'డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి'
► కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: ఫ్లోరోసిస్ సమస్యలతో ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతున్న ప్రకాశం జిల్లాలో వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రకాశం జిల్లాలోని 58 మండలాల్లో 48 మండలాల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. జాతీయ డయాలసిస్ సేవల పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లోరోసిస్‌తో కనిగిరి, పొదిలి మండలాల్లో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఇవి ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఒంగోలులో ఉన్న డయాలసిస్ కేంద్రంలో వైద్యం చేయించుకోవడానికి వారానికి రెండు సార్లు ప్రజలు సుమారు 90 కిలోమీటర్లు ఉత్తి కడుపుతో ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కనిగిరిలో గానీ, పొదిలిలో గానీ ఈ కేంద్రాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకొని ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.