ease
-
తగ్గనున్న టమాటా ధరలు
దేశంలో టమాటా ధరలు మరింత తగ్గనున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కిలో రూ.75 కి పెరిగిన రిటైల్ టమాటా ధర, దక్షిణాది రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగుపడటంతో రాబోయే వారాల్లో తగ్గుతుందని ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.ధరల పెరుగుదలకు కారణాలు"ఢిల్లీతోపాటు కొన్ని ఇతర నగరాల్లో టమాటా, బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వర్షపాతం కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల వినియోగ ప్రాంతాల్లో ధరలు పెరిగాయి" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పీటీఐకి తెలిపారు. న్యూఢిల్లీలో టమాటా ధర కిలోకు రూ.75కి పెరిగింది. అయితే భారీ వర్షాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించకపోతే తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు.మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జూలై 12న ఢిల్లీలో రిటైల్ టమాటా ధర కిలోకు రూ.75గా ఉంది. ముంబైలో రూ.83, కోల్‌కతా రూ.80లుగా టమాటా ధరలు నమోదయ్యాయి. జూలై 12న దేశవ్యాప్తంగా టమాటా సగటు రిటైల్ ధర కేజీకి 65.21 లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.53.36 ఉండేది.టమాటా ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా అవుతోంది. “ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి హైబ్రిడ్ టమాటాలు దేశ రాజధానికి చేరుకోవడంతో ధరలు తగ్గుతాయి” అని అధికారి తెలిపారు.సబ్సిడీతో కూడిన టమాటా అమ్మకాలను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించడం లేదు. గత ఏడాది కిలో ధర రూ.110 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చర్యను అమలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక నుంచి సరఫరా మెరుగుపడటంతో 1-2 వారాల్లో ధరలు సాధారణ స్థితికి వస్తాయని అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఈజీ ట్రిప్ ప్లానర్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సరీ్వసుల కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 46 కోట్లకు చేరింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. ఈజ్‌మైట్రిప్ బ్రాండుతో సరీ్వసులందించే కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 136 కోట్ల నుంచి 161 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 83 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు పెరిగాయి. ఎయిర్ టికెటింగ్ బిజినెస్‌కుతోడు హోటళ్లు, హాలిడేస్, ట్రాన్స్‌పోర్టేషన్ తదితర విభాగాలలోనూ సేవలను విస్తరిస్తున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్ పిట్టి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఈజీ ట్రిప్ షేరు బీఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 51 వద్ద ముగిసింది. -
క్షేత్ర స్థాయిలో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే
సాక్షి, ఒంగోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా జీవన సౌలభ్యం(ఈజ్ ఆఫ్ లివింగ్) సర్వే చేపట్టారు. ఎంపీడీవోలు, ఈవోఆర్డీల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 1038 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపుగా 36 లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం 884 గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, జగనన్న చేదోడు, ఆటోవాలాలు, టైలర్లు, బార్బర్లకు ఏటా రూ.పది వేలు.. ఇలా అనేక సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు పేద కుటుంబాలకు వరంలా మారాయి. రైతులకు ఉచిత బోర్లు వేయించే పథకం ప్రారంభమైంది. అయితే ఈ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. 59 శాతంపైగా సర్వే పూర్తి ఈవోఎల్ సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 17 అంశాలపై 32 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. కనీస అవసరాలైన గ్యాస్ కనెక్షన్, కరెంట్, రైస్ కార్డు, జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన తదితర అంశాలపై సర్వే కొనసాగుతోంది. ఇంకా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సర్వే జరుగుతోంది. యువతకు జీవనోపాధిని కల్పించే నైపుణ్యా శిక్షణ తరగతులు, జీవిత బీమా, ప్రమాద బీమా, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, గృహ నిర్మాణ సదుపాయంపై ప్రజలను ప్రశ్నలు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సర్వే 59 శాతంపైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఎలాంటి పథకాలు అందిస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయో సరి చూసుకోవడానికి ఈ సర్వే చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలను జిల్లా పరిషత్ సీఈవో కైలాష్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు. -
ఆర్ట్ ఆఫ్ లివింగ్
‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు ప్రబోధన్. డయాస్ కింద కూర్చొని కొందరు, నిలబడి కొందరు అతడి మాటల్ని వింటున్నారు. ప్రబోధన్ స్పీచ్ ఎక్కడున్నా అంతే! కుర్చీలు సరిపోవు. బాగా పేరున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ గురు.. ప్రబోధన్. నిలబడి ఉన్నవారిలో ధించాక్ కూడా ఉన్నాడు. నిజానికి అంతకుముందు వరకు అతడు కూర్చొనే ఉన్నాడు. ప్రబోధన్ చెబుతున్నది నచ్చక లేచి నిలబడ్డాడు. అయితే అక్కడి నుంచి వెళ్లడానికి నిలబడినవాడు, వెళ్లకుండా అక్కడే నిలబడి ప్రబోధన్ వైపు చూశాడు. ‘‘ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే.. మిస్టర్ ప్రబోధన్?’’ అని అడిగాడు. అది అడిగినట్లుగా లేదు. అరిచినట్లుగా ఉంది. డయాస్ మీది నుంచి ధించాక్ వైపు చూశాడు ప్రబోధన్. ధించాక్ మొదటి వరుసలోనే ఉన్నాడు కాబట్టి అతడికి ఇతడు, ఇతడికి అతడు స్పష్టంగా కనిపిస్తున్నారు. ‘‘మీ పేరు చెప్పగలరా?’’ అడిగాడు ప్రబోధన్. ‘‘నేను నా పేరు చెప్పాక మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితే నాకు మాత్రమే మీరు సమాధానం చెప్పినట్లవుతుంది. నేను కోరుకుంటున్నదేమిటంటే.. ప్రశ్న నాదే అయినా మీరు చెప్పబోయే సమాధానం అందరిదీ అవ్వాలని’’ అన్నాడు ధించాక్. ‘‘వెల్, మీ పేరు అక్కర్లేదు. మీ ప్రశ్ననే మీరు మరొకసారి రిపీట్ చెయ్యగలరా? నేను అనుకోవడం ఏంటంటే మీ ప్రశ్న.. డయాస్ కింద ఉన్నవాళ్లెవరికైనా అర్థం కాకపోయుంటే, మీరు మీ ప్రశ్నను రిపీట్ చెయ్యడం ద్వారా, ఆ ప్రశ్నకు నేను ఇవ్వబోయే సమాధానం వారికి చక్కగా అర్థమౌతుందని’’ అన్నాడు ప్రబోధన్. ఆ భావాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు ధించాక్. ‘‘ఓకే.. ప్రబోధన్. నా పేరు చెప్తాను. కానీ నా పేరు విన్నప్పుడు ఆ పేరు గురించి మరింత క్లియర్‌గా తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కలగవచ్చు. పర్వాలేదా’’ అని అడిగాడు. ‘‘ష్యూర్. కానీ మీ పేరును చెప్పమని నేను అడిగింది కేవలం నా సంబోధనా సౌలభ్యం కోసమే. అది సౌలభ్యంతో పాటు, ఆసక్తితో కూడిన సందేహాన్నీ కలుగజేస్తుందని మీకనిపిస్తే ఆ సందేహాన్ని క్లియర్చేయాలని మీరు అనుకోవడంలో తప్పేముంది?’’ అన్నాడు ప్రబోధన్. ఆ మాటకు ధించాక్ అహం దెబ్బతింది.నిజానికి ధించాక్ పేరు వెనుక పెద్ద కథేమీ లేదు. కాలేజీ రోజుల్లో అతడెప్పుడూ జోష్‌గా ఉండేవాడు. ధించాక్.. ధించాక్.. అంటూ నోట్లోంచి బీట్ ఇస్తుండేవాడు. అలా అతడికి ఆ పేరు స్థిరపడిపోయింది. ‘‘సరే ప్రబోధన్.. చెప్తాను. నా పేరు ధించాక్’’ అన్నాడు ధించాక్. ‘‘ఒకే దెన్.. మిస్టర్ ధించాక్.. మీ ప్రశ్నను రిపీట్ చెయ్యగలరా..’’ అడిగాడు ప్రబోధన్. ‘‘తప్పకుండా మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు ధించాక్. ‘‘మరైతే.. ధించాక్.. నాదొక విన్నపం. మీరు డయాస్ మీదకు వస్తే బాగుంటుంది. రెండు మైకులు కూడా ఉన్నాయి. మన సంభాషణ మరికొంతసేపు కొనసాగే పరిస్థితి ఏర్పyì తే, అవిరెండూ మనకు తోడ్పడతాయి’’ అన్నాడు ప్రబోధన్. వెంటనే డయాస్ పైకి వెళ్లాడు ధించాక్. కింద ఉన్నవాళ్లంతా ఆసక్తిగా తలల్ని పైకెత్తి, ఆ తలల్ని అలా ఉంచేశారు. వాళ్లదంతా యంగ్ బ్లడ్. లైఫ్ గురించి ఏదో తెలుసుకోవాలని, లైఫ్‌లో ఏదో సాధించాలని తపన ఉన్నవాళ్లు. డయాస్ పైకి వచ్చాక ధించాక్ మైక్ అందుకుని, ప్రబోధన్ వైపు చూస్తూ.. ‘‘నేను నా ప్రశ్నను రిపీట్ చేస్తే సమాధానం చెబుతానన్నారు. అయితే అంతకన్నా ముందు మీరు మీ స్టేట్మెంట్ని రిపీట్ చెయ్యాలి. ఎందుకంటే మీ స్టేట్మెంట్ నుంచే నాలో ఆ ప్రశ్న తలెత్తింది’’ అన్నాడు!ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు ప్రబోధన్. ధించాక్ తనను ఎక్కడ అడ్డుకున్నాడో.. సరిగ్గా అక్కడివెళ్లి ఆగాడు. ‘‘ఓకే ఫోక్స్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు. వెంటనే అందుకున్నాడు ధించాక్. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా?’’ అని అడిగాడు. ‘‘నేనన్న ‘ఎవరికీ’ అంటే.. ‘మనుషులు’ అని. మీరు అడిగిన ‘దేనికీ’ అంటే.. పరిస్థితులు అని. మనుషుల వల్ల పరిస్థితులు, పరిస్థితుల వల్ల మనుషులు ప్రభావితం కావడం ఉంటుంది కనుక.. మనుషులకు గానీ, పరిస్థితులకు గానీ దేనికీ భయపడకుండా ఉండడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ మిస్టర్ ధించాక్’’ అని చెప్పాడు ప్రబోధన్. ‘‘మరి దెయ్యాలకు కూడానా.. భయపడకుండా ఉండడం’’ అడిగాడు ధించాక్. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మైక్ మూతి పగిలిపోయేలా పెద్దగా నవ్వాడు ప్రబోధన్.తర్వాత కొంతసేపు ఇద్దరి మధ్యా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసక్తికరంగా చర్చ ముగిసింది.సాయంత్రం ఏడింటికి మొదలైన కార్యక్రమం రాత్రి పదకొండుకు పూర్తయింది. అంతా వెళ్లిపోయారు. ‘‘మీరు నాకు నచ్చారు ధించాక్. ఈ రాత్రి మీతో కలిసి మా ఇంట్లో డిన్నర్ చేయాలని నేను ఆశపడుతున్నాను’’ అన్నాడు ప్రబోధన్. నవ్వాడు ధించాక్. ఇద్దరూ ప్రబోధన్ కారులో కూర్చున్నారు. ప్రబోధన్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీట్లో కూర్చున్నాడు ధించాక్. మొదట ప్రబోధన్ పక్కన కూర్చోబోతుంటే, ‘‘కంఫర్ట్‌గా ఉంటుంది వెనుకే కూర్చోండి’’ అన్నాడు ప్రబోధన్... డోర్ తీసి పట్టుకుంటూ.‘‘కంఫర్ట్ నాకా? మీకా?’’ అని పెద్దగా నవ్వాడు ధించాక్. ప్రబోధన్ ఇల్లు అక్కడికి కనీసం అరగంట దూరంలో ఉంటుంది. పొలాల మధ్యగా దారి. ఆ దారిలోంచి కారు వెళ్లాలి. దారి పక్కన కరెంట్ పోల్స్ ఇంకా పడలేదు. చీకట్లోంచి తను వేసుకున్న లైట్ల వెలుగులో కారు మెల్లిగా వెళుతోంది. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే భయపడకుండా బతకడం కాదేమో మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు సడెన్‌గా ధించాక్. నవ్వాడు ప్రబోధన్. ‘‘మరేంటి? భయపెట్టి బతకడమా?’’ అన్నాడు. ‘‘రెండూ కాదు. భయపడుతూ బతకడం! భయం లేకపోతే మనం జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యం మిస్టర్ ప్రబోధన్. జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..’’‘‘ఆ.. చెయ్యకపోతే?’’ అన్నాడు ప్రబోధన్. ధించాక్ మాట్లాడలేదు.‘‘చెప్పండి ధించాక్? జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..?’’ అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనుక.. ధించాక్ లేడు!! - మాధవ్ శింగరాజు -
ప్రింట్, నిర్మాణం, రిటైల్ రంగంలో మరిన్ని ఎఫ్‌డీఐలు
న్యూడిల్లీ: ప్రింట్ మీడియా, నిర్మాణం, రిటైల్ రంగాల్లో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అంశంపై బుధవారం ఆర్థిక మంత్రిత్వశాఖలో వివరణాత్మక చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదనలపై తుది ఆమోదం పొందేందుకు కేంద్ర, వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర కేబినెట్‌ను సంప్రదించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్ధిక వృద్ధికి ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణంలో మరిన్ని ఎఫ్‌డిఐలను ఆకర్షించనుందని తెలిపాయి. 2017-18 సంవత్సర ఆర్థిక బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మేరకు ఈ కసరత్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులపై దృష్టిపెట్టింది. సింగిల్ బ్రాండు, బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో పాలసీని సులభతరం చేస్తుంది. ఒకే బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐని కొన్ని పరిస్థితులతో ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం, 49 శాతం వరకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి ఉంది కానీ ఆ పరిమితి దాటితే ప్రభుత్వం ఆమోదం అవసరం. అంతేకాదు, విదేశీ కంపెనీలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను అమ్మడం కోసం దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలు, పరిమితులతో, వార్తాపత్రికలు, శాస్త్రీయ మ్యాగజైన్ల ప్రచురణ లాంటి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోంది. అలాగే వివిధ కండిషన్లతో నిర్మాణ రంగ ప్రాజెక్టులలో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఈ విధానాన్ని కూడా మరింత సరళతరం చేసే ప్రతిపాదన సిద్ధం చేసింది. పూర్తికాని ప్లాట్లు, ఇతర ప్రాజెక్టులలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక భారతీయకంపెనీ అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఇండియన్ ఇన్వస్టీ కంపెనీకి అభివృద్ధి చెందిన ప్లాట్లను విక్రయించటానికి అనుమతి ఉంది. రహదారులు, నీటి సరఫరా, వీధి దీపాలు, నీటి పారుదల , మురికినీరు తదితర మౌలిక సదుపాయాలు ఉన్న ప్లాట్ల విక్రయానికి మాత్రమే అనుమతి. కాగా విదేశీ పెట్టుబడులు దేశం చెల్లింపుల సమతుల్యతను మెరుగుపర్చడంతో పాటు, ఇతర ప్రపంచ కరెన్సీలకు, ప్రత్యేకంగా అమెరికా డాలర్ వ్యతిరేకంగా రూపాయి విలువను మరింత బలోపేతం చేస్తుందనేది అంచనా. ఈ నేపథ్యంలోనే గత ఏడాది రక్షణ, పౌర విమానయాన, నిర్మాణం, అభివృద్ధి, ప్రైవేటు భద్రతా సంస్థలు, రియల్ ఎస్టేట్, న్యూస్ ప్రసారాలు సహా దాదాపు 12 సెక్టార్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: కాపు రిజ్వరేషన్ సాధికారిక వింగ్ చైర్మన్ పెమ్మా అంకమ్మరావు అధ్వర్యంలో అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో నిర్వహిస్తున్న వంగవీటి మోహన్ రంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లను మాజీ శాసనసభ్యుడు లింగంశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొరివి వినయ్ కుమార్, నిర్వాహకులు పెమ్మా అంకమ్మరావు, ఎస్.నరేష్, పెమ్మా శ్రీనివాసరావు, శృంగారపు శ్రీనివాసరావు, బి.వీరయ్య, తోట మధు, తల్వాకర్ జట్టు కెప్టెన్ ఎండి జావీద్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్ ఫలితాలు.. ఉదయం జరిగిన మ్యాచ్‌లో తల్వాకర్ జట్టు 41 పరుగుల తేడాతో మనోజ్ జట్టుపై విజయం సాధించింది. బ్యాటింగ్ చేపట్టిన మనోజ్ జట్టు 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి పరాజయం పాలైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఫణి జట్టు 8 వికెట్ల తేడాతో మెడికల్ మేనేజర్స్ జట్టుపై విజయం సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫణి జట్టు 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విజయం సాధించింది.