విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌పై విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో మూడువేల మంది విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని పలు సబ్స్టేషన్లలో సిబ్బంది లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు విద్యుత్ కోతలతో అల్లాడుతుంటే, మరోవైపు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో జనాలకు కష్టాలు పెరిగాయి.
కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బిల్లులు చెల్లింపు కేంద్రాలు సైతం పనిచేయలేదు. డిమాండ్స్‌ను ప్రభుత్వం తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు జేఏసీ నాయకులు హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగులు నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్లో ఆదివారం అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు సమావేశమై విద్యుత్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. తొలుత ఎస్ఈ కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపారు. ఆనంతరం విద్యుత్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
విద్యుత్ జేఏసీ చైర్మన్ రమేష్, కన్వీనర్ అనీల్‌కుమార్ మాట్లాడుతూ ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో యాజమాన్యాలు ఉద్యోగుల పీఆర్సీ(పే రివిజన్ కమిషన్)ని 27.5 శాతం పెంచుతూ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ఫైలుపై గవర్నర్ సంతకం చేయకుండా పక్కన పెట్టడం సరికాదన్నారు. 14 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 14 సంవత్సరాల సర్వీసు కంటే ఎక్కువ ఉన్నవారికి మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు.