అమ్మాయికి ఏ లోటూ లేకుండా...!
కుమార్తె అంటే తండ్రికి మమకారం ఎక్కువ. బాధ్యత ఇంకాస్త ఎక్కువ. ఏ లోటూ రానీయకూడదన్నదే ప్రతి తండ్రి ఆలోచన. ఇవన్నీ ఆచరణ రూపం దాల్చాలంటే... ఆమె భవిష్యత్తు అనుకున్నట్టు సాగిపోవాలంటే ప్రతి తల్లిదండ్రికీ ప్రణాళిక కావాలి. అమ్మాయిల విద్య, వివాహం ఈ రెండూ ప్రధానం. ఖరీదైనవి కూడా. వాటి కోసం ప్రణాళిక వేసుకుని ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. కుమార్తె విషయంలో కీలకమైన అంశాలను కవర్ చేసేలా మెరుగైన పెట్టుబడులు ఎలా చేయాలన్నదే ఈ కథనం...
యులిప్ ప్లాన్లలో ఏది బెటర్?
కుమార్తె అవసరాల కోసం, భవిష్యత్ కోసం కొంత ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను (యులిప్) పరిశీలించొచ్చు. ఇది బీమా–పెట్టుబడి కలిసిన పథకం. ఈ విభాగంలో పరిశీలించదగ్గ మెరుగైన ప్లాన్ ‘ఎడెల్వీజ్ టోకియో వెల్త్ ప్లస్’. దీన్లో చాలా సానుకూలతలున్నాయి. పాలసీదారులకు బీమా రక్షణతోపాటు, ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో పెట్టుబడులు ద్వారా రాబడులు అందిస్తుంది. ఇందులోనే రైజింగ్ స్టార్ అనే అదనపు ఫీచర్ ఉంది. పాలసీ తీసుకునే సమయంలోనే ఈ ఫీచర్‌ను ఎంచుకోవాలి. రైజింగ్ స్టార్ ఎంచుకుంటే పేరెంట్ పాలసీ హోల్డర్‌గా మారతారు. అంతేకాదు!! కుమార్తెకూ బీమా కవరేజీ అందుతుంది. అంటే పేరెంట్కు, పాపకు ఇద్దరికీ బీమా కవరేజీ లభిస్తుంది. ఒకవేళ పేరెంట్కు ఏదైనా జరిగి మరణిస్తే కుమార్తెకు వెంటనే ఏకమొత్తంలో పరిహారం అందుతుంది. పాలసీదారుడి వయసుపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. పేరెంట్ మరణించాక... ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కాల వ్యవధి ముగిసేదాకా యథావిధిగా కొనసాగుతుంది. బీమా కంపెనీయే మిగిలి ఉన్న కాలానికి సంబంధించిన అన్ని ప్రీమియంలను పేరెంట్ మరణించిన వెంటనే చిన్నారి ఫండ్ విలువకు జమ చేస్తుంది. దాంతో మిగిలి ఉన్న కాలంలో ఆ మొత్తం మరింతగా వృద్ధి చెందే వీలుంటుంది. ఇదే ఆకర్షణీయాంశం. మిగిలిన చైల్డ్ యులిప్ పాలసీల్లో పేరెంట్ మరణిస్తే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియంను వార్షికంగానే బీమా కంపెనీ చెల్లిస్తుంటుంది. ఎడెల్వీజ్ వెల్త్ ప్లస్‌లో కాల వ్యవధి తీరాక ఫండ్ విలువ ఎంతుంటే ఆ మేరకు తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా జరిగితే ఫండ్ విలువ లేదా బీమా మొత్తం ఈ రెండింటిలో ఏది అధిక విలువ ఉంటే దాన్ని పేరెంట్ లేదా నామినీకి చెల్లిస్తారు.
మ్యూచువల్ ఫండ్స్ కోసమైతే... హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్!
మ్యూచువల్ ఫండ్స్ సైతం చిన్నారుల కోసం ఎంచుకోవచ్చు. ఈ విషయంలో హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. లక్ష్యానికి దీర్ఘకాలం (10–15 ఏళ్లు) ఉండి మోస్తరు రిస్క్ భరించే వారు పరిశీలించొచ్చు. 10 ఏళ్ల కాలంలో ఈ పథకం పనితీరు బెంచ్‌మార్క్ కంటే, ఇతర పోటీ ఈక్విటీ పథకాల కంటే ఎక్కువే ఉంది. వార్షికంగా చూస్తే రాబడులు 14.9 శాతం చొప్పున ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ స్టడీ ప్లాన్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్ కంటే హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్‌లోనే రాబడులు ఎక్కువ. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు పోటీ పథకాలతో పోలిస్తే సగటున 3–5 శాతం ఎక్కువే ఉన్నాయి. సిప్ విధానంలో పెట్టుబడులపై గడిచిన పదేళ్ల కాలంలో వార్షికంగా 17.6 శాతం రాబడులు ఇచ్చింది. ఈ పథకంలో ఈక్విటీలో పెట్టుబడులు 70–73 శాతంగా ఉంటున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 50 నుంచి 60 స్టాక్స్ వరకు ఉన్నాయి. రిస్క్ పరిమితం చేసేందుకు గాను మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు కేటాయింపులు 20–22 శాతానికి మించడం లేదు. డెట్‌లోనూ అధిక భద్రత కలిగిన ప్రభుత్వ సాధనాలు, ఏఏఏ రేటింగ్ ఉన్న వాటిని ఎంచుకుంటోంది. మార్కెట్లలో అస్థిరతలు పెరిగినప్పుడల్లా నగదు నిల్వలను 5–7 శాతం ఉండేలా చూస్తోంది. లాకిన్ పీరియడ్ మూడేళ్లు లేదా చిన్నారికి 18 ఏళ్లు... ఈ రెండింటిలో ఏది ఆలస్యమైతే అదే లాకిన్ పీరియడ్‌గా ఉంటుంది. లాకిన్ పీరియడ్ లేని ఆప్షన్లో పెట్టుబడి పెడితే... తొలి మూడేళ్లలోపే వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ మూడు శాతం వరకు ఎగ్జిట్‌లోడ్ భరించాల్సి ఉంటుంది.