‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు ప్రబోధన్. డయాస్ కింద కూర్చొని కొందరు, నిలబడి కొందరు అతడి మాటల్ని వింటున్నారు. ప్రబోధన్ స్పీచ్ ఎక్కడున్నా అంతే! కుర్చీలు సరిపోవు. బాగా పేరున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురు.. ప్రబోధన్. నిలబడి ఉన్నవారిలో ధించాక్ కూడా ఉన్నాడు. నిజానికి అంతకుముందు వరకు అతడు కూర్చొనే ఉన్నాడు. ప్రబోధన్ చెబుతున్నది నచ్చక లేచి నిలబడ్డాడు. అయితే అక్కడి నుంచి వెళ్లడానికి నిలబడినవాడు, వెళ్లకుండా అక్కడే నిలబడి ప్రబోధన్ వైపు చూశాడు. ‘‘ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే.. మిస్టర్ ప్రబోధన్?’’ అని అడిగాడు. అది అడిగినట్లుగా లేదు. అరిచినట్లుగా ఉంది. డయాస్ మీది నుంచి ధించాక్ వైపు చూశాడు ప్రబోధన్. ధించాక్ మొదటి వరుసలోనే ఉన్నాడు కాబట్టి అతడికి ఇతడు, ఇతడికి అతడు స్పష్టంగా కనిపిస్తున్నారు. ‘‘మీ పేరు చెప్పగలరా?’’ అడిగాడు ప్రబోధన్. ‘‘నేను నా పేరు చెప్పాక మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితే నాకు మాత్రమే మీరు సమాధానం చెప్పినట్లవుతుంది. నేను కోరుకుంటున్నదేమిటంటే.. ప్రశ్న నాదే అయినా మీరు చెప్పబోయే సమాధానం అందరిదీ అవ్వాలని’’ అన్నాడు ధించాక్.
‘‘వెల్, మీ పేరు అక్కర్లేదు. మీ ప్రశ్ననే మీరు మరొకసారి రిపీట్ చెయ్యగలరా? నేను అనుకోవడం ఏంటంటే మీ ప్రశ్న.. డయాస్ కింద ఉన్నవాళ్లెవరికైనా అర్థం కాకపోయుంటే, మీరు మీ ప్రశ్నను రిపీట్ చెయ్యడం ద్వారా, ఆ ప్రశ్నకు నేను ఇవ్వబోయే సమాధానం వారికి చక్కగా అర్థమౌతుందని’’ అన్నాడు ప్రబోధన్. ఆ భావాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు ధించాక్. ‘‘ఓకే.. ప్రబోధన్. నా పేరు చెప్తాను. కానీ నా పేరు విన్నప్పుడు ఆ పేరు గురించి మరింత క్లియర్‌గా తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కలగవచ్చు. పర్వాలేదా’’ అని అడిగాడు. ‘‘ష్యూర్. కానీ మీ పేరును చెప్పమని నేను అడిగింది కేవలం నా సంబోధనా సౌలభ్యం కోసమే. అది సౌలభ్యంతో పాటు, ఆసక్తితో కూడిన సందేహాన్నీ కలుగజేస్తుందని మీకనిపిస్తే ఆ సందేహాన్ని క్లియర్‌చేయాలని మీరు అనుకోవడంలో తప్పేముంది?’’ అన్నాడు ప్రబోధన్. ఆ మాటకు ధించాక్ అహం దెబ్బతింది.నిజానికి ధించాక్ పేరు వెనుక పెద్ద కథేమీ లేదు. కాలేజీ రోజుల్లో అతడెప్పుడూ జోష్‌గా ఉండేవాడు. ధించాక్.. ధించాక్.. అంటూ నోట్లోంచి బీట్ ఇస్తుండేవాడు. అలా అతడికి ఆ పేరు స్థిరపడిపోయింది. ‘‘సరే ప్రబోధన్.. చెప్తాను. నా పేరు ధించాక్’’ అన్నాడు ధించాక్. ‘‘ఒకే దెన్.. మిస్టర్ ధించాక్.. మీ ప్రశ్నను రిపీట్ చెయ్యగలరా..’’ అడిగాడు ప్రబోధన్. ‘‘తప్పకుండా మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు ధించాక్. ‘‘మరైతే.. ధించాక్.. నాదొక విన్నపం. మీరు డయాస్ మీదకు వస్తే బాగుంటుంది. రెండు మైకులు కూడా ఉన్నాయి. మన సంభాషణ మరికొంతసేపు కొనసాగే పరిస్థితి ఏర్పyì తే, అవిరెండూ మనకు తోడ్పడతాయి’’ అన్నాడు ప్రబోధన్. వెంటనే డయాస్ పైకి వెళ్లాడు ధించాక్. కింద ఉన్నవాళ్లంతా ఆసక్తిగా తలల్ని పైకెత్తి, ఆ తలల్ని అలా ఉంచేశారు. వాళ్లదంతా యంగ్ బ్లడ్. లైఫ్ గురించి ఏదో తెలుసుకోవాలని, లైఫ్‌లో ఏదో సాధించాలని తపన ఉన్నవాళ్లు.
డయాస్ పైకి వచ్చాక ధించాక్ మైక్ అందుకుని, ప్రబోధన్ వైపు చూస్తూ.. ‘‘నేను నా ప్రశ్నను రిపీట్ చేస్తే సమాధానం చెబుతానన్నారు. అయితే అంతకన్నా ముందు మీరు మీ స్టేట్‌మెంట్‌ని రిపీట్ చెయ్యాలి. ఎందుకంటే మీ స్టేట్‌మెంట్ నుంచే నాలో ఆ ప్రశ్న తలెత్తింది’’ అన్నాడు!ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు ప్రబోధన్. ధించాక్ తనను ఎక్కడ అడ్డుకున్నాడో.. సరిగ్గా అక్కడివెళ్లి ఆగాడు. ‘‘ఓకే ఫోక్స్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు. వెంటనే అందుకున్నాడు ధించాక్. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా?’’ అని అడిగాడు. ‘‘నేనన్న ‘ఎవరికీ’ అంటే.. ‘మనుషులు’ అని. మీరు అడిగిన ‘దేనికీ’ అంటే.. పరిస్థితులు అని. మనుషుల వల్ల పరిస్థితులు, పరిస్థితుల వల్ల మనుషులు ప్రభావితం కావడం ఉంటుంది కనుక.. మనుషులకు గానీ, పరిస్థితులకు గానీ దేనికీ భయపడకుండా ఉండడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ మిస్టర్ ధించాక్’’ అని చెప్పాడు ప్రబోధన్. ‘‘మరి దెయ్యాలకు కూడానా.. భయపడకుండా ఉండడం’’ అడిగాడు ధించాక్. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మైక్ మూతి పగిలిపోయేలా పెద్దగా నవ్వాడు ప్రబోధన్.తర్వాత కొంతసేపు ఇద్దరి మధ్యా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసక్తికరంగా చర్చ ముగిసింది.సాయంత్రం ఏడింటికి మొదలైన కార్యక్రమం రాత్రి పదకొండుకు పూర్తయింది. అంతా వెళ్లిపోయారు. ‘‘మీరు నాకు నచ్చారు ధించాక్. ఈ రాత్రి మీతో కలిసి మా ఇంట్లో డిన్నర్ చేయాలని నేను ఆశపడుతున్నాను’’ అన్నాడు ప్రబోధన్. నవ్వాడు ధించాక్. ఇద్దరూ ప్రబోధన్ కారులో కూర్చున్నారు. ప్రబోధన్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీట్లో కూర్చున్నాడు ధించాక్. మొదట ప్రబోధన్ పక్కన కూర్చోబోతుంటే, ‘‘కంఫర్ట్‌గా ఉంటుంది వెనుకే కూర్చోండి’’ అన్నాడు ప్రబోధన్... డోర్ తీసి పట్టుకుంటూ.‘‘కంఫర్ట్ నాకా? మీకా?’’ అని పెద్దగా నవ్వాడు ధించాక్.
ప్రబోధన్ ఇల్లు అక్కడికి కనీసం అరగంట దూరంలో ఉంటుంది. పొలాల మధ్యగా దారి. ఆ దారిలోంచి కారు వెళ్లాలి. దారి పక్కన కరెంట్ పోల్స్ ఇంకా పడలేదు. చీకట్లోంచి తను వేసుకున్న లైట్‌ల వెలుగులో కారు మెల్లిగా వెళుతోంది. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే భయపడకుండా బతకడం కాదేమో మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు సడెన్‌గా ధించాక్. నవ్వాడు ప్రబోధన్. ‘‘మరేంటి? భయపెట్టి బతకడమా?’’ అన్నాడు. ‘‘రెండూ కాదు. భయపడుతూ బతకడం! భయం లేకపోతే మనం జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యం మిస్టర్ ప్రబోధన్. జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..’’‘‘ఆ.. చెయ్యకపోతే?’’ అన్నాడు ప్రబోధన్. ధించాక్ మాట్లాడలేదు.‘‘చెప్పండి ధించాక్? జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..?’’ అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనుక.. ధించాక్ లేడు!!
- మాధవ్ శింగరాజు
ఆర్ట్ ఆఫ్ లివింగ్
Published Sun, Aug 19 2018 12:48 AM | Last Updated on Sun, Aug 19 2018 12:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment