నాట్యావధాని రామనాథశాస్త్రి కన్నుమూత
ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యావధాని డాక్టర్ ధారా రామనాథశాస్త్రి(85)శనివారం తెల్లవారుజామున ఒంగోలు మామిడిపాలెంలోని స్వగృహంలో కన్నుమూశారు. రామనాథశాస్త్రి ‘నాట్యవధానం’ అనే విశిష్ట ప్రక్రియకు రూపుకల్పన చేశారు. ఆయన అందించిన సేవలకు గాను ఏపీ ప్రభుత్వం ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారంతోపాటు సీఎస్ఆర్ ఫౌండేషన్ అవార్డు ఆయన్ను వరించాయి.
రామనాథశాస్త్రి కృష్ణ వాజ్మయం, రామలహరి తదితర గ్రంథాలను రచించారు. నాట్యావధాన కళాపీఠం, ఎర్రన పీఠం, వర్దమాన సమితి వంటి వాటిని స్థాపించి, సాహిత్య వేత్తలను, కళాకారులను సన్మానించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధారా రామనాథశాస్త్రి మృతికి పలువురు సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.