సూపర్... షాపింగ్!
జాగ్రత్త
సూపర్మార్కెట్లో షాపింగ్ చేయడంలో ఒక సౌకర్యం ఉంటుంది. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువుల్లో చాలా భాగం ఒకే ప్రదేశంలో దొరుకుతాయి. జాబితా రాసుకోకుండా షాపులో అడుగుపెట్టినా సరే... పోపుల డబ్బాలో ఆవాలు అడుగుకు చేరాయని, ఉప్పు పాకెట్ని ఆసాంతం డబ్బాలో పోసి ప్యాకెట్‌ను పారేశామనీ గుర్తుకు వస్తాయి. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ, సూపర్‌మార్కెట్ మాయాజాలంలో చెప్పలేనన్ని చమత్కారాలుంటాయి. వాటి మాయలో పడితే పర్సుకు చిల్లుపడడంతోపాటు ఇంటినిండా అవసరంలేని వస్తువులు పెరిగిపోతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు...
సాధారణంగా తాజా ఉత్పత్తులను లోపలగా పెట్టి పాత సరుకును చేతికందేలాగ పెట్టడం వ్యాపార లక్షణం. కాబట్టి అరల్లో ముందుగా కనిపిస్తున్నవి కాక లోపలగా అమర్చిన వాటిని తీసుకోవాలి.
ఒకటి కొంటే మరొకటి ఉచితం... ఆఫర్లో తీసుకున్నప్పటికీ ఎక్స్పైరీ డేట్ లోపు వాటిని ఉపయోగించగలమా లేదా అని చూసుకోవాలి. జామూన్ మిక్స్, కర్జూరాలకు ఈ ఆఫర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఏదో ఒకటి రెండు ఉత్పత్తులకు తక్కువ ధర పెట్టి వాటి మీద దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేయడం వ్యాపార సూత్రం. ఆ రెండింటి ఆధారంగా ఆ దుకాణంలో ధరలు తక్కువ అనే అనుకోకూడదు.
సూపర్మార్కెట్లో ట్రాలీకి బదులు బాస్కెట్ వాడితే బాస్కెట్ బరువు పెరిగేకొద్దీ అవసరం లేని చోట నిలపకుండా కొనుగోలు ముగించేస్తారు.
ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మనకు తెలియకుండానే బాస్కెట్లో ఇంటికి అవసరమైన పప్పుదినుసులు, సబ్బులు, షాంపూలకంటే బిస్కట్లు, చాక్లెట్లు, చిప్స్, జ్యూస్, తినుబండారాలే కనిపిస్తాయి.
కంటికి కనిపించే ఎత్తులో ఎక్కువ లాభం వచ్చే ఉత్పత్తులను పెట్టి, తక్కువ లాభం వచ్చే వాటిని పై అరల్లో, కింది అరల్లో సర్దుతారు. తల పెకైత్తి, కిందకు దించి కూడా చూసుకోవాల్సిందే.
రాత్రి ఆలస్యంగా షాపింగ్ చేస్తే దుకాణంలో రద్దీ ఉండదు. ఆఖరి గంటలో కూరగాయలు, పాలు, బ్రెడ్ వంటి (మరుసటి రోజుకు తాజాదనం కోల్పోయేవి) వాటి ధరలు తగ్గించవచ్చు.