ఇక ఇంట్లోనే  డయాలసిస్‌! | Dialysis With In Only Half And Hour At Home | Sakshi
Sakshi News home page

ఇక ఇంట్లోనే  డయాలసిస్‌!

Published Sun, Oct 13 2019 3:33 AM | Last Updated on Sun, Oct 13 2019 11:03 AM

Dialysis With In Only Half And Hour At Home - Sakshi

కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్‌ ఓ బాధాకర అనుభవం. ఈ దశకు చేరుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడాల్సిందే. నగరాల్లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్‌లు అందుబాటులో ఉన్నా..అది ఆర్థికంగా ఇబ్బందికరమే కాకుండా.. సహకరించని దేహానికి బాధామయ పరీక్షే.దీనికి ఇప్పుడు ‘పెరిటోనియల్‌ డయాలిసిస్‌’ పేరిట పరిష్కారం దొరికింది. అదీ ఇంటి వద్దనే చిన్న ఏర్పాట్లతో చేసుకోవచ్చు. అమెరికా,ధాయ్‌ల్యాండ్, హాంకాంగ్‌ వంటి పలుదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలుకు సర్కార్‌ సంకల్పించింది.

సాక్షి, హైదరాబాద్‌: డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ రోగులు నరకం అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్‌ చేయించుకొని రావడం క్లిష్టమైన ప్రక్రియ. ఇకపై ఈ పద్ధతికి చరమగీతం పాడేందుకు ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ‘పెరిటోనియల్‌ డయాలసిస్‌’అనే ఈ పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చని తెలిపింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పెరిటోనియల్‌ పద్ధతినే పాటిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆసుపత్రులకు వెళ్లకుండానే తక్కువ సమయంలో డయాలసిస్‌ చేసుకోవచ్చు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులను ఉపయోగించుకొని పెరిటోనియల్‌ డయాలసిస్‌ను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఏటా లక్ష మంది బలి.. 
దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఏటా లక్ష మంది ఈ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. 2015లో ఏకంగా 1.36 లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా కోటికి చేరింది. ఏటా మరో లక్ష మంది వీరికి తోడవుతున్నారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. 70 ఏళ్లలోపు చనిపోతున్నవారిలో 3 శాతం మంది కిడ్నీ వ్యాధికి లోనైన వారే. త్వరలో దేశంలో 10 లక్షల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తుందని కేంద్రం అంచనా. తెలంగాణలో ప్రస్తుతం 3 లక్షల మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 15 వేల మందికి డయాలసిస్‌ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 43, ప్రైవేటు రంగంలో 30 యూనిట్లు డయాలసిస్‌ చేస్తున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేసినందుకు ఒక్కోసారి రూ.3 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. 

పెరిటోనియల్‌తో లాభాలివే..
ప్రస్తుతం హీమో–డయాలసిస్‌ పద్ధతి అవలంబిస్తున్నారు. ఇది ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారు. జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానిలోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి రోగులు డయాలసిస్‌ కోసం వారానికి రెండు మూడు సార్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో అనేక మంది అంత దూరం ప్రయాణించలేక, ఖర్చు భరించలేక చికిత్స తీసుకోవట్లేదు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ పెరిటోనియల్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. పిల్లలైతే పెద్దల సహకారంతో చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు అర గంటపాటు డయాలసిస్‌ చేసుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు. పెరిటోనియల్‌ డయాలసిస్‌కు ఇంట్లో వెలుతురు ఉన్న గది ఉంటే చాలు. దానికి అనుబంధంగా బాత్రూం ఉండాలి. గది శుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం బెడ్‌షీట్లు మార్చుకోవాలి. డయాలసిస్‌ బ్యాగులు నిల్వ ఉంచుకోవడానికి సాధారణ వసతి సరిపోతుంది. హీమో డయాలసిస్‌ ద్వారా నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే.. పెరిటోనియల్‌ ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది.
 
మరింత ప్రయోజనం
పెరిటోనియల్‌ డయాలసిస్‌తో రోగికి చాలా కష్టాలు తప్పుతాయి. ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే వీలుంది. దీన్ని ఉచితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగును సాధారణ పాల ప్యాకెట్‌లా తీసుకెళ్లొచ్చు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో ఈ బ్యాగులను అందుబాటులో ఉంచి సంబంధిత రోగులకు అందజేయాలి. ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా రోగి ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడదు.  –డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు, కార్యదర్శి, పెరిటోనియల్‌ డయాలసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా.

నోడల్‌ ఏజెన్సీలుగా
 సామాజిక ఆరోగ్య కేంద్రాలు.. 
ప్రతి జిల్లాకు పెరిటోనియల్‌ డయాలసిస్‌ను పర్యవేక్షించే నోడల్‌ ఆఫీసర్‌ ఉంటారని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) నోడల్‌ ఏజెన్సీలుగా ఉంటాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు కిడ్నీ రోగులకు డయాలసిస్‌ విషయంలో సాయంగా ఉంటారు. డయాలసిస్‌ బ్యాగులను రోగులు సంబంధిత ఆసుపత్రుల నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగి మెడికల్‌ సిబ్బందికే అప్పగించాలి. రెండు నెలలకోసారి డయాలసిస్‌ రోగులు సంబంధిత సీహెచ్‌సీకి వెళ్లి తమ పరిస్థితిని చెప్పాలి. మూడు నెలలకోసారి ట్రైనింగ్‌ తీసుకోవాలి. రెండు మూడు నెలలకో సారి కిడ్నీ వైద్య నిపుణుడిని సంప్రదించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement