడుల ద్వారా పన్ను ఎగవేస్తున్నవారిపై విమర్శకులు, నిపుణులు ప్రశ్నించారు.
కాగా లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా రూ.6,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన సంగతి విదితమే. మరో వైపు సీబీఐ కూడా మాల్యా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని స్వదేశం రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడీబీఐ లోన్ డిఫాల్ట్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు, ఐడీబీఐ అధికారులను, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అఫిడవిల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీంతో మంగళవారం మాల్యా మరోసారి నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.