సీడీ రేషియో.. మూడు, నాలుగు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
ముంబై: క్రెడిట్-డిపాజిట్ల రేషియో(సీడీ)లో ఆంధ్రప్రదేశ్ 109 శాతంతో మూడో స్థానంలో, 106 శాతంతో తెలంగాణ నాల్గో స్థానంలో ఉన్నాయి. సీడీ రేషియోలో 121 శాతంతో తమిళనాడు అగ్ర స్థానంలో, 114.9 శాతంతో చండీగఢ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. బ్యాంకులు సేకరించిన డిపాజిట్లతో పోలిస్తే అవి ఇచ్చిన రుణాల నిష్పత్తి శాతాన్నే సీడీ రేషియోగా వ్యవహరిస్తారు.
క్యూ3లో 10%కి తగ్గిన బ్యాంకు పరపతి వృద్ధి
రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం క్యూ3లో బ్యాంకు పరపతి వృద్ధి 10 శాతానికి తగ్గింది. ఇది గతేడాది అదే త్రైమాసికంలో 14.2 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం డిపాజిట్లలో వృద్ధి గతేడాది 15.4 శాతంగా ఉంటే, ఈ ఏడాది వృద్ధి మాత్రం 10.9 శాతంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాలలో బ్యాంకు పరపతి, డిపాజిట్ల సంఖ్య తగ్గింపు కనిపించిందని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిట్లలో 73.3 శాతాన్ని, పరపతిలో 71.2 శాతాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిగి ఉన్నాయని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ప్రైవేట్ బ్యాంకుల శాతం 19.2గా, పరపతిలో 21 శాతంగా ఉందని పేర్కొంది. మెట్రోపాలిటన్ నగరాల్లో డిపాజిట్ల సంఖ్య 53.1 శాతంగా, పరపతి 64.2 శాతంగా ఉందని తెలిపింది. ఈ నగరాల్లో క్రెడిట్- డిపాజిట్ల రేషియో అత్యధికంగా 92.3% ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా సీడీ రేషియో 76%గా ఉంది.