ఐదుగురు ఇంజనీర్లపై వేటు
‘మిషన్’లో అక్రమాలపై ప్రభుత్వం కొరడా
ఈఈ, డీఈఈ, ఏఈఈలతో పాటు మరో ఇద్దరు ఇంజనీర్ల సస్సెన్షన్
మైనర్ ఇరిగేషన్లో కలకలం
వరంగల్ : మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ములుగు డివిజన్ పరకాల మండలంలోని చెరువులో జరిగిన అక్రమాలకు బాధ్యులను చేస్తూ ఒకేసారి ఐదుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. పరకాల మండలంలోని పెద్ద ఎర్రకుంట చెరువు మరమ్మతుల్లో జరిగిన అవకతవకలపై ములుగు ఈఈ గోపాలరావు, అప్పటి పరకాల డీఈఈ బి.వెంకటేశ్వర్లు (ఏటూరు నాగారం డీఈఈగా పనిచేస్తున్నారు), ఏఈఈ శరత్‌బాబు, ఈ పనులకు నాణ్యత ధ్రువీకరించిన డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ రఘుపతి సస్పెండ్ అయ్యారు. ములుగు ఈఈ గోపాలరావు, డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ శరత్‌బాబుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కాగా, మిగిలిన క్వాలిటీ కంట్రోల్ డీఈఈ, ఏఈఈ ఉత్తర్వులు వారికి నేరుగా జారీ అయినట్లు సమాచారం.
మిషన్ కాకతీయ పనుల్లో అవకతవకలు పాల్పడితే చర్యలు తప్పవని సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు పలుమార్లు అధికారులను హెచ్చరించారు. అయినా అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర స్థాయి అధికారులతో తనిఖీలు నిర్వహించారు. చెరువు పూడిక తీత, మట్టి తరలింపు పేరిట కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు బిల్లులు చేసినట్లు తనిఖీల్లో నిర్ధారణ అయినట్టు సమాచారం. తనిఖీలు చేసిన బృందాల నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు సమాచారం. పరకాల పెద్ద ఎర్రకుంట చెరువు కట్ట ఉన్న దానికంటే ఎక్కువ రికార్డు చేసి బిల్లుల చెల్లింపులు చేశారు. ఈ పనులను తనిఖీ చేసిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సైతం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో బిల్లుల చెల్లింపులు జరిగాయి.
ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్ డివిజన్లలో మొదటి విడత పనుల్లో, రెండవ విడత పనుల కోసం నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటిలిజెన్స్ విభాగం రికార్డులను పరిశీలించి అక్రమాలు జరిగినట్లు నివేదికలను అందజేసినట్లు తెలిసింది. ములుగులో సుమారు 40శాతం చెరువు పనులను జిల్లాకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడితో ఎక్సెస్‌కు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన విషయాన్ని సైతం ఇంటలిజెన్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. ఈ విషయాలన సీరియస్‌గా తీసుకున్నSప్రభుత్వం.. అందుకు కారణమైన గోపాలరావుపై వేటు వేసింది. ఈఈ గోపాలరావు ఈనెల 30వ తేదీన పదవీ విరమణ పొందనున్నారు. చివరి సమయంలో కూడా వేటు వేయడంతో ప్రభుత్వం మిషన్ కాకతీయలో అక్రమాలపై సీరియస్‌గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో జరిగిన అక్రమాలపై ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం అక్కడి ఇంజనీర్లను వెంటాడుతోంది.