అనూహ్య హత్య కేసు
సాక్షి, ముంబై: అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
మరో రెండు మూడు రోజుల్లో....
పోలీసులతోపాటు అందరు ఎదురుచూస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ మరో రెండు మూడు రోజుల్లో వచ్చేఅవకాశాలున్నాయి. దీని గురించి ముంబై కలీనాలోని ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీస్’ డెరైక్టర్ డాక్టర్ ఎంకె మాల్వే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు ఫోరెన్సిక్ నివేదిక ఇంకా తయారుకాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక అందే అవకాశముందని తెలిపారు.
దర్యాప్తులో కనిపించని పురోగతి...
నగరంలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు అదుపులోకి తీసుకున్నారని చెప్పిన నిందితులనుంచి కూడా పెద్దగా ఆధారాలేవీ లభించకపోవడంతోవారిని కూడా విడిచిపెట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు.