ఒక్క కాల్‌తో కొలిక్కి..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అనేది ఓ కల. ఆ కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించారు. వైఎస్ఆర్ మృతి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గృహ లబ్ధిదారులకు బిల్లుల విషయంలో పలు అవాంతరాలు వచ్చాయి. లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గృహనిర్మాణశాఖ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ వైద్యం భాస్కర్ ప్రత్యేక చొరవతో ఈ నూతన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు తమ ఇంటి వద్ద నుంచే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పూర్తిచేసిన భాస్కర్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నూతన ఆవిష్కరణకు తెరతీశారు.
80990 44858 సెల్ నంబర్‌కు జిల్లాలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు ఒక్క ఫోన్‌కాల్ చేసి తమ సమస్యను చెప్పవచ్చు. ఇళ్ల బిల్లులు రాకపోయినా, ఆలస్యం అయినా, పేరు, ఇంటిపేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, తదితర వివరాలు తప్పుగా ముద్రితమైనా.. ఇతర సమస్యలు ఏమైనా సరే చెప్పవచ్చు. వాయిస్ రికార్డు ద్వారా వచ్చిన ఈ సమస్యలను పీడీ, జిల్లాస్థాయిలో హౌసింగ్ విభాగం ముఖ్య అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
నంబర్ పనిచేసే విధానం...
రోజులో 24 గంటల పాటు పనిచేసే 80990 44858 నంబరుకు ఫోన్ చేసిన తరువాత అందులో ఇచ్చే సూచనల ప్రకారం అవసరమైనవారితో మాట్లాడవచ్చు.
మీరు ఆఫీస్ మేనేజర్‌తో మాట్లాడాలంటే 1 నొక్కాలి.
కొత్తగూడెం ఈఈ కార్యాలయానికి ఫోన్ చేయాలంటే 2.
పాల్వంచ ఈఈ కారా్యాలయానికి ఫోన్ చేయాటంలే 3.
భద్రాచలం ఈఈ కార్యాలయానికి ఫోన్ చేయాలంటే 4.
ప్రాజెక్టు డెరైక్టర్ వైద్యం భాస్కర్‌తో మాట్లాడాలంటే 5 నొక్కాలి.
మీ సమస్యను లబ్ధిదారుల కేర్ సెంటర్‌కు తెలపాలంటే 6 నొక్కాలి.
మీ సమస్యను రికార్డు చేయాలనుకుంటే 7 నొక్కాలి.
ఎగ్జిట్ కావాలనుకుంటే 8 నొక్కాలి.
కాల్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎంఎస్), బెనిఫిషరీ కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్(బీసీఎంఎస్) అనే రెండు దశల్లో ఈ నూతన వ్యవస్థ ద్వారా సమస్యలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తారు. సీఎంఎస్ విధానంలో లబ్ధిదారులు ఫోన్ చేయగానే స్వాగతం పలుకుతుంది. సమస్యను వాయిస్ రికార్డు ద్వారా కూడా వినిపించవచ్చు. ఆప్షన్ ఎన్నుకుని తమకు కావల్సిన అధికారితో కూడా మాట్లాడవచ్చు. వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చిన కాల్ బెనిఫిషరీ కాల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత సంబంధిత అధికారికి మెయిల్ ద్వారా అందుతుంది.
ప్రతి సమస్యకు ఒక యూజర్ ఐడీ క్రియేట్ చేయబడి లబ్ధిదారుకు సంక్షిప్త రూపంలో వెంటనే ఎస్ఎంఎస్ వెళుతుంది. సమస్యలను సంబంధిత పర్యవేక్షకులు, ఏఈలకు పంపిస్తారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంటుంది.