Dialysis centre
-
రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు డయాలసిస్ సౌకర్యాన్ని కల్పించడానికి కొత్తగా 61 డయాలసిస్ సెంటర్లను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో సుమారు 10వేలకు పైగా కిడ్నీ బాధితులుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. కొత్తగా మంజూరు చేసిన 61కేంద్రాల్లో ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఒక్కోదాంట్లో 5 డయాలసిస్ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి, హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముందుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీకి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
ఇక ఇంట్లోనే డయాలసిస్!
కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ ఓ బాధాకర అనుభవం. ఈ దశకు చేరుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడాల్సిందే. నగరాల్లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్‌లు అందుబాటులో ఉన్నా..అది ఆర్థికంగా ఇబ్బందికరమే కాకుండా.. సహకరించని దేహానికి బాధామయ పరీక్షే.దీనికి ఇప్పుడు ‘పెరిటోనియల్ డయాలిసిస్’ పేరిట పరిష్కారం దొరికింది. అదీ ఇంటి వద్దనే చిన్న ఏర్పాట్లతో చేసుకోవచ్చు. అమెరికా,ధాయ్‌ల్యాండ్, హాంకాంగ్ వంటి పలుదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలుకు సర్కార్ సంకల్పించింది. సాక్షి, హైదరాబాద్: డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులు నరకం అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్ చేయించుకొని రావడం క్లిష్టమైన ప్రక్రియ. ఇకపై ఈ పద్ధతికి చరమగీతం పాడేందుకు ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ‘పెరిటోనియల్ డయాలసిస్’అనే ఈ పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరిటోనియల్ డయాలసిస్ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చని తెలిపింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పెరిటోనియల్ పద్ధతినే పాటిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆసుపత్రులకు వెళ్లకుండానే తక్కువ సమయంలో డయాలసిస్ చేసుకోవచ్చు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను ఉపయోగించుకొని పెరిటోనియల్ డయాలసిస్‌ను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఏటా లక్ష మంది బలి.. దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఏటా లక్ష మంది ఈ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. 2015లో ఏకంగా 1.36 లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా కోటికి చేరింది. ఏటా మరో లక్ష మంది వీరికి తోడవుతున్నారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. 70 ఏళ్లలోపు చనిపోతున్నవారిలో 3 శాతం మంది కిడ్నీ వ్యాధికి లోనైన వారే. త్వరలో దేశంలో 10 లక్షల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని కేంద్రం అంచనా. తెలంగాణలో ప్రస్తుతం 3 లక్షల మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 15 వేల మందికి డయాలసిస్ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 43, ప్రైవేటు రంగంలో 30 యూనిట్లు డయాలసిస్ చేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసినందుకు ఒక్కోసారి రూ.3 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. పెరిటోనియల్‌తో లాభాలివే.. ప్రస్తుతం హీమో–డయాలసిస్ పద్ధతి అవలంబిస్తున్నారు. ఇది ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారు. జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానిలోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి రోగులు డయాలసిస్ కోసం వారానికి రెండు మూడు సార్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో అనేక మంది అంత దూరం ప్రయాణించలేక, ఖర్చు భరించలేక చికిత్స తీసుకోవట్లేదు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ పెరిటోనియల్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. పిల్లలైతే పెద్దల సహకారంతో చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు అర గంటపాటు డయాలసిస్ చేసుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్‌కు ఇంట్లో వెలుతురు ఉన్న గది ఉంటే చాలు. దానికి అనుబంధంగా బాత్రూం ఉండాలి. గది శుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం బెడ్షీట్లు మార్చుకోవాలి. డయాలసిస్ బ్యాగులు నిల్వ ఉంచుకోవడానికి సాధారణ వసతి సరిపోతుంది. హీమో డయాలసిస్ ద్వారా నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే.. పెరిటోనియల్ ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. మరింత ప్రయోజనం పెరిటోనియల్ డయాలసిస్‌తో రోగికి చాలా కష్టాలు తప్పుతాయి. ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే వీలుంది. దీన్ని ఉచితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. పెరిటోనియల్ డయాలసిస్ బ్యాగును సాధారణ పాల ప్యాకెట్లా తీసుకెళ్లొచ్చు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఈ బ్యాగులను అందుబాటులో ఉంచి సంబంధిత రోగులకు అందజేయాలి. ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా రోగి ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడదు. –డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, కార్యదర్శి, పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా. నోడల్ ఏజెన్సీలుగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు.. ప్రతి జిల్లాకు పెరిటోనియల్ డయాలసిస్‌ను పర్యవేక్షించే నోడల్ ఆఫీసర్ ఉంటారని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కిడ్నీ రోగులకు డయాలసిస్ విషయంలో సాయంగా ఉంటారు. డయాలసిస్ బ్యాగులను రోగులు సంబంధిత ఆసుపత్రుల నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగి మెడికల్ సిబ్బందికే అప్పగించాలి. రెండు నెలలకోసారి డయాలసిస్ రోగులు సంబంధిత సీహెచ్‌సీకి వెళ్లి తమ పరిస్థితిని చెప్పాలి. మూడు నెలలకోసారి ట్రైనింగ్ తీసుకోవాలి. రెండు మూడు నెలలకో సారి కిడ్నీ వైద్య నిపుణుడిని సంప్రదించాలి. -
శుద్ధి.. సులభంగా..
తూర్పుగోదావరి,అమలాపురం టౌన్: కిడ్నీ సంబంధిత రోగం వస్తే ఆ రోగికి వారానికి కనీసం రెండు సార్లు రక్త శుద్ధి జరగాలి. దీనినే డయాలసిస్ అంటారు. ప్రభుత్వ పరంగా జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లోనే ఈ సెంటర్లు ఉన్నాయి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు ముఖ్యంగా పేద రోగులు ఈ రక్తశుద్ధి కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. చాలా మంది కిడ్నీ రోగులు రక్త శుద్ధి కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ప్రతిసారి రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకూ వెచ్చిస్తున్నారు. వారికి ఆర్థిక భారమైనా రక్త శుద్ధి విధిగా చేయించుకోవాలన్న అత్యవసరంతో నెలకు రూ.25 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. రూ.మూడు కోట్ల వ్యయంతోమూడు కేంద్రాలు ప్రభుత్వం జిల్లాలోని అమలాపురం, రంపచోడవరం, తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో కూడా ఈ రక్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ మూడు ఆస్పత్రుల్లో దాదాపు రూ.మూడు కోట్ల వ్యయంతో సుమారు 30 డయాలసిస్ యంత్రాలను సమకూర్చింది. ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించే వైద్య విధాన పరిషత్ ఈ కేంద్రాల నిర్వహణను అపోలో ఆస్పత్రి యాజమాన్యాకి అప్పగించింది. ఈ మూడు కేంద్రాలో కిడ్నీ రోగి బెడ్ వద్దే డయాలసిస్ మెషీన్ ఉంటుంది. ఒక్కో రోగికి రక్త శుద్ధి ప్రక్రియ మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోకా ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇప్పటికే ఆస్పత్రిలో ఈ రక్త శుద్ధి కేంద్రం కిడ్నీ బాధిత రోగులకు సేవలు అందిస్తోంది. అమలాపురంలో ఏర్పాటైన 12 డయాలసిస్ మెషీన్ల ద్వారా ఒకేసారి 12 మంది కిడ్నీ రోగులకు రక్తశుద్ధి చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఉచిత డయాలసిస్ సెంటర్అత్యవసరం కోనసీమలో ఉన్న అనేక పేద కుటుంబాలకు చెందిన వారు కిడ్నీ రోగులుగా ఉన్నారు. వీరందరూ కాకినాడ లేదా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్త శుద్ధి కోసం వెళుతున్నారు. ప్రత్యేకించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కూడా ఈ ఉచిత రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోనసీమలోని పేద కిడ్నీ రోగులకు ఈ కేంద్రం సేవలు అత్యవసరం అవుతాయి. అంతేకాదు ఉచిత సేవలు కాబట్టి ఆర్థిక వ్యయప్రయాసలు ఉండవు. రోజుకు రెండు షిఫ్ట్‌లలో రోగులకు ఈ కేంద్రం సేవలు అందించనున్నాం. – డాక్టర్ మోకా ప్రసాదరావు, సూపరింటెండెంట్,ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం -
ఈఎస్ఐ వైద్యం.. భరోసాకు దూరం
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వానంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు సరైన సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇక్కడ డయాలసిస్ సేవల్ని ఉపసంహరించారు. దీంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా సేవలు నిలిపి వేస్తే ఎలా అని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు అందాలంటే రెండు నెలలపాటు నిరీక్షించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈ బాధలు భరించలేని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అమీర్‌పేట్/సాక్షి, సిటీబ్యూరో:ఈఎస్ఐ ఆస్పత్రి అంటే ఓ భరోసా..ఓ ధైర్యం.. నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందనే నమ్మకం.. ఇప్పుడు సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి ఆపేరును చెరిపేసుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆస్పత్రి కనీస భరోసా ఇవ్వలేకపోతోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యసేవలను విస్మరిస్తుంది. తాజాగా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందించే ఏజేన్సీ పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆ సేవలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా సేవలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని రోగులు, వారి తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు. గడువున్నా..ఒప్పందం రదు... మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ చేస్తుంటారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో 1500 మంది బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొందరికి వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. ఒక్కో బృందంలో 310 మందికి డయాలసిస్ చేస్తున్నా రు. ఈ సేవలను నెఫ్రోప్లస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు ఇచ్చిన గడువు ఇంకా కొంత కాలం ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ సంస్థతో సేవలను ఈఎస్ఐ రద్దు చేసుకుంది. ప్రత్యామ్నాయంగా డయాలసిస్ కోసం నగరంలో ఐదు ఆసుపత్రులను ఎంపిక చేసింది. అక్కడకు వెళ్లాలని రోగులకు సూచిం చింది. అకస్మా త్తుగా సేవలను ఎత్తివేయడంపై రోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే డయాలసిస్ కాంటాక్ట్ దక్కించుకున్న సంస్థ పనితీరు సరిగా లేనందు వల్లే సేవలను ఉపసంహరించుకున్నట్లు ఈఎస్ఐసీ సూపర్‌స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఐదు ఆస్పత్రులను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంఆర్ఐకి రెండు నెలలు... ఆస్పత్రిలో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పాటు 16 సాధారణ చికిత్సల విభాగాలు ఉన్నాయి. సుమారు 380 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 350 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. క్షతగాత్రులతో పాటు తల నొప్పి, వెన్ను పూస నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు ఉంటారు. వీరిలో చాలా మందికి సీటీ, ఎంఆర్ఐ టెస్టులు అవసరం ఉంటుంది. వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఎంఆర్ఐ విభాగానికి వెళ్తే..రెండు నెలల తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. అప్పటికే వ్యాధి తీవ్రత మరింత ముదిరి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. చేసేది లేక కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రిలో రెండు అధునాతన ఎంఆర్ఐ మిషన్లు ఉన్నా సకాలంలో సేవలు అందకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
నరకయాతన
ఆదోని టౌన్: డయాలసిస్ వ్యాధి గ్రస్తుల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారానికి రెండు, మూడు సార్లు కర్నూలుకు వెళ్లి వైద్యం చేయించుకొని వచ్చేందుకు వారు పడుతున్న అవస్థలు దేవుడికెరుక. ఒక పక్క మందులకు.. మరో పక్క రవాణా చార్జీలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదోని డివిజన్ కేంద్రమైన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కల ఎన్నటికి తీరేనోనని రోగులు, వారి బంధువులు ఎదురు చూస్తున్నారు. డివిజన్ వ్యాప్తంగా 60 మంది డయాలసిస్ పేషెంట్లు ఆదోని డివిజన్లో 60 మంది దాకా డయాలసిస్ రోగులు ఉన్నారు. అయినప్పటికీ సెంటర్ ఏర్పాటులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రాణాంతక జబ్బు వ్యాపించిన వ్యాధిగ్రస్తులు వేలకు వేలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. 25 మందికి పైగా ఉంటే సెంటర్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డయాలసిస్ పేషెంట్లకు గతంలో మాదిరిగా ఆరోగ్య పథకం కింద వైద్యం అందించాలని, వ్యాధి సోకిన సమయంలో ఖరీదైన, అధిక మోతాదు కలిగిన ఇంజెక్షన్లు వేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు. రవాణా చార్జీలు భారం పూట గడవడమే కష్టంగా ఉంది. అమ్మ పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నాం. వారానికి రెండు మూడు సార్లు కర్నూలుకు వెళ్లి వైద్యం చేయించుకొని రావాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పైగా ఖర్చవుతోంది. రవాణా చార్జీలే భారంగా మారాయి. స్నేహితులు, తెలిసిన వారు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన జీవితం మరెవరికీ రాకూడదు. – చంద్రమౌళీ, వ్యాధిగ్రస్తుడు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలి డయాలసిస్ వ్యాధి గ్రస్తులకు ఉచిత బస్సు పాసులు, మెడిసిన్ ఖర్చులు ఇవ్వాలి. 2కె ఇంజెక్షన్ బదులు 4కె ఇంజెక్షన్లు వేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాధి గ్రస్తులు కర్నూలు, ఆదోనికి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఆర్థిక భాకమవుతోంది. ఉచిత బస్సు పాసులు ఇస్తే కొంతైనా మేలు జరుగుతుంది. – దిలీప్, స్థానికుడు వచ్చేనెల 15 లోగా సెంటర్ ఏర్పాటు పనులు వేగంగానే జరుగుతున్నాయి. వచ్చేనెల 15 లోగా పూర్తవుతాయి. ఆ వెంటనే సెంటర్ ఏర్పాటు చేస్తాం. పది మిషన్లు, పది మంచాలు, ఇద్దరు డాక్టర్లు, నలుగురు టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సుల నియామకం కూడా జరిగింది. – శివప్రసాద్‌రెడ్డి, యూనిట్ మేనేజర్ -
'డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి'
► కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి న్యూఢిల్లీ: ఫ్లోరోసిస్ సమస్యలతో ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతున్న ప్రకాశం జిల్లాలో వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రకాశం జిల్లాలోని 58 మండలాల్లో 48 మండలాల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. జాతీయ డయాలసిస్ సేవల పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లోరోసిస్‌తో కనిగిరి, పొదిలి మండలాల్లో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఇవి ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఒంగోలులో ఉన్న డయాలసిస్ కేంద్రంలో వైద్యం చేయించుకోవడానికి వారానికి రెండు సార్లు ప్రజలు సుమారు 90 కిలోమీటర్లు ఉత్తి కడుపుతో ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కనిగిరిలో గానీ, పొదిలిలో గానీ ఈ కేంద్రాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకొని ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం!
ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళనాడు కిడ్ని రిసెర్చ్ (టాంకర్) ఫౌండేషన్ కు ఆరు లక్షల రూపాయలను విరాళమందించారు. మూత్ర పిండాల వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఉపయోగించే డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం సూర్య విరాళాన్ని అందించారు. తమిళనాడులోని సూలూరులో డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించిన సూర్య వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ... డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం 6 లక్షల విరాళం ఇచ్చాను అని తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు టాంకర్ ఫౌండేషన్ సబ్సీడి ప్రాతిపాదికన డయాలిసిస్ పరీక్షల సేవలను అందిస్తోంది. టాంకర్ ఫౌండేషన్ 1993 సంవత్సరంలో ఏర్పడింది.