బ్యాంకులపై ఈడీ ముమ్మర దాడులు
న్యూఢిల్లీ: నగదు బదిలీ, హవాలా వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చురుగ్గా కదులుతోంది. అక్రమ లావాదేవీల నేపథ్యంలో వివిధ బ్యాంకుల కార్యాలయాల రికార్డుల పరిశీలన, తనిఖీని వేగవంతం చేసింది. తాజాగాదేశవ్యాప్తంగా 50కిపైగా బ్యాంకుల్లో దాడులు నిర్వహించింది. బుధవారం ఆయా బ్యాంకు శాఖల్లో రికార్డుల విచారణ నిర్వహిస్తోంది.
డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు ఉన్నతాధికారులే అక్రమాలకు తెరలేపడం, నగదు అక్రమ లావాదేవీలు భారీగాపెరిగిన నేపథ్యంలో ఈడీ సీరియస్ గా స్పందిస్తోంది. నవంబర్ 30న దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పీఎంఎల్ఏ ఈ రెండు చట్టాలను అమలు చేసే కేంద్ర సంస్థ ఈడీ.
పెద్ద నోట్లు రద్దు తర్వాత బ్యాంకుల్లో మేనేసర్లు సహా, ఇతర బ్యాంకు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడుతుండడంతో ఇప్పటికే రంగంలోకి దిగింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే యాక్సిస్ బ్యాంకు కు చెందిన ఇద్దరు బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసులునమోదు చేసింది. అలాగే సుమారు 19 మంది ని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.