హైదరా‘బాద్షా’
ప్రపంచ టాప్ 30 డైనమిక్ సిటీల్లో ఐదో స్థానంలో మన మహానగరం
తొలి స్థానంలో బెంగళూరు; జాబితాలో పుణె, చెన్నై, ఢిల్లీ, ముంబై
134 మహానగరాల్లో నుంచి 30 సిటీలను ఎంపిక చేసిన జేఎల్ఎల్
‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్’ పేరుతో విడుదల
షికాగో
మన భాగ్యనగరం కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి దిశగా శరవేగంగా మార్పు చెందుతున్న మహానగరాల టాప్ టెన్ జాబితాలో హైదరాబాద్ చోటు సంపాదించింది. ప్రపంచ దేశాల్లోని మహా నగరాలను పక్కకుతోసి.. అత్యంత ‘డైనమిక్ సిటీ’ల లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్ఎల్ ఏటా విడుదల చేసే గ్లోబల్ ‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్(సీఎంఐ)’లో ఈ సంవత్సరం సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఐదో స్థానం సాధించింది. హోచి మిన్ సిటీ(వియత్నాం), సిలికాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై(చైనా) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలోని టాప్ 30 సిటీల్లో భారత్‌కు చెందిన ఆరు నగరాలుండటం విశేషం. పుణెకి 13వ స్థానం, చెన్నైకి 18వ స్థానం, ఢిల్లీకి 23వ స్థానం, ముంబైకి 25వ స్థానం లభించాయి. లండన్(6), న్యూయార్క్(14), పారిస్(17), లాస్ ఏంజెలిస్(27), దుబాయ్(11) తదితర మహానగరాలకు ఈ జాబితాలో చోటు దక్కింది.
తాజా జాబితాలో సగానికి పైగా ఆసియా పసిఫిక్ దేశాల్లోని నగరాలున్నాయి. ఈ లిస్ట్‌లో చైనా కన్నా భారత్‌కు చెందిన నగరాలు ఎక్కువగా ఉండటం విశేషం. అలాగే, తొలిసారి తొలిస్థానం(బెంగళూరు)కూడా పొందింది. గత రెండేళ్లుగా తొలి స్థానంలో నిలిచిన లండన్ ఈ సారి ఆరో స్థానానికి దిగజారింది. తాజా జాబితాలో అమెరికాకు చెందిన ఆస్టిన్, బోస్టన్, సియాటల్, సాన్‌ఫ్రాన్సిస్కో.. ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ, మెల్బోర్న్.. యూరప్ నుంచి డబ్లిన్, స్టాక్‌హోం.. తదితర నగరాలున్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యాలోని నైరోబీ పదో స్థానం సాధించింది.
ప్రముఖ స్తిరాస్థి సేవలు, నిర్వహణ, పెట్టుబడుల సంస్థ జేఎల్ఎల్(జోన్స్ లాంగ్ లాసెల్లే) గత నాలుగేళ్లుగా ప్రతీ సంవత్సరం అత్యంత వేగంగా మార్పు చెందుతున్న 30 ప్రపంచ నగరాల జాబితాను ‘సిటీ మోమెంటమ్ ఇండెక్స్’పేరుతో రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 134 నగరాలను ఎంపిక చేసుకుని, వాటిలో చోటు చేసుకుంటున్న సానుకూల మార్పులను 42 అంశాల ఆధారంగా నిర్ధారించి జేఎల్ఎల్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఆ 42 అంశాల్లో జీడీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలుండటం, రియల్ ఎస్టేట్ వృద్ధి.. కార్యకలాపాలు, సాంకేతిక సామర్ధ్యం, మౌలిక వసతులు, చవకగా సేవలు, కాంపిటీటివ్నెన్, అద్దెలు, విద్య, కన్సూమర్ మార్కెట్, వ్యాపార సన్నద్ధత, సాంకేతిక అనుసంధానత, పర్యావరణం, సృజనాత్మకత, ఉద్యోగిత, లేబర్ మార్కెట్, జీవన నాణ్యత.. మొదలైనవి ఉంటాయి.